చిల్లర వర్తకులకు బిగ్ రిలీఫ్.. ఈ మాండేట్ ఉంటే సరి

By rajesh yFirst Published Aug 23, 2019, 11:07 AM IST
Highlights

ఈ- మాండేట్ ద్వారా చెల్లింపులకు ఆన్ లైన్‌లో వన్ టైం రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటే చిల్లర వర్తకులు, నిత్యం చెల్లింపులు జరిపే వారు డెబిట్‌, క్రెడిట్‌, కార్డులతో చెల్లింపులు జరుపనవసరం లేదు. వన్ టైం పాస్ వర్డ్ పొందితే చాలు.. దాంతోనే లావాదేవీలన్నీ పూర్తి చేయొచ్చునని ఆర్బీఐ తెలిపింది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 

ముంబై: తరచుగా ఒకే వర్తకుడితో లావాదేవీలు నెరుపుతున్నారా?? ఆ లావాదేవీలకు కార్డుతో చెల్లింపులు జరుపుతున్నారా? అయితే, వచ్చే నెల నుంచి ఈ చెల్లింపుల ప్రక్రియ మరింత సులభ తరం అవుతుంది. ఒక్క ఆదేశం (ఈ-మాండేట్‌) ద్వారా ఇకపై ఆటోమేటిక్‌గా చెల్లింపులు జరుపొచ్చు. 

లావాదేవీ జరిగినప్పుడల్లా రెండంచెల (కస్టమర్ జనరేట్‌ చేసుకున్న పాస్‌వర్డ్‌తోపాటు వన్‌ టైం పాస్‌వర్డ్‌) ధ్రువీకరణ తతంగం లేకుండా చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేసేయవచ్చునన్నమాట. అదెలాగంటే.. డెబిట్‌, క్రెడిట్‌ లేదా ప్రీ-పెయిడ్‌ కార్డుల లావాదేవీలకు ఈ-మాండేట్‌ సెట్‌ చేసుకునేందుకు ఆర్‌బీఐ అనుమతిచ్చింది.
 
వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ఈ-మాండేట్ విధానం అమల్లోకి వస్తుందని ఆర్బీఐ తాజా సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ ఉచిత సౌకర్యం కేవలం పునరావృత చెల్లింపులకు మాత్రమేనని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ-మాండేట్‌ను సెట్‌ చేసుకునేందుకు కార్డు హోల్డర్లు వన్‌ టైం రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. 

ముందుగా నిర్ణయించే స్థిర విలువకు లేదా మారే విలువకూ ఆటోమెటిక్‌ చెల్లింపు మాండేట్‌ను సెట్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఈ ఆదేశంలో ఎలాంటి సవరణకైనా మళ్లీ ధ్రువీకరణ అవసరమవుతుంది. కార్డు హోల్డర్లు ఏ సమయంలోనైనా ఈ-మాండేట్‌ను ఉపసంహరించుకోవచ్చు. 

అన్నిరకాల డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, వాలెట్లతో సహా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (పీపీఐ’స్)తో ఈ -మాండేట్ ద్వారా చెల్లింపులు పూర్తి చేసుకోవచ్చు.  వివిధ రంగాల పరిశ్రమల యాజమాన్యాలు, ప్రతినిధులు చేసిన అభ్యర్థనల మీదటే ఈ ‘ఈ-మాండేట్’ విధానాన్ని ఆర్బీఐ అమలులోకి తెచ్చింది. 

ఈ మాండేట్ ద్వారా గరిష్ఠంగా రూ.2000 వరకు చెల్లింపులు జరుపవచ్చు. కేవలం ఒకే ఒక్కసారి చేసే చెల్లింపులకు కాక నిరంతరం చెల్లింపులు చేసే ఖాతాదారులకు మాత్రమే ‘ఈ-మాండేట్’ సౌకర్యం వర్తిస్తుంది. 

ఈ-మాండేట్ సౌకర్యాన్ని ఉపయోగించుకునే డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్లు అదనపు చార్జీలు చెల్లించనవసరం లేదు. నిరంతరం చెల్లింపులు జరిపే డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగదారులు మాత్రం అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆథంటికేషన్ (ఎఎఫ్ఎ)తో వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. 

రికరింగ్ లావాదేవీల ఆధారంగా ఫస్ట్ ఈ-మాండేట్ లావాదేవీల ప్రక్రియ, దానికి ఎఎఫ్ఎ ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. తొలి లావాదేవీ విజయవంతంగా పూర్తి చేసుకుంటేనే తదుపరి రికరింగ్ లావాదేవీలు జరుగుతాయి. ఎఎఫ్ఎ లేకుండా కూడా చేసుకోవచ్చు. 
 

click me!