వొడాఫొన్, ఐడియా విలీనం ఎఫెక్ట్: రూ.10 వేల కోట్ల చెల్లింపు కష్టాలు

By Arun Kumar P  |  First Published Jan 21, 2019, 2:08 PM IST

టెలికం రంగంలో అతిపెద్ద సంస్థ వొడాఫోన్ ఐడియా రుణభారంతో కొట్టుమిట్టాడుతున్నది. ఇటీవలే విలీనమైన ఈ సంస్థ ఈ ఏడాది స్పెక్ట్రం చెల్లింపును రెండేళ్ల పాటు వాయిదా వేయాలని కేంద్రాన్ని అభ్యర్థించినట్లు సమాచారం. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ సంస్థల నుంచి వచ్చే పోటీని ఎదుర్కొనేందుకు, నిధుల సమీకరణకు వొడాఫోన్ ఐడియా డైరెక్టర్ల బోర్డు బుధవారం భేటీ కానున్నది.
 


న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా.. ఈ ఏడాది స్పెక్ట్రం కోసం చెల్లింపుల గడువును మరో రెండేండ్లు ఇవ్వాలని కోరుతున్నది. ఇటీవల విలీనమైన తమ సంస్థ భారీ అప్పులతో సతమతమవుతున్నదని, బ్యాలెన్స్ షీట్ అంతంత మాత్రంగా ఉండటంలో ప్రస్తుత సంవత్సరానికి రూ.10 వేల కోట్ల చెల్లింపునకు మరో రెండేండ్లు అవకాశం ఇవ్వాలని కేంద్ర టెలికం శాఖను వొడాఫోన్ ఐడియా అభ్యర్తించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ప్రస్తుత అంచనా ప్రకారం వొడాఫోన్ ఐడియా ఈ ఏడాదికి స్పెక్ట్రం కోసం రూ.10 వేల కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుంది. 130 కోట్ల మంది భారతీయులకు డిజిటల్ సేవలు అందించడం టెలికం రంగ సంస్థలకు చాలా క్లిష్టమైన సమస్య అని వొడాఫోన్ ఐడియా ప్రతినిధి పేర్కొన్నారు. పలు సంస్థలు సేవలు అందిస్తుండటంలో ఏ సంస్థనైనా ఎన్నుకునే అవకాశం వినియోగదారుడికి ఉంటుందని, ఇదే సమయంలో సంస్థల మధ్య పోటీ రోజురోజుకు పెరుగుతుండటంతో స్పెక్ట్రం కోసం అధికంగా నిధులు వెచ్చించాల్సి వస్తున్నదని చెప్పారు. 

Latest Videos

undefined

ప్రస్తుతం దేశీయ టెలికం పరిశ్రమ ఆర్థిక ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతున్నది. వొడాఫోన్-ఐడియా సంస్థలు 2010, 2012, 2014, 2015, 2016లో విలీనం కంటే ముందు నిర్వహించిన స్పెక్ట్రం వేలం పాటలో పాల్గొన్నాయి. ఈ ఐదు వేలంపాటలో వొడాఫోన్ రూ.79,343 కోట్ల విలువైన స్పెక్ట్రం కొనుగోలు చేయగా, ఇదే సమయంలో ఐడియా రూ.63,597 కోట్ల విలువైన స్పెక్ట్రం కొనుగోలు చేసింది. 

దీర్ఘకాలికంగా టెలికం రంగం నిలకడైన వృద్ధిని సాధించాలంటే కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా నగదు సరఫరాను మెరుగుపరచాలని ఇటీవల వొడాఫోన్ ప్రతినిధి సూచించారు. రూ.7.8 లక్షల అప్పులు ఉండటంతో టెలికం సంస్థలను ఆదుకోవడానికి స్పెక్ట్రం చెల్లింపులను 10 ఏండ్ల నుంచి 16 ఏండ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

ఇదిలా ఉంటే వొడాఫోన్ ఐడియా బోర్డు బుధవారం సమావేశం కానున్నది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ సంస్థల నుంచి వస్తున్న పోటీని ఎదుర్కొనేందుకు రూ.25 వేల కోట్ల నిధుల సేకరణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సమావేశంలో వొడాఫోన్ ఐడియా ఖరారు చేయనున్నది. 

click me!