ఎయిర్‌టెల్ కంటే రెట్టింపు: 4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో జియో టాప్

By sivanagaprasad kodati  |  First Published Nov 15, 2018, 10:57 AM IST

టెలీ కమ్యూనికేషన్ రంగంలో మళ్లీ రిలయన్స్ జియోదే మొదటి స్థానం. 22.3 ఎంబీపీఎస్ డేటా డౌన్ లౌడ్ వేగంలో జియో అగ్రస్థానంలో నిలువగా, అప్ లోడ్ లో మాత్రం ఐడియా సెల్యూలార్ స్థానం మొదటిది.


ఎప్పటి మాదిరిగానే రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్‌ డౌన్‌లోడ్‌ వేగంలో మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. అక్టోబర్ నెలలో సగటున సెకనుకు 22.3 మెగాబిట్స్‌ (ఎంబీపీఎస్‌) డౌన్‌లోడ్‌ వేగంతో మిగతా టెలికాం ఆపరేటర్లను వెనక్కి నెట్టేసింది.

ప్రత్యర్థి సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌తో పోలిస్తే జియో డౌన్‌లోడ్‌ వేగం రెట్టింపునకు పైనే కావడం ఆసక్తికర పరిణామం. ట్రాయ్‌ తెలిపిన నివేదిక ప్రకారం గత నెలలో భారతీ ఎయిర్‌టెల్‌ డౌన్‌లోడ్‌ వేగం 9.5 ఎంబీపీఎస్‌ మాత్రమే. 

Latest Videos

undefined

వొడాఫోన్, ఐడియా వేర్వేరుగానే సేవలువొడాఫోన్‌ ఇండియా, ఐడియాలు వొడాఫోన్‌ ఇండియా పేరుతో విలీనమైనా ఇప్పటికీ ఈ రెండు సంస్థలు వేర్వేరు బాండ్ల పేరిట సేవలు అందిస్తున్నాయి.

దీంతో ఈ రెండు సంస్థల వేగం కూడా వేర్వేరుగానే నివేదికలో ట్రాయ్‌ పొందుపరిచింది. అక్టోబర్ నెలలో ఐడియా, వొడాఫోన్‌ల డౌన్‌లోడ్‌ వేగం వరుసగా 6.4 ఎంబీపీఎస్‌, 6.6 ఎంబీపీఎస్‌ చొప్పున నమోదైంది. 

అప్‌లోడ్‌లో మళ్లీ మొదటిస్థానంలో ఐడియా సెల్యూలార్ 
అప్‌లోడ్‌ వేగం విషయానికొస్తే ఐడియా సెల్యులార్‌ మొదటి స్థానంలో నిలిచింది. గత నెలలో ఐడియా 4జీ అప్‌లోడ్‌ వేగం 5.9 ఎంబీపీఎస్‌గా ట్రాయ్‌ గణించింది. ఐడియా తర్వాతి స్థానంలో జియో (5.1 ఎంబీపీఎస్‌), వొడాఫోన్‌ (4.8 ఎంబీపీఎస్‌), ఎయిర్‌టెల్‌ (3.8 ఎంబీపీఎస్‌) ఉన్నాయి. కాగా.. గత కొన్నినెలలుగా డౌన్‌లోడ్‌ వేగంలో జియో, అప్‌లోడ్‌ వేగంలో ఐడియా తొలి స్థానంలో నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

నష్టాలతో ‘వొడాఫోన్ ఐడియా’ స్వాగతం
వొడాఫోన్‌ ఐడియా కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో రూ.4,973 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. 42.2 కోట్ల మంది వినియోగదారులతో భారత్‌లో అతి పెద్ద టెలికం కంపెనీగా అవతరించిన ఈ కంపెనీ  రూ.7,663 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి స్థూల రుణభారం రూ.1,26,100 కోట్లు అని వొడాఫోన్‌ ఐడియా తెలిపింది. రూ.13,600 కోట్ల నగదు, నగదు సమానమైన నిల్వలు ఉన్నాయని, నికర రుణభారం రూ.1,12,500 కోట్లని  కంపెనీ సీఈఓ బాలేశ్‌ శర్మ చెప్పారు.  

ప్లాన్లలో కొనసాగుతున్న ధరల పోరు 
టెలికం ప్లాన్‌ల విషయంలో ధరల పోరు ప్రభావం కొనసాగుతోందని, వినియోగదారులు చౌక–ధరల ప్లాన్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారని బాలేశ్‌ శర్మ పేర్కొన్నారు.  ఫలితంగా ఒక్కో వినియోగదారుడిపై లభించే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) రెండో త్రైమాసికంలో 4.7 శాతం తగ్గి రూ.88కు పడిపోయిందని (సీక్వెన్షియల్‌గా) వివరించారు. తొలి త్రైమాసికంలో ఈ కంపెనీ ఏఆర్‌పీయూ రూ. 100 గా ఉంది.  

రూ.25,000 కోట్లు సమీకరణపై వొడాఫోన్ ఐడియా కసరత్తు!  
కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ రూ.25,000 కోట్ల మూలధన నిధుల సమీకరణ కోసం కసరత్తు చేస్తోందని వొడాఫోన్ ఐడియా సీఈఓ బాలేశ్‌ శర్మ తెలిపారు. ప్రమోటర్‌ సంస్థలు–వొడాఫోన్‌ గ్రూప్‌ రూ.11,000 కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్‌ రూ.7,250 కోట్లు చొప్పున మొత్తం రూ.18,250 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చా యని వివరించారు. ఫైబర్‌ నెట్‌వర్క్‌ విభాగం విక్రయ ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.  

వొడాఫోన్ ఐడియా విలీన ప్రయోజనాల దిశగా అడుగులు
ఐడియా కంపెనీలో వోడాఫోన్‌ విలీనం ఈ ఏడాది ఆగస్టు 31న పూర్తయింది. ఈ విలీనం తర్వాత ఏర్పడిన వొడాఫోన్‌ ఐడియా కంపెనీ వెలువరించిన తొలి ఆర్థిక ఫలితాలు ఇవి. ఈ ఆర్థిక ఫలితాల్లో ఈ ఏడాది జూలై–ఆగస్టు  వరకూ ఐడియా ఫలితాలు, ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 30 వరకూ ఓడాఫోన్‌ ఐడియా ఫలితాలు కలిసి ఉన్నాయని, అందుకని గత క్యూ2లో ఐడియా ఫలితాలతో ఈ రెండో త్రైమాసికంలో వొడాఫోన్‌ ఐడియా ఫలితాలను పోల్చడానికి లేదని బాలేశ్‌ శర్మ వివరించారు. విలీన ప్రయోజనాలు అందుకునే దిశగా పయనం సాగిస్తున్నామని పేర్కొన్నారు. 
 

click me!