
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) (jaggareddy) రాష్ట్ర పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. బిజెపి (bjp)కి వర్తించని కోవిడ్ రూల్స్ (covid rules) కేవలం కాంగ్రెస్ పార్టీ (congress party)కే వర్తిస్తాయా? అని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి (mahender reddy)ని నిలదీసారు జగ్గారెడ్డి.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శిక్షణా తరగతులకు పోలీసులు ఇప్పటివరకు అనుమతివ్వకపోవడంపై ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ (manikkam tagore) సోషల్ మీడియా వేదికన స్పందించారు. దీంతో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆర్ఎస్ఎస్ (rss) శిక్షణ తరగతులకు ఇదే హైదరాబాద్ (hyderabad) లో నిర్వహించుకోడానికి కేసీఆర్ సర్కార్ అనుమతివ్వడాన్ని జగ్గారెడ్డి గుర్తుచేసారు. కానీ కాంగ్రెస్ శిక్షణ తరగతులకు అనుమతి ఇవ్వాలని కోరినా పోలీసులు స్పందించడం లేదని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.
''నేను రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిని అడుగుతున్నా... బిజెపి వాళ్లకు లేని కోవిడ్ కేవలం మాకే ఉందా..? సెంట్రల్ పోలీస్, కేంద్ర సర్కార్ బీజేపీది కాబట్టి వాళ్లకి అనుమతి వచ్చిందా..? కాంగ్రెస్ ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో పవర్ లో లేదు కాబట్టి పర్మిషన్ ఇవ్వరా?'' అని డిజిపిని ప్రశ్నించారు.
Video
''కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన శిక్షణా తరగతులకు 120 నుండి 150 మంది మాత్రమే వస్తారు. ఆర్ఎస్ఎస్ మీటింగ్ కు 300మందికి పైనే హాజరయ్యారు. వాళ్లు ఎక్కడ కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. కానీ మేము కోవిడ్ నిబంధనలకు లోబడే శిక్షణ తరగతులను నిర్వహిస్తాం. కాబట్టి మా ఇంచార్జి ఠాగూర్ ట్వీట్ కు డిజిపి వెంటనే స్పందించాలి. కాంగ్రెస్ శిక్షణ తరగతులకు అనుమతి ఇవ్వాలి'' అని జగ్గారెడ్డి డిమాండ్ చేసారు.
ఇదిలావుంటే ఇటీవల జగ్గారెడ్డి వ్యవహారతీరు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతోంది. తెలంగాణ పిసిసి పగ్గాలు ఆశించి భంగపడ్డ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే తనకు దక్కని పదవి రేవంత్ రెడ్డికి దక్కడంతో జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయినా అదిష్టానం నిర్ణయాన్ని గౌరవించాల్సి వచ్చింది. కొంతకాలం అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో రేవంత్ తీరుపై అసంతృప్తి వ్యక్తంపరుస్తూ మీడియా ఎదుటే సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు జగ్గారెడ్డి.
కాంగ్రెస్ పార్టీలో కేవలం రేవంత్ రెడ్డి వల్లే ఊపు వచ్చిందన్న ప్రచారంపై జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. కొందరు సోషల్ మీడియాలో కావాలనే రేవంత్ కు హైప్ క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు. సమిష్టిగా పనిచేయడం వల్లే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని...ఏ ఒక్కరివల్లో సాధ్యం కాదని పలుమార్లు రేవంత్ కు చురకలు అంటిచారు.
గతంలో హుజురాబాద్, ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల సమయంలోనూ జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేసారు. ఇక ఇటీవల మంత్రి కేటీఆర్ సంగారెడ్డి పర్యటనకు వచ్చిన సమయంలో జగ్గారెడ్డి ఆయనతో చాలా చనువుగా వుండటం కొత్త ప్రచారానికి తెరతీసింది. జగ్గారెడ్డి కాంగ్రెస్ వీడి టీఆర్ఎస్ లో చేరతాడని ప్రచారం జరిగినా ఆయన దాన్ని ఖండిచారు.
అయినా కొద్దిరోజుల్లో జగ్గారెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. తెలంగాణ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ తో ఛాలెంజ్ చేసి మరీ రాజీనామాకు జగ్గారెడ్డి సిద్దమైనట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ రాజీనామా ప్రచారాన్ని జగ్గారెడ్డి ఖండించకుండానే తాను కాంగ్రెసు పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీని వీడినా ఇండిపెండెంట్ గా వుంటాను కానీ ఏ పార్టీలో చేరబోనని స్పష్టం చేసి రాజీనామా ప్రచారంపై సస్పెన్స్ కొనసాగించారు.