ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పార్టీ ఎంఐఎం అంటూ బండి సంజయ్ తీవ్ర స్తాయితో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉందన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎంఐఎంకు గట్టి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లోనే ఉందన్నారు. ఆ పార్టీని మల్లీ గెలిపించడానికే ఎంఐఎం పనిచేస్తుందన్నారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి మద్దతు పలుకుతుందన్నారు. హైదరాద్ లో ముస్లింల బతుకులతో ఆడుకుంటున్న పార్టీ ఎంఐఎం అని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చే పార్టీ ఎంఐఎం..వారిని కాపాడే పార్టీ అని విరుచుకుపడ్డారు. దమ్ముంటే, మొగోళ్లైతే.. ముస్లిం సమాజం కోసమే పనిచేస్తున్నామని భావిస్తే తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేయండి. బీఆర్ఎస్ తో కలిసి వస్తారా? కాంగ్రెస్ తో కలిసి వస్తారా? తేల్చుకోండి. బీజేపీ సింగిల్ గా పోటీచేస్తుంది. అమిత్ షాకు శంషాబాద్ లో ఇల్లు ఉందని టెర్రరిస్టు పార్టీలే ఆయనకు చెప్పి ఉంటాయని.. అవి తప్ప ఆయనకు ఎవరు సమాచారం ఇస్తారని అన్నారు.
పేద ముస్లింలను ఎంఐఎం మోసం చేస్తుందన్నారు. ఎంఐఎంకు దమ్ముంటే తెలంగాణలో అన్ని చోట్లా పోటీ చేయాలన్నారు. రెండు రోజుల క్రితం అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. బండి సంజయ్ మీద, బీజేపీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనపేరు లేకుంటే.. ముస్లింలను ముందు పెట్టకపోతే వారికి పూట గడవదన్నారు. అసదుద్దీన్ ఒవైసీని మెప్పించడానికి కొత్త సెక్రటేరియట్ అన్న మాటను హాస్యాస్పదం అంటూ కొట్టేశారు. మేము చెప్పినట్టు అధికార పార్టీ వింటే.. మా సమస్యలు ఎందుకు తీరడం లేదని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా, మే 29వ తేదీన హైదరాబాద్ పాతబస్తీ వెలుపల ఉన్న స్థానాల నుంచి సైతం పోటీ చేయాలని ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) భావిస్తోందని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై అన్ని వర్గాలను సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.
ఆదిలాబాద్ లో జరిగిన బహిరంగ సభలో ఓవైసీ మాట్లాడుతూ షాదీముబారక్ పథకం లబ్ధిదారులకు చెక్కులు అందడంలో జాప్యం జరుగుతోందని ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఎంఐఎంను తేలిగ్గా తీసుకోవద్దన్నారు. ఎంఐఎం బీజేపీని ఎదుర్కోవడంపై దృష్టి సారించిందని చెప్పారు. 2014, 2018 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించడంలో ఎంఐఎం కీలక పాత్ర పోషించిందన్నారు.
రాష్ట్రంలో ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబాద్ మునిసిపల్ వార్డుల్లో అభివృద్ధి జరగకపోతే వచ్చే ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకు ఆందోళన కలిగించే అంశమని హెచ్చరించారు. తన నుంచి సానుకూల సంకేతాలు రాకుండా ముస్లింలు ఏ పార్టీకి అనుకూలంగా ఓటు వేయరని ఒవైసీ అన్నారు. ఆదిలాబాద్ రిమ్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అధికారులకు లంచం ఇవ్వాల్సి న పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. ఓల్డ్ సిటీ వెలుపల పోటీ చేయాలని ఎంఐఎం భావించడం ఇదే మొదటిసారి కాదనీ, తెలంగాణలోని 119 సీట్లకు గాను కనీసం 50 స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం పార్టీ యోచిస్తున్నట్లు అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.