సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ కోర్సులు అభ్యసిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త. కాస్త అధునాతన టెక్నాలజీలో శిక్షణ పొందిన, పొందుతున్న నిపుణుల కోసమే ఐటీ సంస్థలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తద్వారా వచ్చే దశాబ్దిలోపు 14 లక్షల నూతన ఉద్యోగాలు ఐటీ నిపుణులను వరించనున్నాయి.
సాఫ్ట్‌వేర్ రంగంలో వర్ధమాన టెక్నాలజీలు రానున్న కాలంలో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయని సిస్కో - ఐడీసీ నివేదిక తెలిపింది. ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), బిగ్ డేటా వంటి టెక్నాలజీలు 2027నాటికి 14 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించనున్నట్టు పేర్కొంది.
అదేవిధంగా 2027నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ కొత్త తరం టెక్నాలజీలు 50 లక్షల ఉద్యోగాలను జత చేయనున్నట్టు నివేదిక తెలిపింది. దేశీయంగా 2017 నాటికి ఉన్న 91 లక్షల ఐటీ ఉద్యోగాల్లో 59 లక్షల ఉద్యోగాలు కొత్త టెక్నాలజీలకు సంబంధించినవేనని సిస్కో - ఐడీసీ నివేదిక పేర్కొంది.
undefined
సోషల్ మీడియా అడ్మినిస్ట్రేటర్, మెషిన్ లెర్నింగ్ డిజైనర్, ఐఓటీ డిజైనర్‌లకు రానున్న సంవత్సరాల్లో ఎక్కువ డిమాండ్ ఉండనున్నదని నివేదిక తెలిపింది. టెక్నాలజీలు మారుతున్న నేపథ్యంలో ఇందుకు అనుగుణంగా ఐటీ నిఫుణులు తమ నైపుణ్యాలను పెంచుకుంటున్నట్టు పేర్కొంది.
22 శాతం మంది ఐటీ ప్రొఫెషనల్ నిపుణులు స్వంతంగా నిధులు ఖర్చు చేసి సర్టిఫికేషన్ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు. వారిలో 50 శాతం మంది శిక్షణలోనే ఉండగా, కొందరు గతేడాది శిక్షణ పొందారు. శరవేగంగా మారుతున్న టెక్నాలజీస్‌లో పట్టు సాధించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. 15 శాతం మంది ఐటీ ప్రొఫెషనల్ రెస్పాండెంట్లు 2017లో సర్టిఫికేషన్ కోసం శిక్షణ పొందుతున్నారు.
కొత్త కోర్సులను నేర్చుకోవడమేకాకుండా శిక్షణకు కూడా వెళుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే పదింట ఏడు ఐటీ సంస్థలు ఐటీ సంస్థలు తమ నియామకాల్లో ఐటీ సర్టిఫికేషన్ పొందిన నిపుణుల కోసం ఎదురు చూస్తున్నాయి.
ఇక దేశీయ ఉద్యోగ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్న టాప్ 10 టెక్నాలజీల్లో సైబర్ సెక్యూరిటీ/డేటా సెక్యూరిటీ, బిగ్ డేటా, డేటా అనాలిసిస్ విజువలైజేషన్, ఐఓటీ, బిజినెస్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, వర్చువల్/సాఫ్ట్‌వేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కన్‌వర్జ్‌డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్ సొల్యూషన్స్/టెక్నాలజీలు ఉన్నాయి.
కాగా గత జూలైలో నాస్కామ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశీయంగా విభిన్న రంగాల్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ), బిగ్‌డేటా ఎనలిటిక్స్ విభాగాల్లో 1.4 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. ఇదే సమయంలో ఉద్యోగుల డిమాండ్ 5.1 లక్షలు ఉండగా, 3.7 లక్షల ఉద్యోగాలు భర్తీ అయినట్టు పేర్కొంది. 2021 నాటికి ఉద్యోగుల డిమాండ్ 8 లక్షలకు చేరుకోవచ్చని, ఇదేకాలంనాటికి ఉద్యోగుల లోటు 2.3 లక్షలు ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది.