మైక్రోసాఫ్ట్ లక్ష్యం: మూడేళ్లలో కృత్రిమ మేధలో 5 లక్షల మందికి శిక్షణ

By sivanagaprasad kodatiFirst Published Jan 20, 2019, 11:18 AM IST
Highlights

వచ్చే మూడేళ్లలో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని సంకల్పించింది మైక్రోసాఫ్ట్. అందుకోసం ఐదు లక్షల మంది యువతకు కృత్రిమ మేధస్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దేశంలోని పలు యూనివర్శిటీల పరిధిలో 10 కృత్రిమ మేధస్సు ల్యాబోరేటరీలను ఏర్పాటు చేయనున్నది.

 భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా వచ్చే మూడేళ్లలో ఐదు లక్షల మంది యువకులకు కృత్రిమ మేధస్సులో శిక్షణ ఇవ్వాలని ప్రణాళికలు రూపొందించింది. పది యూనివర్శిటీల పరిధిలో కృత్రిమ మేధస్సు ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నది. వివిధ టెక్నాలజీ ఏరియాల్లో వెయ్యి మంది డెవలపర్లను తయారు చేయాలని మైక్రోసాఫ్ట్ ఇండియా సంకల్పం. 

ప్రభుత్వ రంగ సంస్థలతో కలిపి 700 సంస్థలు తమ కృత్రిమ మేధస్సు (ఏఐ) పరిష్కారాలు వాడుకుంటున్నాయని మైక్రోసాఫ్ట్ ఇండియా పేర్కొంది. ఏఐ సేవలను అందుకుంటున్న సంస్థల్లో 60 శాతం అతి పెద్దవి. భారతదేశంలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా పరివర్తన చెందుతున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొన్నది.   

మైక్రోసాఫ్ట్ అంతటితో ఆగకుండా రీసెర్చ్, ఉన్నత విద్యా సంస్థల్లో ఇంటెలిజెన్స్ క్లౌడ్ హబ్‌ను ప్రారంభించింది. తద్వారా కృత్రిమ మేధస్సు (ఏఐ)లో మౌలిక వసతుల కల్పించడం ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్సెస్, ఏఐ, ఐఓటీ విభాగాల్లో విద్యార్థుల నైపుణ్యం పెంపొందించాలని మైక్రోసాఫ్ట్ ఇండియా లక్ష్యం. 

మైక్రోసాఫ్ట్ ఇండియా అధ్యక్షులు అనంత్ మహేశ్వరి మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు (ఏఐ) భారతదేశంలో గేమ్ చేంజర్ కానున్నదని తెలిపారు. విద్య, నైపుణ్యం, ఆరోగ్య పరిరక్షణ, వ్యవసాయ రంగాల్లో మరింత పురోగతి సాధించడానికి కృత్రిమ మేధస్సు మరింత కీలక పాత్ర పోషించనున్నదని చెప్పారు.

భారత టెక్నాలజీ రంగంలో ఏఐ సామర్థ్యం వాస్తవరూపం దాలుస్తుందన్నారు. భద్రత, వ్యక్తిగత గోప్యత, అక్కౌంటబిలిటీ రంగాల్లో శక్తి సామర్థ్యం పెంపొందించేందుకు మైక్రోసాఫ్ట్ చర్యలు చేపట్టిందని అనంత్ మహేశ్వరి తెలిపారు. 

click me!