మోదీతో కేసీఆర్ భేటీ: 16 అంశాలపై చర్చ

By Nagaraju TFirst Published Dec 26, 2018, 5:11 PM IST
Highlights

 ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఢిల్లీలోని 7 లోక్ కల్యాణ్ మార్గ్ లోని మోదీ నివాసంలో ఆయనను సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. కేసీఆర్ రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీని కలవడం ఇదే తొలిసారి. 

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఢిల్లీలోని 7 లోక్ కల్యాణ్ మార్గ్ లోని మోదీ నివాసంలో ఆయనను సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. కేసీఆర్ రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీని కలవడం ఇదే తొలిసారి. 

మోదీతో భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ పనులు, విభజన హామీలపై మోదీతో కేసీఆర్ చర్చించారు. రాష్ట్రానికి సంబంధించి మెుత్తం 16 అంశాలపై వినతిపత్రాలను కేసీఆర్ ప్రధాని మోదీకి సమర్పించారు. హైకోర్టు విభజనకు వీలైనంత త్వరగా గెజిట్ విడుదలయ్యేలా చూడాలని కోరారు.  

విభజన హామీలు అమలు చెయ్యాలని కోరారు. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి స్పెషల్ గ్రాంట్ ఇవ్వాలని, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు రూ.1000 కోట్లు ఇవ్వాలని కేసీఆర్ కోరారు. దీంతోపాటు కొత్తగా ఏర్పడ్డ జిల్లాలలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చెయ్యాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. 

అలాగు ఆదిలాబాద్ లో ఎన్.హెచ్ఏఐ భాగస్వామ్యంతో సీసీఐ కర్మగారం ఏర్పాటు చెయ్యాలని కోరారు. జహీరాబాద్ లో నిమ్స్ ఏర్పాటుకు నిధులు ఇవ్వాలని ప్రధానిని కోరారు. అలాగే హైదరాబాద్ కు ఐఐఎస్ ఈఆర్ మంజూరు చెయ్యాలని కేసీఆర్ కోరారు. 
 
కృష్ణ నదీ జలాల వివాదాలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త సచివాలయం నిర్మాణానికి బైసన్ పోలో గ్రౌండ్ భూములు ఇవ్వాలని కోరారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ సంస్థల విభజనకు చర్యలు తీసుకోవాలని కోరారు.  

ఏపీ రాజధాని అమరావతికి తరలివెళ్లినందున హైదరాబాద్‌లో వారికి కేటాయించిన సచివాలయంలోని భవనాలతోపాటు, ఆయా హెచ్‌వోడీల కార్యాలయ భవనాలను తిరిగి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. 

రాజీవ్ రహదారి విస్తరణకు రక్షణ భూములు ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చెయ్యాలని ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. వీటితోపాటు కరీంనగర్ లో ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు, వరంగల్ జిల్లాలో ట్రైబల్ యూనివర్శిటీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ల పెంపు వంటి అంశాలపై చర్చించారు. వెనుకబడిన ప్రాంతాలకు రూ.450 కోట్లు ఇవ్వాలని ప్రధానిని సీఎం కేసీఆర్ కోరారు. 

 పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు ఫేస్-2 పర్యావరణ అనుమతులు, ఖమ్మలో బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వేగవంతం చెయ్యాలని కోరారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నీతిఆయోగ్ సూచించిన నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.  

click me!