నకిలీ యాప్‌లు తొలగించిన గూగుల్‌ ప్లేస్టోర్‌

By rajesh yFirst Published Feb 22, 2019, 2:23 PM IST
Highlights


గూగుల్ ప్లే స్టోర్‌లో చేరిన 28 బూటకపు యాప్‌లను తొలిగించి వేసింది. క్విక్ హీల్ సాయంతో ఫేక్ యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ గుర్తించింది. ఇవన్నీ సర్వీస్ డెవలపర్ అనే ఒక పేరుతో తయారు చేసినవేనని తేలింది. యూజర్లకు రకరకాల సమస్యలు వచ్చి అనుమానాలతో ఫిర్యాదు చేయడంతో అసలు సంగతి బయటపడింది.

న్యూయార్క్: అసత్య సమాచారం గల 28నకిలీ యాప్‌లను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. 48వేల మందికి పైగా వీటిని ఇన్‌స్టాల్‌ చేసుకున్నట్లు క్విక్‌ హీల్‌ సెక్యురిటీ ల్యాబ్‌ గుర్తించింది. తద్వారా వాటిని తొలగించేందుకు సహకరించింది. ఆ ఫేక్ యాప్‌లన్నీ సర్వేశ్‌ డెవలెపర్‌ అనే ఒకే పేరుతో తయారుచేసినవని క్విక్‌ హీల్‌ పేర్కొంది. 

వాటిలో వర్చువల్‌ డేటా, మిని వాలెట్‌, గోల్డ్‌లోన్‌, లవ్‌ లైఫాఫా, చిట్‌ఫండ్స్‌ వంటి యాప్‌లు ఉన్నాయని క్విక్‌ హీల్‌ తన బ్లాగ్‌ పోస్టులో తెలిపింది. యాప్‌లో ఉన్న పేరుకు.. అవి చేసే పనికి ఏమాత్రం సంబంధం లేదని వివరించింది. 

ఉదాహరణకు ‘క్రెడిట్‌ కార్డ్‌ ప్రాసెస్‌’ అనే యాప్‌లో క్రెడిట్‌కార్డు పొందాలనుకునే వారికి కావాల్సిన సమాచారం ఉంటుందని మొదట కనిపించే వివరణలో పేర్కొన్నా.. ఇన్‌స్టాల్‌ చేసుకున్న తరువాత అందులో సంబంధిత సమచారమేదీ లేదని తేలింది. మరో యాప్‌ ‘హోమ్‌ లోడ్‌ అడ్వైజర్‌’ను ఇన్‌స్టాల్‌ చేసుకొని అందులో వచ్చే ప్రకటనలపై క్లిక్‌ చేస్తే పేటీఎం అకౌంట్లో నగదు జమ అవుందని నకిలీ ప్రకటన ఇచ్చింది. 

తరువాత అసలు విషయం తెలుసుకొన్న పలువురు యూజర్లు గూగుల్ ప్లేస్టోర్‌ కామెంట్‌ బాక్స్‌లో ఫిర్యాదు చేశారు. తమ అకౌంట్లో ఎలాంటి నగదు జమ కాలేదని, సర్వర్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఆ ప్రక్రియ ఆలస్యమైందని తరచూ యాప్‌ నుంచి సమాచారం వస్తోందని అందులో పేర్కొన్నారు. 

త్వరలోనే మీ అకౌంట్లలో డబ్బులో పడతాయని యాప్‌ నుంచి హిందీ భాషలో నోటిఫికేషన్లు వచ్చినట్లు మరికొందరు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని గూగుల్‌ జరిపిన పరిశోధనలో నకిలీ యాప్‌ల విషయం బయటపడటంతో వాటిని తొలగించింది. 

ఈ యాప్‌లలో ప్రమాదకర మాల్వేర్‌ కూడా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. తొలగించిన యాప్‌లలో వర్చువల్‌ డేటా యాప్‌ను 10వేల మంది, బైక్‌ ఇన్స్యూరెన్స్‌ అడ్వైజర్‌, హెల్త్‌ కవర్‌, చిట్‌ఫండ్స్‌ వంటి ఒక్కో యాప్‌ను 5వేల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకొన్నారని తెలిసింది.

click me!