
కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరికీ ఉచితంగా బూస్టర్ డోసులు ఇవ్వాల్సిందేనని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రికి ఇది వరకే లేఖ రాశామని తెలిపారు. మరో సారి లేఖ రాస్తామని అన్నారు. వ్యాక్సిన్ లకు డబ్బులు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్ లోని కోఠి మెటర్నిటీ హాస్పిటల్‌లో ICU, లేబర్ రూమ్స్, బెడ్స్ ను మంత్రి హరీశ్ రావును మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే రాజాసింగ్, tsmsidc చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కరోనా టైంలో దేశమంతా బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ వల్ల అతలాకుతలం అయ్యిందని అన్నారు. కానీ సుల్తాన్ బజార్ ఈఎన్ టీ ఆసుపత్రి వైద్యులు మాత్రం బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కు మంచి చికిత్స అందించారని అన్నారు. ఈ హాస్పిటల్ కు సీఎం మరిన్ని డాక్టర్ పోస్టులు మంజూరు చేశారని అన్నారు. రూ.35 కోట్లతో బిల్డింగ్ నిర్మిస్తున్నామని అన్నారు. ఇందులో 100 పడకలు, 8 ఆపరేషన్ థియేటర్, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఈఎన్టీ హాస్పిటల్ పురాతనమైనదని, అందుకే కొత్త బ్లాక్ కు శంకుస్థాపన చేశామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని అన్నారు.
సీఎం కేసీఆర్ శానిటైజేషన్ సిబ్బందికి జీతాన్నిపెంచారని అన్నారు. ఈ నెలలో కొత్త శానిటేషన్ పాలసీ తీసుకురానున్నామని తెలిపారు. దాని కోసం రూ.150-200 కోట్లు అదనంగా ఈ ఏడాది ఖర్చు చేయనున్నామని అన్నారు. దీని వల్ల శానిటేషన్ మెరుగుపడుతుందని చెప్పారు. హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషంట్ల అటెండెంట్స్ కు మూడు పూటలా ఐదు రూపాయలకే భోజనం పెట్టాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ నెల 12వ తేదీన హైదరాబాద్ మంత్రులు, శాసన మండలి, శాసన సభ్యులు ఆధ్వర్యంలో 18 ఆసుపత్రుల్లో ఈ కార్యక్రమాన్నిప్రారంభిస్తామని తెలిపారు.
వైద్యం కోసం తెలంగాణలోని మారుమూల ప్రాంతాల నుండి ప్రజలు హైదరాబాద్ కు వస్తారని, వారి కోసం సీఎం షెల్టర్ హోమ్స్ కట్టాలని, భోజనం అందించాలని నిర్ణయించారు. ఇప్పటికే పలు షెల్టర్ హోమ్స్ నిర్మించామని, మరిన్ని నిర్మిస్తామని తెలిపారు. కొత్తగా కట్టే నాలుగు సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రుల డిజైన్ లోనే షెల్టర్ హోమ్స్ కట్టామని చెప్పారు. కొత్తగా 6 వేల పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అందుబాటులోకి వస్తాయని అన్నారు.
తెలంగాణలో హెల్త్ బడ్జెట్ రెట్టింపు చేశామని మంత్రి హరీశ్ రావు అన్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ ఖాళీలన్నీ నింపడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కరోనా టైంలో పని చేసిన సిబ్బందికి వెయిటేజీ ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసావల సంఖ్య పెరిగిందని మంత్రి అన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వ పని తీరుకు నిదర్శనం అని అన్నారు. మాతా శిశు మరణాలు తగ్గించడంలో తమిళనాడును దాటి తెలంగాణ మూడో స్థానంలో ఉందని నిలిచిందని తెలిపారు. బస్తీ దవాఖానాలు, కేసీఆర్ కిట్, టీ డయాగ్నసిస్ సర్వీసులు దేశానికి ఆదర్శంగా మారాయని చెప్పారు. తెలంగాణ మోడల్ ను మిగితా రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని మంత్రి చెప్పారు.