తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అంజనీ కుమార్..

By Sumanth KanukulaFirst Published Dec 31, 2022, 1:32 PM IST
Highlights

తెలంగాణ నూతన డీజీపీగా అంజనీ కుమార్‌ బాధ్యతలు  చేపట్టారు. అంజనీకుమార్‌కు ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి గౌరవ లాఠీని అందజేశారు

తెలంగాణ నూతన డీజీపీగా అంజనీ కుమార్‌ బాధ్యతలు  చేపట్టారు. అంజనీకుమార్‌కు ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి గౌరవ లాఠీని అందజేశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డితో పాటుగా పలువురు పోలీసుల ఉన్నతాధికారులు నూతన పోలీసు బాస్‌ అంజనీకుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మహేందర్ రెడ్డికి సీనియర్ పోలీసు అధికారులు, సిబ్బంది వీడ్కోలు పలికారు. ఇక, మహేందర్ రెడ్డి డీజీపీగా నేడు పదవీ విరమణ చేయనుండటంతో.. అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న అంజనీకుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ (పూర్తి అదనపు బాధ్యత)గా నియమించింది.

1990 బ్యాచ్‌కు చెందిన అంజనీ కుమార్ తన కేరీర్‌లో అనేక పోస్టులను సమర్ధవంతంగా నిర్వహించిన సంగతి  తెలిసిందే. డీజీపీగా నియామక ఉత్తర్వులు వెలువడే సమయంలో ఆయన అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. 1992లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిపార్ట్‌మెంట్‌లో చేరిన తర్వాత.. జనగామ ఏఎస్పీగా పనిచేశారు. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అనేక పదవుల్లో పనిచేశారు. అదనపు సీపీ (లా అండ్ ఆర్డర్)గా అంజనీ కుమార్ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో నగరంలో శాంతిభద్రతల పరిరక్షణలో, ఆ తర్వాత రాష్ట్రంలో 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించారు.

Also Read: ఆ అపోహలను అధిగమించాం.. సీఎం కేసీఆర్‌కు థాంక్స్: పదవీ విరమణ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంజనీ కుమార్ హైదరాబాద్ నగరానికి అదనపు కమిషనర్ (లా అండ్ ఆర్డర్) గా కొనసాగారు. అక్కడ ఆయన 2016 వరకు పనిచేశారు. తర్వాత 2018 వరకు తెలంగాణ రాష్ట్రానికి అదనపు డిజి (లా అండ్ ఆర్డర్) గా పనిచేశారు. 2018 లో మహేందర్ రెడ్డి హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంజనీ కుమార్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు అనేక కార్యక్రమాలను ప్రారంభించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పౌరులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఇంటి వద్దకే ఫిర్యాదు చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. మూడు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు హైదరాబాద్ పోలీసు కమీషనర్‌గా అంజనీ కుమార్ పనిచేశారు. 2021 డిసెంబర్ నుంచి అంజనీ కుమార్ ఏసీబీ డీజీగా కొనసాగారు. 

click me!