కోటి ఆశలతో తెచ్చుకున్న రాష్ట్రాన్ని అప్పుల పాలుచేశారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. అప్పులు ఆగిపోతే ప్రాజెక్టులు ఎలా కడుతారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
హైదరాబాద్: రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ప్రభుత్వంపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.మంగళవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. కోటి ఆశలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. రాష్ట్రప్రభుత్వం రూ. 5 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. నేరుగా తెచ్చిన అప్పులను కూడ బడ్జెట్ లో చూపారని భట్టి విక్రమార్క విమర్శంచారు.
కార్పోరేషన్ కు గ్యారెంటీ ఇచ్చి ప్రభుత్వం అప్పులు తెచ్చిందన్నారు. ప్రతి బడ్జెట్ లో వాస్తవాలు దాచి పెట్టారని ఆయన విమర్శించారు అప్పులు ఆగిపోతే ప్రాజెక్టులు ఎలా కడుతారని ప్రభుత్వాన్ని భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
అనంతరం ఈ విషయమై తెలంగాణ మంత్రి హరీష్ రావు చర్చలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. ఎన్నికల ముందు విదేశాల్లో ఉన్న నల్లధనం తెస్తామని ఇచ్చిన హమీని అమలు చేయలేదన్నారు. పేదల ఖాతాల్లో రూ. 15 లక్షలు జమ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హమీ నెరవేరలేదన్నారు. పెద్ద నగదు నోట్లను రద్దు చేయడం పెద్ద విపల ప్రయోగమని ఆర్ధిక మంత్రి హరీష్ రావు విమర్శించారు. అర్హులందరికి ఇల్లు కట్టిస్తామనే హామీ అమలులో మోడీ సర్కార్ వైఫల్యం చెందిందన్నారు. మేకిన్ ఇండియా ఫెయిలైందని ఆయన అభిప్రాయపడ్డారు.