తారాస్థాయికి ఎన్నికల ప్రచారం: తెలంగాణలో 5పార్టీల అధ్యక్షుల టూర్

By Nagaraju TFirst Published Nov 27, 2018, 10:43 PM IST
Highlights

తెలంగాణలో ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు తమ అధినేతలను రంగంలోకి దింపుతున్నాయి. బుధవారం ఒక్క రోజే ఐదు పార్టీలకు చెందిన అధ్యక్షులు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో నేతలు ఏం చెప్తారా అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

హైదరాబాద్:తెలంగాణలో ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు తమ అధినేతలను రంగంలోకి దింపుతున్నాయి. బుధవారం ఒక్క రోజే ఐదు పార్టీలకు చెందిన అధ్యక్షులు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో నేతలు ఏం చెప్తారా అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన మరుసటి రోజు నుంచే టీఆర్ ఎస్ అధినేత ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. గులాబీ బాస్ కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభల పేరుతో తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తుంటే ఆయన తనయుడు కేటీఆర్ రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బుధవారం సైతం సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలలో పాల్గొంటుండగా కేటీఆర్ మాత్రం జీహెచ్ఎంసీ పరిధిలోని నియోజకవర్గాల్లో రోడ్ షోలతో హోరెత్తించనున్నారు. 

అటు ప్రజాఫ్రంట్ సైతం అంతే వేగంతో దూసుకుపోతుంది. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలను ఎన్నికల సమరానికి దింపింది. ఇప్పటికే పలు దఫాలుగా రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికలప్రచారంలో పాల్గొన్నారు. 

తాజాగా బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో కలిసి తెలంగాణ ఎన్నికల సమరంలో పాల్గొననున్నారు. బుధవారం కొడంగల్, ఖమ్మం, హైదరాబాద్ లలోని బహిరంగ సభలలో రాహుల్ గాంధీ, చంద్రబాబులు పాల్గొననున్నారు. 

రాహుల్ గాంధీ ఇప్పటికే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా చంద్రబాబు మాత్రం మెుదటి సారిగా పాల్గొంటున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారో అని ఉత్కంఠ నెలకొంది. 

ఇకపోతే భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సైతం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పటికే పలుమార్లు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా మరోసారి బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 

ఆదిలాబాద్, చౌటుప్పల్, ఎల్బీనగర్ లలో బీజేపీ నిర్వహించబోయే ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొననున్నారు. ఇకపోతే మంగళవారం భారత ప్రధాని నరేంద్రమోదీ బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే బహుజనసమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి సైతం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు నిర్మల్ జిల్లాలో బీఎస్పీ నేతృత్వంలో జరగబోయే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 

మధ్యాహ్నం ఒంటిగంటకు మంచిర్యాలలో బహిరంగ సభలో సైతం మాయావతి  ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి పాల్గొనడం ఈ ఎన్నికల్లో ఇదే మెుదటిసారి కావడంతో ఆమె ఎలాంటి హామీలు ఇస్తారా అని సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

ఇదిలా ఉంటే కేంద్రమంత్రి సుస్మాస్వరాజ్ సైతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పర్యటించనున్నారు. ముఖ్యంగా మేడ్చల్ నియోజకవర్గంలో ఆమె పర్యటించనున్నారు. మెుత్తానికి తెలంగాణలో ఒకేరోజు ఐదు పార్టీల అధ్యక్షుల పర్యటనలతో హోరెత్తిపోనుంది. జాతీయ అధ్యక్షులు ప్రచారం ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు ప్రచారం అన్నీ ఒకే రోజు ఉండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 
 

click me!