బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించనున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ యాత్రలో పాల్గొంటారు.
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఈ నెల 28వ తేదీ నుండి బైంసా నుండి ప్రారంభం కానుంది. ఈ పాదయాత్రను ప్రారంభసూచికంగా నిర్వహించే సభలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొంటారు. 20 రోజుల పాటు 222 కి.మీ పాటు పాదయాత్ర నిర్వహించనున్నారు బండి సంజయ్. ఐదు జిల్లాలు, మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు , ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగుతుంది. వచ్చే నెల 17వ తేదీ వరకు యాత్ర సాగనుంది.
ఈ నెల 28న ఉదయం నిర్మల్ జిల్లా ఆడెల్లి పోచమ్మ అమ్మవారి ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత బైంసాకు వెళ్తారు. రేపు 6.4 కి.మీ బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తారు. రేపు సాయంత్రం గుండగామ్ వద్ద బండి సంజయ్ బస చేస్తారు.
ఈనెల 29న రెండోరోజు పాదయాత్ర గుండగామ్ నుండి మహాగాన్, చటా మీదుగా లింబా వరకు సాగుతుంది. రెండోరోజు మొత్తం 13 కి.మీలపాటు బండి సంజయ్ నడుస్తారు. 3వ రోజు లింబా నుండి ప్రారంభమై కుంటాల, అంబకంటి మీదుగా బూజుర్గుకు చేరుకుంటారు సంజయ్. మొదటి మూడు రోజులు ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే పాదయాత్ర కొనసాగనుంది.
డిసెంబర్ 1 నుండి 6వరకు నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగనుంది. 1న బామిని బూజుర్గ్ నుండి నందన్, నశీరాబాద్ మీదుగా రాంపూర్ వరకు యాత్ర సాగుతుంది డిసెంబర్ 2న రాంపూర్ నుండి లోలమ్ మీదుగా చిట్యాల దాకా యాత్ర సాగుతుంది. డిసెంబర్ 3న చిట్యాల నుండి మంజులాపూర్, నిర్మల్ రోడ్, ఎడిగాం, ఎల్లపల్లి, కొండాపూర్ మీదుగా ముక్తాపూర్ వరకు సాగుతుంది.
డిసెంబర్ 4న లక్మణ్ చందా మండలంలోని వెల్మల, రాచాపూర్, లక్మణ్ చందా, పోటపల్లి వరకు పాదయాత్ర సాగుతుంది. డిసెంబర్ 5న మమ్డా మండలంలోని కొరైకల్ మమ్డా, దిమ్మతుర్తి వరకు సంజయ్ పాదయాత్ర నిర్వహించనున్నారు. డిసెంబర్ 6, 7 తేదీల్లో ఖానాపూర్ నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతుంది. 6న దొమ్మతుర్తి, ఇక్బాల్ పూర్, తిమ్మాపూర్, ఖానాపూర్ మీదుగా మస్కాపూర్ వరకు సాగుతుంది. డిసెంబర్ 7న మస్కాపూర్ లోని సూరజ్ పూర్, బడాన్ ఖర్తి, ఓబులాపూర్, మొగల్ పేట మీదుగా కోరుట్ల నియోజకవర్గంలోని కోటి లింగేశ్వర స్వామి ఆలయం వద్ద బండి సంజయ్ బస చేస్తారు. డిసెంబర్ 8,9 తేదీల్లో కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్, కోరుట్ల మండలాల్లో మొత్తం 21.7 కి.మీలు పాదయాత్ర చేయనున్నారు. డిసెంబర్ 10న కోరుట్ల పట్టణం వెంకటాపురం, మోహన్ రావు పేట మీదుగా వేములువాడ నియోజకవర్గంలోని మేడిపల్లి మండల కేంద్రంలో బస చేస్తారు బండి సంజయ్.
డిసెంబర్ 11న మేడిపల్లి నుండి తాటిపల్లి మీదుగా జగిత్యాల రూరల్ మండల కేంద్రంలో రాత్రి బస చేస్తారు. డిసెంబర్ 12న జగిత్యాల పట్టణంలో పాదయాత్ర కొనసాగుతుంది. డిసెంబర్ 13న తారకరామనగర్ నుండి చొప్పదండి నియోజకవర్గంలోని చిచ్చాయ్, మల్యాల చౌరస్తా, మల్యాల మీదుగా కొండగట్టుకు చేరుకుంటారు బండి సంజయ్. డిసెంబర్ 14, 15, 16 తేదీల్లో చొప్పదండి నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుది. డిసెంబర్ 16 నుండి 17 వరకు కరీంనగర్ నియోజకవర్గంలో పాదయాత్రను కొనసాగిస్తారు. చివరి రోజు కరీంనగర్ లోని ఎస్సాఆర్ఆర్ కళాశాల వద్ద పాదయాత్రను ముగిస్తారు.
జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 22న పెద్దఅంబర్ పేటలో ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సభను నిర్వహించారు. ఈ ఏడాది ఆగస్టు 2న యాదాద్రిలో బండి సంజయ్ మూడో విడత పాదయాత్రను ప్రారంభించారు. వరంగల్ లోని భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ఆగస్టు 27న పాదయాత్రను ముగించారు బండి సంజయ్.
ఈ ఏడాది ఏప్రిల్ 14న బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర గద్వాల జోగులాంబ ఆలయం వద్ద ప్రారంభమైంది. ఈ ఏడాది మే 14న మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో పాదయాత్ర ముగిసింది. ఈ ముగింపు సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.తొలి విడత ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్ చార్మినార్ లోని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. 2021 ఆగస్టు 24వ తేదీ నుండి ఈ పాదయాత్రను బండి సంజయ్ ప్రారంభించారు.