Published : Dec 03, 2023, 06:32 AM ISTUpdated : Dec 06, 2023, 10:09 AM IST

Telangana Assembly Election 2023 LIVE : నేడు సోనియాగాంధీతో రేవంత్ భేటీ

సారాంశం

తెలంగాణ సీఎం ఎవరన్న దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే వుంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం ఈ మేరకు కసరత్తు చేస్తోంది. ఇవాళ సాయంత్రానికి ముఖ్యమంత్రి పేరును అధిష్టానం ప్రకటిస్తుందని వార్తలు వస్తున్నప్పటికీ పరిస్ధితులు చూస్తుంటే మంగళవారం కూడా కష్టమే అనిపిస్తోంది. 

Telangana Assembly Election 2023 LIVE : నేడు సోనియాగాంధీతో రేవంత్ భేటీ

10:09 AM (IST) Dec 06

రేవంత్ ప్రమాణస్వీకారానికి సోనియా గాంధీ...

ప్రస్తుతం డిల్లీలో వున్న రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలవనున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా వీరిని ఆహ్వానించనున్నారు రేవంత్. ఇప్పటికే రేవంత్ ప్రమాణస్వీకారానికి సోనియా రావడం ఖాయమైనట్లు తెలుస్తోంది. 

08:40 AM (IST) Dec 06

నేడు సోనియాగాంధీతో రేవంత్ భేటీ

రెండో రోజు కూడా డిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే ముఖ్యమంత్రి  పదవి ఖాయం కావడంతో కేబినెట్ కూర్పుపై అదిష్టానంతో చర్చలు జరపనున్నారు రేవంత్. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను నేడు రేవంత్ కలవనున్నారు. 

06:16 AM (IST) Dec 06

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... రేపే ప్రమాణస్వీకారం

సుదీర్ఘ చర్చల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి అద్భుత విజయాన్ని అందించిన టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డినే సీఎంగా నియమించింది. డిసెంబర్ 7న అంటే రేపు ఆయన ప్రమాణస్వీకారం వుంటుందని కాంగ్రెస్ ప్రకటించింది.   

05:44 PM (IST) Dec 05

సీఎం ఎవరు.. ఇంకా సస్పెన్సే

తెలంగాణ సీఎం ఎవరన్న దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే వుంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం ఈ మేరకు కసరత్తు చేస్తోంది. ఇవాళ సాయంత్రానికి ముఖ్యమంత్రి పేరును అధిష్టానం ప్రకటిస్తుందని వార్తలు వస్తున్నప్పటికీ పరిస్ధితులు చూస్తుంటే మంగళవారం కూడా కష్టమే అనిపిస్తోంది. 
 

05:20 PM (IST) Dec 05

కేసీ వేణుగోపాల్‌తో భట్టి భేటీ

తెలంగాణ సీఎం ఎవరన్న దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే వుంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం ఈ మేరకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించింది. మరోవైపు.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ ఇంటికి డీకే శివకుమార్, మాణిక్ రావ్ థాక్రేలు వెళ్లారు. 

03:45 PM (IST) Dec 05

ఎల్లా హోటల్‌కు కమ్యూనిస్ట్ నేతలు

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం మకాం వేసిన గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌కు కమ్యూనిస్ట్ నేతలు వెళ్లారు. సీపీఐ నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావులు వెళ్లారు. సాయంత్రానికి తెలంగాణ కొత్త సీఎం ఎవరో క్లారిటీ రానుంది. ప్రస్తుతం ఢిల్లీలో వున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సాయంత్రానికి హైదరాబాద్ రానున్నారు. 
 

03:17 PM (IST) Dec 05

రేవంత్‌ను సీఎంని చేయాలంటూ నినాదాలు

తెలంగాణలో సీఎం ఎవరన్నది తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలకు , రాజకీయాలకు గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా కేంద్రంగా మారింది. ఇక్కడ సీఎల్పీ సమావేశం జరగ్గా, కాంగ్రెస్ నేతలంతా ఇక్కడే మకాం వేశారు. ఈ క్రమంలో మంగళవారం హోటల్ ఎల్లా వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డిని సీఎం చేయాలంటూ ఆందోళనకు దిగడంతో పాటు హోటల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని నిలువరించి బయటకు పంపారు పోలీసులు. 

02:58 PM (IST) Dec 05

సాయంత్రం హైదరాబాద్‌కు డీకే శివకుమార్

తెలంగాణ సీఎం ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తన నివాసంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌లతో సమావేశమయ్యారు. ఈ సాయంత్రానికి కేపీసీసీ చీఫ్, కర్ణాటక ఉపముఖ్యమంత్రి హైదరాబాద్ తిరిగి రానున్నారు. రాత్రి నాటికి తెలంగాణ సీఎం ఎవరో క్లారిటీ రానుంది. 

02:17 PM (IST) Dec 05

ఖర్గేతో ముగిసిన రాహుల్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. నిర్ణయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైకమాండ్‌కే అప్పగించారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఇతర సీనియర్ నేతలు భేటీ అయ్యారు. సీఎం ఎవరన్నది సాయంత్రానికి తెలిసే అవకాశం వుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 

12:46 PM (IST) Dec 05

తుదిదశకు తెలంగాణ సీఎం ఎంపిక చర్చలు... ఖర్గే నివాసానికి రాహుల్, కేసి వేణుగోపాల్

దేశ రాజధాని డిల్లీలో తెలంగాణ నూతన ముఖ్యమంత్రి, మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ ముమ్మర కసరత్తు చేస్తోంది. దీనిపై చర్చించేందుకు ఇప్పటికే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంటికి రాహుల్ గాంధీ, కేసి వేణుగోపాల్ చేరుకున్నారు. అలాగే డికె శివకుమార్ తో ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాణిక్ రావ్ థాక్రే భేటీ అయ్యారు. అందరి ఏకాభిప్రాయంతో తెలంగాణ ముఖ్యమంత్రిని ఎంపిక చేయనున్నారు. 
 

11:38 AM (IST) Dec 05

డికె శివకుమార్ తో ఉత్తమ్ భేటీ...

దేశ రాజధాని డిల్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో డికె శివకుమార్ భేటీ అయ్యారు. అలాగే భట్టి విక్రమార్క కూడా జాతీయ నాయకులతో చర్చలు జరుపుతున్నారు.  తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపిక వ్యవహారం ఏఐసిసి చేతికి చేరిన సమయంలో ఉత్తమ్, భట్టీ డిల్లీకి చేరడం ఉత్కంఠకు దారితీసింది. 

10:42 AM (IST) Dec 05

ఇవాళ సాయంత్రంలోపు తెలంగాణ సీఎం ప్రకటన...

ఇవాళ సాయంత్రం లోపు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది ప్రకటిస్తామని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఇప్పటికే డిల్లీకి చేరుకున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించిన అనంతరం ఈ విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు.


 

10:24 AM (IST) Dec 05

డిల్లీకి చేరిన కాంగ్రెస్ రాజకీయాలు...

ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకులు రాహుల్, ప్రియాంక గాంధీలను భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి లు కలిసే అవకాశాలున్నాయి. ఇందుకోసం వాళ్లు ఇప్పటికే దేశ రాజధాని డిల్లీకి చేరుకున్నారు. 
 

10:20 AM (IST) Dec 05

ఎంపీ పదవికి ఉత్తమ్ రాజీనామా...

తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎంపీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాతో భేటీ కానున్నారు. 
 

08:49 AM (IST) Dec 05

తెలంగాణ సీఎంగా రేవంత్..? ప్రమాణస్వీకారానికి మహూర్తం ఖరారట

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఏఐసిసి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 7న 10 గంటలకు రేవంత్ తో పాటు మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. 


 

06:48 AM (IST) Dec 05

నేడే తెలంగాణ సీఎం ప్రకటన... డిల్లీలో వేగంగా నిర్ణయాలు

మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో డికె శివకుమార్, మాణిక్ రావు థాక్రే భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపిక, మంత్రివర్గ కూర్పుపై చర్చించనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని ఎమ్మెల్యేల ముందే వెల్లడించనున్నారు డికె. ఇవాళ మధ్యాహ్నం లేదా సాయంత్రానికి తెలంగాణ నూతన సీఎం ఎవరన్నది తేలనుంది. 
 

09:59 PM (IST) Dec 04

ప్రాణం వున్నంత వరకు కేసీఆర్‌తోనే : పాడి కౌశిక్ రెడ్డి

తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఖండించారు. తన పాత ఫోటో పెట్టి రేవంత్ రెడ్డిని కలిసినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హుజురాబాద్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని, ఫేక్ ప్రచారాలను ఎవరూ నమ్మొద్దన్నారు. హుజురాబాద్‌ను గొప్పగా అభివృద్ధి చేసుకుందామని కౌశిక్ రెడ్డి అన్నారు. తన గొంతులో ప్రాణం వున్నంత వరకు కేసీఆర్‌, ఆయన కుటుంబంతోనే వుంటానని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. 

09:41 PM (IST) Dec 04

కేసీఆర్ ఓటమిపై అసదుద్దీన్ స్పందన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి నేపథ్యంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు. ఓటమికి కారణాలు గుర్తించి బీఆర్ఎస్ సరిదిద్దుకుంటుందని ఒవైసీ ఆకాంక్షించారు. కేటీఆర్, హరీశ్‌రావులకు ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు అవకాశం దొరికిందన్నారు. 

09:38 PM (IST) Dec 04

కొత్త ప్రభుత్వానికి సెక్రటేరియట్‌లో ఛాంబర్లు రెడీ

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో అందుకు తగినట్లుగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సచివాలయంలో సాధారణ పరిపాలనా శాఖ ఛాంబర్లను సిద్ధం చేస్తోంది. పాత బోర్డులను తొలగించడంతో పాటు ప్రభుత్వ సలహాదారుల కార్యాలయాలను ఖాళీ చేస్తున్నారు. కొత్త మంత్రుల కోసం కొత్త సిబ్బందితో పాటు గ్రౌండ్ ఫ్లోర్‌లో మీడియాకు ప్రత్యేక గది కేటాయించారు. 

09:33 PM (IST) Dec 04

తెలంగాణ భవన్‌లో ప్రజలకు అందుబాటులో వుంటాం : కేటీఆర్

ఇకపై తెలంగాణ భవన్ నుంచి ప్రజలకు అందుబాటులో వుంటామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందని, ఎన్నికల్లో గౌరవ ప్రదమైన స్థానాలు సాధించిందని కేటీఆర్ అన్నారు. ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. 

09:29 PM (IST) Dec 04

తెలంగాణ కొత్త సీఎం ఎవరు.. మాణిక్యం ఠాగూర్ వ్యాఖ్యలు

తెలంగాణకు కాబోయే సీఎం ఎవరన్న దానిపై కాంగ్రెస్ నేతలు తేల్చుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన ఎంపీ, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు మాణిక్యం ఠాగూర్ స్పందించారు. తెలంగాణ ఎమ్మెల్యేల అభిప్రాయం పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు చేరిందన్నారు. రేపు ఏఐసీసీ పరిశీలకులతో ఖర్గే భేటీ అవుతారని, సీఎం అభ్యర్ధి ఎవరనేది ఆయనే ప్రకటిస్తారని ఠాగూర్ చెప్పారు. కాంగ్రెస్‌లో ఓ విధానం వుందని.. సరైన వ్యక్తినే అధిష్టానం సీఎంగా ఎంపిక చేస్తుందని ఆయన తెలిపారు.  
 

09:24 PM (IST) Dec 04

అధిష్టానం ప్రకటన తర్వాత మరోసారి గవర్నర్ వద్దకు కాంగ్రెస్ నేతలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో సీఎల్పీ నేత ఎవరన్నది తేల్చడం కష్టంగా మారింది. దీంతో నిర్ణయాన్ని హైకమాండ్‌కే వదిలేశారు నేతలు. అధిష్టానం నుంచి ప్రకటన వచ్చాక కాంగ్రెస్ నేతలు మరోసారి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలవనున్నారు. హైకమాండ్ నుంచి ప్రకటన తర్వాతే ప్రమాణ స్వీకారంపై స్పష్టత రానుంది. 
 

09:22 PM (IST) Dec 04

సీఎం ఎవరో తేలని వైనం.. ఢిల్లీకి డీకే శివకుమార్

తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్నది తేలడం లేదు. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్‌లో సీఎల్పీ సమావేశం జరగ్గా.. సీఎల్పీ నేత ఎన్నికపై క్లారిటీ లేదు. ఎమ్మెల్యేల నుంచి విడివిడిగా అభిప్రాయాలను తెలుసుకున్న ఏఐసీసీ పరిశీలకులు నిర్ణయాన్ని హైకమాండ్‌కే అప్పగించారు. సీఎం ఎవరో తేల్చేందుకు కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లారు. 

09:15 PM (IST) Dec 04

జనగామ జెడ్పీ ఛైర్మన్ మృతిపై కేసీఆర్ సంతాపం

గుండెపోటుతో కన్నుమూసిన జనగామ జిల్లా జడ్పీ ఛైర్మన్ సంపత్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఉద్యమం నుంచి తన వెంట నడిచిన సంపత్ మృతి బాధాకరమని, ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా వుంటుందని కేసీఆర్ తన సంతాప సందేశంలో వెల్లడించారు. 

08:46 PM (IST) Dec 04

ఫలితాలపై కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి స్పందించారు. సోమవారం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో ఆయనను పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. ప్రజల తీర్పును గౌరవిద్దామని, కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామన్నారు. ఎన్నికల ఫలితాలపై సమీక్ష కోసం త్వరలో పార్టీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. 

 

08:34 PM (IST) Dec 04

గజ్వేల్ ఎమ్మెల్యేగా ధ్రువీకరణ పత్రం అందుకున్న కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ పత్రాన్ని స్థానిక బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఆయనకు అందజేశారు. కేసీఆర్ వెంట సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వున్నారు. 

08:31 PM (IST) Dec 04

తెలంగాణలో ఎన్నికల కోడ్ ఎత్తివేత

తెలంగాణలో ఎన్నికలు ముగియడంతో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేసింది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లోనూ ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని వెల్లడించింది. 

05:44 PM (IST) Dec 04

రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ పదవికి వినోద్ రాజీనామా

తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవికి బోయిన్‌పల్లి వినోద్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను తెలంగాణ సీఎస్ శాంతికుమారికి పంపారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో కేసీఆర్ హయాంలో నియమితులైన కీలక అధికారులు కూడా ఒక్కొక్కరిగా రాజీనామా చేస్తున్నారు. 

05:41 PM (IST) Dec 04

కొత్త సీఎం కాన్వాయ్ ఇదే

తెలంగాణకు కాబోయే కొత్త ముఖ్యమంత్రి కోసం సాధారణ పరిపాలన శాఖ కొత్త కాన్వాయ్ సిద్ధం చేసింది. ఆరు తెలుపు రంగు వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే కొత్త కాన్వాయ్‌లోనే సీఎం వెళ్లేందుకు వీలుగా వాహనాలను సిద్ధం చేశారు. 
 

05:37 PM (IST) Dec 04

మూడో శాసనసభ ఏర్పాటు , గెజిట్ నోటిఫికేషన్ జారీ

తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. కాసేపటి క్రితం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అందజేశారు.

05:06 PM (IST) Dec 04

కొత్త మంత్రుల కోసం సిద్ధమైన వాహనాలు

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో కొత్త మంత్రుల కోసం ప్రోటోకాల్ ప్రకారం వాహనాలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. వీటిని దిల్‌కుష అతిథి గృహానికి తీసుకొచ్చారు. మరికాసేపట్లో తెలంగాణ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎల్పీ భేటీ జరగ్గా.. ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాల మేరకు కొత్త సీఎంను ప్రకటించనున్నారు. 

04:40 PM (IST) Dec 04

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు చేశారు. నిన్న కౌంటింగ్ సందర్భంగా పోలీసులతో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయనపై ఐపీసీ 506, 290, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా వున్న కౌశిక్ రెడ్డి.. హుజురాబాద్‌లో సీనియర్ నేత ఈటల రాజేందర్‌ను ఓడించి సంచలన విజయం నమోదు చేశారు. 

04:04 PM (IST) Dec 04

కాసేపట్లో రాజ్‌భవన్‌కు వికాస్ రాజ్

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు కసరత్తు మొదలైంది. ఇప్పటికే సీఎల్పీ నేత ఎంపిక ప్రక్రియ మొదలవ్వగా.. సాయంత్రానికి సీఎం ఎవరో క్లారిటీ రానుంది. మరోవైపు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కాసేపట్లో రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధుల వివరాలను ఆయన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు సమర్పించనున్నారు. 
 

04:01 PM (IST) Dec 04

ఇంటెలిజెన్స్ ఓఎస్‌డీ ప్రభాకర్ రావు రాజీనామా

తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఓటమి నేపథ్యంలో ఆయన హయాంలో కీలక హోదాల్లో పనిచేసిన ఉన్నతాధికారులు ఒక్కొక్కరిగా రాజీనామా చేస్తున్నారు. తాజాగా తెలంగాణ ఇంటెలిజెన్స్ ఓఎస్‌డీ ప్రభాకర్ రావు  రాజీనామా చేశారు. 

03:37 PM (IST) Dec 04

కేసీఆర్‌తోనే నా ప్రయాణం : తెల్లం వెంకట్రావు

భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై వెంకట్రావు స్పందించారు. ఈ ప్రచారాన్ని ఖండించిన ఆయన.. తనను నమ్మి బీఫాం ఇచ్చిన కేసీఆర్‌కు రుణపడి వుంటానని, ఆయనతోనే తన ప్రయాణం వుంటుందని తెల్లం స్పష్టం చేశారు. 

01:58 PM (IST) Dec 04

ఇవాళ రాత్రే నూతన సీఎం ప్రమాణస్వీకారం...

ఇవాళ రాత్రి 8 గంటలకు తెలంగాణ నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి. ఏఐసిసి నిర్ణయించిన అభ్యర్థి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ మేరకు రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
 

01:55 PM (IST) Dec 04

రేవంత్ కు సీఎం పదవి..: విహెచ్ మద్దతు

రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి హన్మంతరావు స్వరం మారింది. గతంలో రేవంత్ కు టిపిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగించడాన్ని వీహెచ్ తీవ్రంగా వ్యతిరేకించిన  విషయం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి పదవి విషయంలో మాత్రం రేవంత్ కు సంపూర్ణ మద్దతు తెలిపారు విహెచ్.  కాంగ్రెస్ గెలుపుకోసం రేవంత్ ఎంతగానో కష్టపడ్డాడని... కాబట్టి ముఖ్యమంత్రిగా అతడే సరైన అభ్యర్థి అని విహెచ్ స్పష్టం చేసారు. 
 

01:26 PM (IST) Dec 04

తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ సమావేశం ప్రారంభం

తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎల్పీ నేతను ఎన్నుకునే అవకాశం వుంది. అలాగే బిఆర్ఎస్ ఓటమి, ప్రతిపక్షంగా భవిష్యత్ లో ఎలా వ్యవహరించాలన్నదానిపై కూడా చర్చ జరగనున్నట్లు సమాచారం. 

01:13 PM (IST) Dec 04

ఇవాళ సాయంత్రానికే శుభవార్త : అద్దంకి దయాకర్

ఇవాళ సాయంత్రానికే శుభవార్త వుంటుందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేసారు కాబట్టి వెంటనే ప్రభుత్వ ఏర్పాటు వుంటుందని... ఆ దిశగానే కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోందని దయాకర్ అన్నారు. 
 

01:09 PM (IST) Dec 04

సీఎల్పీ నేత ఎంపిక నిర్ణయం ఏఐసిసి దే

సిఎల్పి తీర్మానంపై ఏఐసిసి కీలక ప్రకటన వెలవడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరో రెండుమూడు గంటల్లో సీఎల్పీ నేత ఎంపిక ప్రకటన వుండనున్నట్లు తెలుస్తోంది. 

ముగిసిన CLP Meetting: సీఎల్పీనేత ఎంపిక బాధ్యత మల్లికార్జున ఖర్గేకు అప్పగింత