రూ.1,100 కోట్లతో ఇంటెల్ డిజైన్ సెంటర్.. అమెరికా తర్వాతే మనదగ్గరే..

By sivanagaprasad kodatiFirst Published Nov 17, 2018, 10:35 AM IST
Highlights

ఇంటెల్ కార్పొరేషన్ భారతదేశంలో పరిస్థితులకు అనుగుణంగా అతిపెద్ద డిజైన్ సెంటర్ నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రూ.1,100 కోట్ల వ్యయంతో బెంగళూరులో దీన్ని నిర్మించ తలపెట్టింది.

చిప్ తయారీ మేజర్ ఇంటెల్ అంతర్జాతీయంగా అమెరికా తర్వాత భారత దేశంలో రెండో డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. ఐటీ సిటీగా పేరొందిన బెంగళూరులో ఆ డిజైన్ సెంటర్ కొలువు దీరబోతున్నది. ఇందుకు రూ.1,100 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది ఇంటెల్. 

అమెరికా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇంటెల్.. నూతన తరం టెక్నాలజీతో కూడిన డిజైన్ల అభివ్రుద్ధిపైనే ద్రుష్టి సారించింది. 5జీ నెట్‌వర్క్‌కు ఉపకరించే టెక్నాలజీ అభివ్రుద్ధిపై ఫోకస్ చేయనున్నది. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్ తోపాటు మొత్తం 44 ఎకరాల పరిధిలో 6.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ డిజైన్ సెంటర్ కొలువు దీరనున్నది. 

అయితే సదరు డిజైన్ సెంటర్‌లో పని చేసేందుకు ఎంత మందిని సిబ్బందిని నియమించుకోనున్నదన్న విషయాన్ని ఇంటెల్ ఇంకా ప్రకటించలేదు. భారతదేశంలో ఇంటెల్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగాలను విస్తరిస్తున్నామని కంపెనీ తెలిపింది. తద్వారా హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ విభాగాల్లో హౌస్ టెక్నాలజిస్టుల నియామకానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నది. 

ఇంటెల్ ఇండియా అధిపతి, ఇంటెల్ కార్పొరేషన్ డేటా సెంటర్ గ్రూప్ ఉపాధ్యక్షుడు నివ్రుత్తి రాయ్ మాట్లాడుతూ 5జీ, అడ్వాన్స్‌డ్ అసిస్టెన్స్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), గ్రాఫిక్స్, క్లయింట్, క్లౌడ్ తదితర రంగాల్లో టెక్నాలజీ ఉత్పత్తుల రూపకల్పనలో గణనీయ పాత్ర పోషించాలని భావిస్తున్నదని చెప్పారు. భారత టెక్నాలజీ రంగ అభివ్రుద్ధిలో ఇంటెల్ కీలకంగా వ్యవహరిస్తున్నదన్నారు. 

‘మేం ఏర్పాటు చేస్తున్న నూతన డిజైన్ సెంటర్.. దేశంలో టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్‌ కోసం కట్టుబడి ఉన్న దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు అనుగుణంగా డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్, ఆవిష్కరణ సంస్కృతిని ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతుంది.

మేం ఇన్నోవేటివ్ అవకాశాల కోసం, బెటర్ ఇండియా, బెటర్ వరల్డ్ నిర్మాణం కోసం పరస్పర సహకారం దిశగా ముందుకు సాగేందుకు ఆసక్తిగా ఉన్నాం. పట్టణ, గ్రామీణ ప్రాంతాల అనుసంధానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తాం. క్రుత్రిమ మేధస్సులో భారతదేశంలో ఉత్పాదక రంగంలో ఎకో సిస్టమ్ అందుబాటులోకి రానున్నది’ నివ్రుత్తిరాయ్ పేర్కొన్నారు.

click me!
Last Updated Nov 17, 2018, 10:35 AM IST
click me!