ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 11 సీట్లు గెలిచినా వైఎస్ జగన్ మామూలోడు కాదంటూ కితాబిచ్చారు. ఇక చంద్రబాబును ఏమన్నారంటే...
Kalvakuntla Taraka Ramarao : తెలంగాణలో భారత రాష్ట్ర సమితి... ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు అధికారాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇరుపార్టీల ఓటమిపై స్పందించారు. ఏపీ ఎన్నికల ఫలితాలు తననెంతో ఆశ్చర్యపర్చాయని... ఇది తాను ఊహించలేదని అన్నారు. రాష్ట్ర ప్రజలందరికి మరీముఖ్యంగా బడుగుబలహీన పేద వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు జగన్... అయినా ఆయన ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందని కేటీఆర్ అన్నారు.
అయితే వైఎస్ జగన్ కేవలం 11 సీట్లకే పరిమితం కావచ్చు... ఓట్లు మాత్రం భారీగా వచ్చాయని కేటీఆర్ తెలిపారు. పోలయిన మొత్తం ఓట్లలో వైసిపికి 40 శాతం వచ్చాయంటే మామూలు విషయం కాదన్నారు. ప్రతిపక్షాలన్ని కలవడమే జగన్ ఓటమికి ప్రధాన కారణంగా కేటీఆర్ పేర్కొన్నారు. గత ఎన్నికల మాదిరిగా జనసేన పార్టీ, పవన్ కల్యాణ్ విడిగా పోటీచేసివుంటే ఫలితాలు మరోలా వుండేని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
undefined
జగన్ ను ఓడించేందుకు ఆయన చెల్లి షర్మిలను ప్రత్యర్థి పార్టీలు ఉపయోగించుకున్నాయని అన్నారు. అంతకు మించి షర్మిలకు రాజకీయ ప్రాధాన్యత లేదని అన్నారు. ఇక ప్రతిరోజూ ప్రజల్లోకి వెళ్లే ధర్మవరం వైసిపి నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓడిపోవడం మరో ఆశ్చర్యమని అన్నారు. మొత్తంగా జగన్ ను ఓడించి సంచులతో దొరికినవాడిని ఏపీ ప్రజలు మళ్ళీ సీఎంను చేసారన్నారు.
తెలంగాణలో బిఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ ఏమన్నారంటే..:
తెలంగాణ ఏర్పాటుతర్వాత పదేళ్లపాటు బిఆర్ఎస్ పాలనే సాగింది. వరుస రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేసీఆర్ పార్టీ విజయం సాధించగా హ్యాట్రిక్ మాత్రం సాధ్యంకాలేదు. 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బిఆర్ఎస్ ఓటమికి కారణాలివే అంటూ కొన్ని ఆంశాలు ప్రచారమవుతున్నాయి. వాటన్నింటిని కొట్టిపారేసిన కేటీఆర్ బిఆర్ఎస్ ఓటమికి ఒకే ఒక్క కారణం వుందంటున్నారు. తమకు, ప్రజలకు మధ్య గ్యాప్ వచ్చింది... ఇదే బిఆర్ఎస్ ఓటమికి అసలు కారణమని అన్నారు. ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందో తెలుకున్నామని... మా వైఖరి మార్చుకుని ప్రజలకు దగ్గరవుతున్నామని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరు మార్పువల్లే తాము ఓడిపోయామని అంటున్నారని... అది నిజం కాదన్నారు కేటీఆర్. అలాగే తమ అహంకారమే పార్టీని ఓడించిందని మరికొందరు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. అయితే ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి తేడా వుంది... తమది ఆత్మవిశ్వాసమని కేటీఆర్ అన్నారు.
తెలంగాణను అద్భుతంగా అభివృద్ది చేసాం... కానీ ఇది ప్రజలకు చెప్పడంలో విఫలమయ్యామని కేటీఆర్. హైదరాబాద్ ప్రజలు ఈ అభివృద్దిని చూసారు కాబట్టే బిఆర్ఎస్ ను గెలిపించారని అన్నారు. భవిష్యత్ లో మళ్ళీ బిఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేసారు.