తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఇవాళ ప్రకటించేందుకు ఆ పార్టీ కసరత్తు చేస్తుంది. తెలంగాణకు చెందిన బీజేపీ అగ్రనేతలు న్యూఢిల్లీకి చేరుకున్నారు.
హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఎంపికపై బీజేపీ కసరత్తు కొనసాగుతుంది. గురువారం నాటికి బీజేపీ తొలి జాబితాను విడుదల చేయాలని ఆ పార్టీ భావిస్తుంది. తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఖరారు కోసం బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డాక్టర్ కె. లక్ష్మణ్, బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లు ఇప్పటికే న్యూఢిల్లీకి చేరుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఇవాళ విడుదల చేయనుంది బీజేపీ. తొలి జాబితాలో కనీసం 35 మంది పేర్లు ఉండే అవకాశం ఉందని తొలుత పార్టీ వర్గాల్లో ప్రచారం సాగింది. అయితే ఇవాళ ప్రకటించే జాబితాలో కుదిరితే 60 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని ఆ పార్టీ భావిస్తుంది. ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలు కూడ బీజేపీలో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అభ్యర్థుల జాబితా ప్రకటనను ఆ పార్టీ ఆలస్యం చేస్తుంది. అయితే ఎలాంటి వివాదం, ఇతర పార్టీల నుండి వలసలు లేని అసెంబ్లీ స్థానాల జాబితాను తొలి జాబితాలో ప్రకటించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో బీజేపీ తెలంగాణకు చెందిన కీలక నేతలు ఇవాళ న్యూఢిల్లీలో భేటీ కానున్నారు. పార్టీ నేతలకు కాషాయ పార్టీ అగ్రనేతలు రోడ్ మ్యాప్ ను ఇవ్వనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న అభ్యర్థుల నుండి బీజేపీ నాయకత్వం ధరఖాస్తులను ఆహ్వానించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఆరు వేలకు పైగా ధరఖాస్తులు అందాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 66 ధరఖాస్తులు అందాయి.
తెలంగాణలో ఈ దఫా అధికారాన్ని కైవసం చేసుకోవాలని కమల దళం పట్టుదలగా ఉంది. దీంతో రాష్ట్రంలో బీజేపీ జాతీయ నాయకత్వం కూడ ఫోకసల్ చేసింది. గతంలో జరిగిన హుజూరాబాద్, దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 కార్పోరేట్ స్థానాలను దక్కించుకుంది. దీంతో గత కొంత కాలంగా బీజేపీ నాయకత్వం తెలంగాణపై ఫోకస్ ను మరింత పెంచింది. యూపీలో గతంలో పనిచేసిన సునీల్ భన్సల్ నేతృత్వంలోని టీమ్ రాష్ట్రంలో పనిచేస్తుంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యక్రమాలపై బీజేపీ నాయకత్వం కేంద్రీకరించింది.
దక్షిణాదిలో కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. దీంతో తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఆ పార్టీ వ్యూహరచన చేస్తుంది.ఈ నెల మొదటి వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో రెండు దఫాలు పర్యటించారు. తెలంగాణ ప్రజలపై వరాలు కురిపించారు. నిజామాబాద్ లో జరిగిన సభలో బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నెల 6న జరిగిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశా నిర్ధేశం చేశారు.