రిలయన్స్ జియో తన వినియోగదారులకు పండుగ సీజన్ సందర్భంగా సరికొత్త ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. రూ.1500 విలువైన జియో ఫోన్ రూ.699లకే అందిస్తోంది. ఇలా కొత్త జియో ఫోన్ కొనుగోలు చేసిన వారికి రూ.700 విలువైన డేటాను అందిస్తోంది. తద్వారా వినియోగదారుడికి రూ.1500 ఆదా అవుతుంది.
టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరోసారి సంచలనం స్రుష్టించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కాల్స్, డేటా, ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను చౌక ధరలకే అందిస్తూ ప్రత్యర్థి టెలికం సంస్థల పోటీదారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. సామాన్యుడి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్ ఉండాలనే ఉద్దేశంతో జియోఫోన్‌లు ప్రవేశపెట్టింది. వాటిని వినియోగించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
దసరా, దీపావళి పండగలను దృష్టిలో పెట్టుకుని జియో మరో భారీ ఆఫర్‌తో ముందుకొచ్చింది. రూ.1500 విలువ గల జియో ఫోన్‌ను రూ.699కే అందించనున్నది. దీనికోసం పాత ఫోన్‌ను తిరిగి ఇచ్చేయాల్సిన పనిలేదు. నేరుగా రూ.699కే కొత్త ఫోన్‌ను పొందవచ్చని జియో సంస్థ మంగళవారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
నూతనంగా కొనుగోలు చేసే జియోఫోన్‌పై రూ.700 విలువ చేసే డాటాను అందించనుంది. ఇందులో భాగంగా వినియోగదారుడి చేసుకునే ఒక్కో రీచార్జ్‌కు అదనంగా రూ.99 విలువైన డాటాను జియో అందిస్తుంది. ఇది మొదటి ఏడు రీచార్జ్‌లకు వర్తిస్తుంది. ఫోన్ కొనుగోలుపై రూ.800, ఏడు రీచార్జీల డేటా విలువ రూ.700 కలిపి వినియోగదారుడు రూ.1500 ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ దసరా నుంచి దీపావళి వరకు మాత్రమే వర్తిస్తుంది.
దేశంలో ఉన్న అట్టడుగు వర్గాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ ఆఫర్ తీసుకువచ్చినట్లు జియో పేర్కొంది. దేశంలోని 35 కోట్ల 2జీ వినియోగదారులను 4జీ దిశగా మళ్లించి అందరికీ డిజిటల్ పరిజ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.