ముకేశ్ ముందుచూపు..హాత్‌వే కైవసంపైనే ఫోకస్

By sivanagaprasad kodati  |  First Published Oct 4, 2018, 8:23 AM IST

రెండేళ్ల క్రితం మార్కెట్‌లోకి అడుగుపెట్టి విజయం సాధించిన ‘జియో’ సంతోషంతో బ్రాడ్ బ్యాండ్ సేవలను జియో గిగా ఫైబర్ నెట్ వర్క్ తెస్తామని ప్రకటించారు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. బ్రాడ్ బ్యాండ్ రంగంలోకి అడుగు పెట్టేందుకు గతంలో ‘డెన్ నెట్‌వర్క్స్‌’ సంస్థను కైవసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 


రిలయన్స్ ఒక బ్రాండ్.. ఆ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ అంటే ఇష్టపడని వారు, అభిమానించని వారు ఉండరు. ఆయన.. ఆయనకు ముందు ధీరూబాయి అంబానీ పట్టిందల్లా బంగారమే.. రెండేళ్ల క్రితం టెలికం రంగంలో అడుగు పెట్టిన ‘జియో’ సంచనాలు స్రుష్టించింది.

ఇంతకుముందు రారాజుగా వెలుగొందిన భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యూలర్ తదితర సంస్థలన్నీ కకావికలం అయ్యాయి. కొన్ని సంస్థలు కనుమరుగైతే, ఐడియా, వొడాఫోన్ వంటి సంస్థలు విలీనమయ్యాయి. 

Latest Videos

undefined

‘జియో’ అందించిన విజయంతో ఉత్తేజితులైన ముకేశ్ అంబానీ బ్రాడ్ బాండ్ సర్వీసుల రంగంలోకి అడుగు పెట్టనున్నట్లు ఇటీవల జరిగిన రిలయన్స్ వార్షిక సమావేశంలో ప్రకటించారు. ఈ క్రమంలో రిలయన్స్ త్వరితగతిన ఆ రంగంలోకి అడుగు పెట్టేందుకు గిగాఫైబర్‌ హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నది.

ఈ క్రమంలో రిలయన్స్‌ ఇతర కంపెనీల కొనుగోళ్లపైనా దృష్టి పెట్టింది. తాజాగా దేశీయంగా అతి పెద్ద కేబుల్‌ ఆపరేటర్‌ హాత్‌వే కేబుల్‌ అండ్‌ డేటాకామ్‌ సంస్థ కొనుగోలు కోసం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం చర్చలు కూడా ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, డీల్‌ పూర్తిగా కుదురుతుందా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేమని వివరించాయి. అయితే, రిలయన్స్‌ మాత్రం హాత్‌వేను కచ్చితంగా దక్కించుకోవాలనే భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. సుమారు రూ. 2,500 కోట్ల మేర వ్యాల్యుయేషన్‌పై చర్చలు జరుగుతున్నట్లు వినికిడి. 

రిలయన్ కమ్యూనికేషన్స్ యాజమాన్యం కేబుల్‌ టీవీ రంగ సంస్థను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడం ఇదే తొలిసారి కాదు. గతంలో సమీర్‌ మన్‌చందా ప్రమోటర్‌గా ఉన్న ‘డెన్‌ నెట్‌వర్క్స్‌’ను కొనేందుకు ప్రయత్నించింది. చర్చలు తుది దశ దాకా కూడా జరిగాయి. కానీ ఆ ఒప్పందం కుదరలేదు. దీంతో.. తమ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ కింద తమ గిగాఫైబర్‌ ప్రాజెక్టును సొంతంగానే ప్రారంభించేందుకు సిద్ధమైంది. 

వాస్తవానికి ఏదైనా భారీ మల్టీ–సిస్టమ్‌ ఆపరేటర్‌ (ఎంఎస్‌వో)తో పాటు కొన్ని చిన్న సంస్థలను కొనుగోలు చేయడం ద్వారా త్వరితగతిన కార్యకలాపాలు విస్తరించాలన్నది కంపెనీ వ్యూహంగా ఉన్నది. ఆయా సంస్థల మౌలిక వసతులను ఉపయోగించుకుని వీడియో, బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు ప్రారంభించాలన్న ఆలోచనలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. 

కానీ కీలక మార్కెట్లలో స్థానిక కేబుల్‌ ఆపరేటర్స్‌ (ఎల్సీవో) నుంచి తీవ్రంగా వ్యతిరేకత వస్తుండటంతో వినియోగదారుల ఇళ్ల దాకా కనెక్టివిటీని విస్తరించే విషయంలో రిలయన్స్‌ జియోకి సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో గిగాఫైబర్‌ ప్రాజెక్టు ప్రవేశపెట్టడంలో మరింత జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ రంగంలో ఉన్న ఏదైనా ఎంఎస్‌వోను కొనుగోలు చేయాలన్న ప్రణాళికను కంపెనీ మళ్లీ పరిశీలించడం ప్రారంభించినట్లు సమాచారం. 

ఒకవేళ హాత్‌వేని గానీ చేజిక్కించుకోగలిగితే జియో బ్రాడ్‌బ్యాండ్‌ ప్రణాళికలకు గట్టి ఊతమే లభించగలదని పరిశ్రమ వర్గాల అంచనా. ‘ఆర్‌ఐఎల్‌కి ఇప్పటికే ఎంఎస్వో లైసెన్స్ ఉండటంతోపాటు ఫైబర్‌ నెట్‌వర్క్‌ను కూడా విస్తరించింది. ఇక కావాల్సినదల్లా స్థానిక కేబుల్‌ ఆపరేటర్ల మద్దతు మాత్రమే. ఏదైనా ఎంఎస్‌వోను కొనుగోలు చేసిందంటే చాలు ఈ సమస్య పరిష్కారమైనట్లే’ అని ప్రముఖ బ్రోకరేజి సంస్థ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

కేబుల్‌ బ్రాడ్‌బ్యాండ్, కేబుల్‌ టీవీ సర్వీసులు అందిస్తున్న హాత్‌వే కేబుల్‌లో ప్రమోటరు రహేజా గ్రూప్‌నకు 43.48 శాతం వాటాలు ఉన్నాయి. కంపెనీ దాదాపు 1.1 కోట్ల డిజిటల్‌ కేబుల్‌ టీవీ కనెక్షన్లతో పాటు 8 లక్షల బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు.

జూన్‌ త్రైమాసికం గణాంకాల ప్రకారం హాత్‌వే బ్రాడ్‌బ్యాండ్‌ ప్రతి యూజర్‌పై సగటున నెలకు (ఏఆర్‌పీయూ) రూ. 710 ఆదాయం ఉంటోంది. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి సంస్థకు రూ. 1,617 కోట్ల రుణభారం ఉంది. వచ్చే రెండేళ్లలో దీన్ని రూ. 500 కోట్ల మేర తగ్గించుకోవాలని హాత్ వే భావిస్తోంది. 

వచ్చే 18 నెలల్లో హాత్‌వే ప్రమోటర్లు.. ఈక్విటీతోపాటు దీర్ఘకాలిక అన్‌సెక్యూర్డ్‌ రుణాల రూపంలో రూ. 350 కోట్లు సమకూరుస్తున్నారు. ఇప్పటికే జూలైలో తొలి విడతగా రూ. 100 కోట్లు ఇవ్వగా, మరో రూ. 100 కోట్లు ఆగస్టు ఆఖరు నాటికి ఇవ్వనున్నట్లు గతంలో కంపెనీ వర్గాలు తెలిపాయి.

మరో రూ. 150 కోట్లు 2020 మార్చి నాటికి లభించనున్నాయి. భవిష్యత్‌లో తన సంస్థ కార్యకలాపాల ద్వారా మరో రూ. 150 కోట్లు సమకూర్చుకోవాలని హాత్ వే యోచిస్తున్నట్లు తెలుస్తోంది. డీల్‌ వార్తలు వచ్చిన నేపథ్యంలో బుధవారం హాత్‌వే కేబుల్‌ అండ్‌ డేటాకామ్‌ షేర్ బీఎస్‌ఈలో సుమారు తొమ్మిది శాతం పెరిగి రూ. 27.60 వద్ద ముగిసింది.

click me!