తెలంగాణలో కొత్తగా 409 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజు వ్యవధిలో 453 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 6,865 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 88,308 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 409 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 6,54,035కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో వైరస్ వల్ల రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,852కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 453 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో తెలంగాణలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,43,318కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,865 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
కాగా, కరోనా వ్యాక్సిన్ తీసుకొంటేనే పబ్లిక్ ప్లేసుల్లో తిరగడానికి అనుమతివ్వడంపై ప్రభుత్వం యోచిస్తోందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. బుధవారం నాడు ఆయన హైద్రాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన వారంతా వ్యాక్సిన్ వేసుకోవాలని ఆయన కోరారు.రాబోయే రోజుల్లో ఇంటింటికి వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విద్యా సంస్థలు తెరిచేందుకు నివేదికఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టీచర్లందరికీ వ్యాక్సిన్ ఇచ్చామని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా నమోదౌతున్నాయి. సెకండ్ వేవ్ ముగిసిందని ఆయన చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1.65 మందికి కరోనా వ్యాక్సిన్ అందించామన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నామని ఆయన తెలిపారు.