స్విమ్మింగ్ పూల్ లో ఈత నేర్చుకుంటూ.. విద్యార్థి మృతి

By ramya NFirst Published 23, Feb 2019, 11:36 AM IST
Highlights

స్విమ్మింగ్ పూల్ లో ఈత నేర్చుకుంటూ విద్యార్థి మృతి చెందిన సంఘటన హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్ర నగర్ లో చోటుచేసుకుంది. 

స్విమ్మింగ్ పూల్ లో ఈత నేర్చుకుంటూ విద్యార్థి మృతి చెందిన సంఘటన హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్ర నగర్ లో చోటుచేసుకుంది. శివరాంపల్లి వద్ద ఉన్న ఏటూజెడ్ ఈత కొలనులో మహ్మద్ ఖాజా అనే విద్యార్థి ఈత నేర్చుకోవడానికి వచ్చి నీటమునిగి మృత్యువాతపడ్డాడు. మహ్మద్ ఖాజా.. ఇక్కడ గత కొంతకాలంగా ఈత నేర్చుకుంటున్నాడు..

కాగా.. శనివారం ఉదయం కూడా రోజులానే స్విమ్మింగ్‌ పూల్‌లోకి దిగాడు. సమయానికి అక్కడ కోచ్‌ లేకపోవడంతో కొంత దూరం వెళ్లిన విద్యార్థి తిరిగి వెనక్కి రాలేకపోయాడు. దీంతో ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందాడు. తమ కుమారుడి  మృతికి స్విమ్మింగ్ పూల్ యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్లో కోచ్ లేకపోవడంతో పాటు అక్కడ సరియైన నిర్వహణ లేని‌ కారణంగానే తమ కుమారుడు మృతి చెందాడంటూ ఆందోళనకు దిగారు.

బాలుడు చనిపోవడాన్ని జీర్ణించుకోలేని అతని తల్లిదండ్రులు.. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై రాజేంద్రనగర్ పోలీసులకు తల్లిదండ్రులు పిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పొస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Last Updated 23, Feb 2019, 11:36 AM IST