
హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆరో అంతస్తులోని తన కార్యాలయానికి వెళ్లిన సీఎం కేసీఆర్.. ముందుగా నిర్ణయించిన సుముహుర్తానికి కుర్చీలో ఆసీనులైనారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆరు దస్త్రాలపై సుముహుర్తంలోనే సంతకాలు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ దస్త్రంపై కేసీఆర్ తొలి సంతకం చేశారు. ఫైల్స్‌పై సంతకం చేసిన అనంతరం వేద పండితులు కేసీఆర్‌కు ఆశీర్వచనాలు అందించారు. ఈ క్రమంలోనే పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియాజేశారు.
కేసీఆర్ నూతన సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆసీనులైన సందర్భంగా యాదాద్రి ఆలయానికి సంబంధించిన కాఫీ టేబుల్ పుస్తకంతో పాటు కవిత నీరాజనం పుస్తకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో గీత యాదాద్రి ప్రసాదాన్ని కేసీఆర్‌కు అందజేశారు.
వైభవంగా తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం..
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభ కార్యక్రమం ఎంతో వైభవంగా సాగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ మధ్యాహ్నం 1:15 గంటల ప్రాంతంలో సచివాలయానికి చేరుకుంది. సీఎం కేసీఆర్ వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అప్పటికే అక్కడున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారితో పాటు పలువురు నేతలు కేసీఆర్‌కు స్వాగతం పలికారు.
నూతన సచివాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన యాగశాలను సీఎం కేసీఆర్ సందర్శించారు. యాగశాలలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొన్నారు. అక్కడి నుంచి కేసీఆర్ సచివాలయం ప్రధాన ద్వారానికి చేరుకున్నారు కేసీఆర్. ఈ సందర్భంగా కేసీఆర్ పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం నూతన సచివాలయం ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం కేసీఆర్ రిబ్బన్ కట్ చేసి సచివాలయంలోకి ప్రవేశించారు. బ్యాటరీ వాహనంలో ప్రయాణించారు. అనంతరం సచివాలయంలో వాస్తు పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆరో అంతస్తులోని తన చాంబర్‌కు చేరుకుని.. ముందుగా నిర్ణయించిన సుముహుర్తానికి కుర్చీలో ఆసీనులైనారు.