
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కాసేపట్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారులు హాజరు కానున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను సీఎం ఖరారు చేయనున్నారు. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై కేసీఆర్ ఈ సమావేశంలో మంత్రులు, అధికారులతో చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా పలు అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వార్షిక బడ్జెట్ తేదీల ఖరారు అనంతరం ఆమోదం కోసం గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు పంపనున్నారు.
ఇక, తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి మొదటి వారంలో ప్రారంభం కానున్నాయని సమాచారం. బడ్జెట్‌లో దళితుల బంధు పథకానికి దాదాపు రూ.20 వేల కోట్లు కేటాయించాలని యోచిస్తుంచి. అంతేకాకుండా ‘మన ఊరు మన బడి’ పథకానికి దాదాపు రూ.7,000 కోట్లు కేటాయించనున్నట్టుగా తెలుస్తోంది. 2022-23 బడ్జెట్‌లో సంక్షేమానికి కేటాయింపులు రూ.70,000 కోట్లకు చేరుకోవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.