ఫెస్టివ్ సీజన్ సందర్భంగా రిటైల్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ దుమ్ములేపాయి. తొలి రోజు సేల్స్‌లో రూ.750 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్లు అమ్ముడు పోయాయి.
ముంబై: పండుగ సీజన్‌లో భారతీయ వినియోగదారులు స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లలో దుమ్ము లేపారు. ప్రముఖ రిటైల్ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఈ సీజన్ తొలి రోజు రికార్డు స్థాయిలో అమ్మకాలు సాధించినట్టు తెలుస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ. 750 కోట్ల విలువైన ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను విక్రయించామని, కేవలం 36 గంటల్లో ఈ రికార్డ్ సేల్‌ను నమోదు చేసినట్టు ప్రకటించింది.
కాగా, బిగ్ బిలియన్ డేస్ అమ్మకం తొలిరోజు రెండు రెట్లు వృద్ధిని సాధించినట్లు వాల్‌మార్ట్ సొంతమైన ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ప్రీమియం బ్రాండ్లు వన్‌ప్లస్, శాంసంగ్, ఆపిల్ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలతో 36 గంటల్లో 750 కోట్ల రూపాయలకు మించి సాధించినట్టు తెలిపింది.
undefined
తమకు ఇదే అతిపెద్ద ప్రారంభ రోజు అమ్మకాలని అమెజాన్ గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ తెలిపారు. బ్యూటీ అండ్ ఫ్యాషన్ రంగంలో 5 రెట్ల వృద్ధినీ, గ్రాసరీస్ అమ్మకాల్లో ఏకంగా 7 రెట్ల వృద్ధిని సాధించినట్టు వెల్లడించారు. ప్రధానంగా తమకొత్త కస్టమర్లలో 91శాతం, ద్వితీయ శ్రేణి, త్రుతీయ శ్రేని పట్టణాలదేనన్నారు.
ఫ్లిప్‌కార్ట్‌లో దాదాపు ఇదే స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రెండురెట్ల ఎక్కువ అమ్మకాలను సాధించింది. ఫ్యాషన్, బ్యూటీ, ఫర్నిచర్ సంబంధిత విక్రయాలు బాగా వున్నాయని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ కృష్ణమూర్తి తెలిపారు. మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు రెండో రోజు పుంజుకోనున్నాయని చెప్పారు.
ఈ ఫెస్టివ్ సీజన్ అమ్మకాల్లో మొత్తం మీద రెండు సంస్థలు 5 బిలియన్ డాలర్లకుమించి ఆదాయాన్ని ఆర్జించే అవకాశం వుందని తాజా నివేదికల అంచనా. స్నాప్‌డీల్, క్లబ్ ఫ్యాక్టరీ లాంటి సంస్థలు కూడా ఇదే జోష్‌ను కొనసాగిస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండుగ అమ్మకాలు అక్టోబర్ 4న ముగియనున్నాయి.