‘ఐఫోన్’ కంటే కాస్ట్‌లీ గురూ: త్వరలో మార్కెట్లోకి శామ్‌సంగ్ ఫోల్డబుల్

By sivanagaprasad kodatiFirst Published Nov 27, 2018, 8:24 AM IST
Highlights

శామ్‌సంగ్ తన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తుందా? అని టెక్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ దాని ధర మాత్రం ‘యాపిల్’ను మించి చుక్కలంటుతున్నదోచ్.. అమెరికా డాలర్లలో 2500 డాలర్లతే మన రూపాయిల్లో రూ.1.85 లక్షలు పలుకవచ్చని అంచనా. 

త్వరలో మార్కెట్లో ఆవిష్కరించనున్న దక్షిణ కొరియా మొబైల్స్ మేజర్ శామ్‌సంగ్ మడిచే (ఫోల్డబుల్) ఫోన్ పనితీరు సంగతేమిటో గానీ ధర మాత్రం చాలా ఖరీదే. అదీ కూడా యాపిల్ ఇటీవల ఆవిష్కరించిన ‘ఐఫోన్ ఎక్స్ మాస్’ కంటే ఎక్కువ సుమా.

ఇటీవల శామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్లంటే వినియోగదారులకు ఆతృత ఎక్కువే మరి. కానీ ఆ ఫోన్ల ధర అందరికి అందుబాటులో ఉండకపోవచ్చునని ‘గిజ్‌మోడో యూకే’ ఒక కథనం ప్రచురించింది. కానీ శామ్‌సంగ్ ఫోల్డబుల్ ఫోన్‌కు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.

ఆ కథనం ప్రకారం శామ్‌సంగ్ ఫోల్డబుల్ ఫోన్ ధర 2,500 డాలర్లు ఉండొచ్చని తెలుస్తోంది. అంటే మన కరెన్సీలో దాని విలువ రూ.లక్షా 76వేలు పైమాటే. శామ్‌సంగ్ గెలాక్సీ ఫ్లెక్స్‌ లేక మరోపేరుతో మార్కెట్‌లోకి రానున్న ఈ ఫోన్‌ కాన్సెప్ట్‌ డివైజ్‌గా ఉండనున్నదని, సామాన్యులకు అందుబాటులో ఉండేది కాదని వివరించింది.

ఆ ఫోన్‌ ఖరీదు 1,500 పౌండ్ల నుంచి 2,000 పౌండ్ల వరకు ఉండొచ్చని తెలిపింది. యాపిల్‌ ఫోన్లలో అత్యంత ఖరీదైనదిగా భావించే ఐఫోన్ ఎక్స్ మాస్‌ ధర(1,449 డాలర్లు) కంటే ఎక్కువగా ఉంది. ఈ ఫోల్డబుల్‌ ఫోన్‌ అనేక వేరియంట్లలో విడుదల కానుందని వాటిలో టాప్‌ మోడల్ ధర 2,000 పౌండ్లు(రూ.లక్షా 82 వేలు) వరకు ఉండొచ్చని ఆ నివేదిక పేర్కొంది.

శామ్‌సంగ్ విడుదల చేయనున్న ఆ ఫోన్‌కు గెలాక్సీ ఎక్స్‌, గెలాక్సీ ఎఫ్, గెలాక్సీ ఫ్లెక్స్‌ ఇందులో ఏదో ఒక పేరుతో మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు తెలుస్తున్నది. శామ్‌సంగ్ డెవలపర్స్‌ సమావేశంలో మడిచే ఫోన్‌కు సంబంధించిన ప్రకటన చేయడంతో పాటు డిస్‌ప్లేను మాత్రం చూపించి, మిగతా ఫోన్‌ను రహస్యంగా ఉంచారు. శామ్‌సంగ్ తరవాత దక్షిణ కొరియాకు చెందిన మరో సంస్థ ఎల్‌జీ కూడా అలాంటి ఫోన్‌నే మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు సూచన ప్రాయంగా ప్రకటించడం గమనార్హం. 

click me!