
Telangana: తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ప్రస్తుతం మాటల యుద్దం కొనసాగుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ల నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ.. రాజకీయ వేడిని మరింతగా పెంచుతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధం అవుతూ.. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుపై యుద్ధం ప్రకటించారు. ఇంకోవైపు బీజేపీ, కాంగ్రెస్ అగ్రనాయకత్వం తెలంగాణ పర్యటనలను మరింతగా పెంచుతోంది. దీంతో రాష్ట్ర రాజకీయాలు కొత్తమలుపులు తీసుకుంటూ.. కాకరేపుతున్నాయి.
ఈ క్రమంలోనే తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చీఫ్ బండి సంజయ్ కుమార్.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవని చెప్పేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. జూన్ 23 నుంచి తన మూడో విడత పదయాత్ర చేపట్టి కేసీఆర్‌ను ప్రజాకోర్టులో నిలబెట్టి.. నిజాలు బట్టబయలు చేస్తానని అన్నారు. రాష్ట్రంలోని అన్ని చోట్లా ముఖ్యమంత్రిని నిలదీయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన మూడు సమావేశాలు జరిగాయని, తెలంగాణలో కాషాయ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రజలు అభిప్రాయపడుతున్నారని పేర్కొన్నారు.
మూడు ప్రముఖ సంస్థలు చేసిన సర్వేలు కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుందని తేలిందని, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల పేలవమైన పనితీరును కూడా సర్వే ఎత్తి చూపిందని ఆయన పేర్కొన్నారు. ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇంధన ధరలను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలను కోరారు. మారుతున్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పార్టీ కార్యకర్తలు నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాలని బండి సంజయ్ కోరారు. ఈ నెలాఖరు నాటికి ప్రధాని నరేంద్ర మోడీ ఎనిమిదేళ్ల పాలనను పూర్తి చేస్తారని, మే 30 నుంచి జూన్ 14 వరకు పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు.పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ, కేసీఆర్ తీరును ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
కాగా, అంతకుముందు కేసీఆర్ ఆఫ్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ అనంతరం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా దేశ పరిస్ధితి చూస్తే బాధేస్తోందన్నారు. చంఢీగడ్‌లో గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు, సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లతో కలిసి కేసీఆర్ ఆర్ధిక సాయానికి సంబంధించిన చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దగ్గర సమస్యలు వున్నాయన్నారు.