జియోలో వాటా కొనుగోలుకు ఫేస్‌బుక్‌: విలువైన సంస్థగా రిలయన్స్

By narsimha lodeFirst Published Mar 26, 2020, 11:02 AM IST
Highlights

అనతికాలంలో దేశీయ టెలికం రంగంలో అగ్రగామి సంస్థగా అవతరించిన రిలయన్స్‌ జియోలో పది శాతం వాటా కొనుగోలు చేయడానికి సోషల్ మీడియా వేదికల్లో దిగ్గజ సంస్థ ఫేస్‌బుక్‌ ఆసక్తి చూపుతున్నది. 

న్యూఢిల్లీ: అనతికాలంలో దేశీయ టెలికం రంగంలో అగ్రగామి సంస్థగా అవతరించిన రిలయన్స్‌ జియోలో పది శాతం వాటా కొనుగోలు చేయడానికి సోషల్ మీడియా వేదికల్లో దిగ్గజ సంస్థ ఫేస్‌బుక్‌ ఆసక్తి చూపుతున్నది. 

అప్పులేని సంస్థగా జియో నిలుస్తుందా?
ఈ నెల చివరినాటికి జియోను  అప్పులు లేని సంస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్న ముకేశ్ అంబానీ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు రిలయన్స్ జియోతో ఫేస్ బుక్ ఒప్పందం దోహద పడనున్నది. 

రూ.42 వేల కోట్ల పెట్టుబడులకు ఫేస్ బుక్ రెడీ
ఓ ఆంగ్ల దినపత్రిక వెల్లడించిన సమాచారం మేరకు 60 బిలియన్‌ డాలర్ల (రూ.4.20 లక్షల కోట్లు) విలువైన జియోలో పది శాతానికి సమానమైన వాటా కొనుగోలు చేయడానికి ఫేస్‌బుక్‌ ఆనే బిలియన్‌ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నది. 

రిలయన్స్, ఫేస్ బుక్ మధ్య ఒప్పందంపై కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్
ఈ ఒప్పందంపై రిలయన్స్‌ జియో, అటు ఫేస్‌బుక్‌ వర్గాలు మాత్రం స్పందించడానికి నిరాకరించాయి. రెండు సంస్థల మధ్య అవగాహనా ఒప్పందంపై ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ప్రభావం చూపవచ్చునని సదరు పత్రిక వార్తాకథనం పేర్కొంది.

డిజిటల్ యాప్‌లతో ఓ కొత్త సంస్థ
అన్ని డిజిటల్ కార్యక్రమాలు, యాప్‌లతో ఒక కొత్త అనుబంధ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు గతేడాది రిలయన్స్ ప్రకటించింది. అదే సమయంలో సదరు కొత్త కంపెనీలోకి రూ.1.08 లక్షల కోట్ల పెట్టుబడులు జొప్పించనున్నట్లు తెలిపింది. 

జియో యాప్‌లన్నీ ఇక ఒక సంస్థలోకి
జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్ వంటి జియో యాప్‌లను ఈ కొత్త సంస్థ పరిధిలోకి తేవాలని రిలయన్స్ యాజమాన్యం భావిస్తోంది. తద్వారా ఒక సరళమైన సంస్థ ఏర్పాటు చేయడం ద్వారా వ్యూహాత్మక పెట్టుబడులను ఆకర్షించాలన్న లక్ష్యంతో రిలయన్స్ ఓ అడుగు ముందుకు వేసింది.

రిలయన్స్ ఖాతాలోకి జియో రుణాలు
ఈ నెల 18వ తేదీన రిలయన్స్ జియోకు చెందిన కొన్ని రుణాలను రిలయన్స్ తన ఖాతాలోకి మళ్లించింది. అయితే, ఆ లావాదేవీల వివరాలు గానీ, జియోకు రుణాలిచ్చిన పేర్లను గానీ వెల్లడించలేదు. 

మళ్లీ విలువైన సంస్థగా రిలయన్స్‌
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పాతాళానికి పడిపోవడంతో భారీగా నష్టపోయిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మళ్లీ తేరుకున్నది. బుధవారం కంపెనీ షేర్ ధర అమాంతం పెరుగడంతో టీసీఎస్‌ను దాటేసి అత్యంత విలువైన సంస్థగా మళ్లీ అవతరించింది. 

బీఎస్ఈలో 14.65 శాతం పెరుగుదల
స్టాక్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి షేర్ 14.65 శాతం పెరిగి రూ.1,081.25 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 22.25 శాతం లాభపడ్డ రిలయన్స్ షేర్ చివరకు లాభాలు నిలుపుకోలేకపోయింది. 

నిఫ్టీలో 13.82 శాతం ఎగసిన రిలయన్స్
అటు ఎన్‌ఎస్‌ఈలోనూ రిలయన్స్ కంపెనీ షేర్  13. 82 శాతం ఎగబాకి రూ.1,074 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 87,576.98 కోట్లు పెరిగి రూ.6,85,433.30 కోట్లకు చేరుకున్నది. 

click me!