‘ఫెమా’ ఉల్లంఘన: క్యూ-సిటీ టెక్ పార్క్ జప్తు

By rajesh yFirst Published Aug 1, 2019, 11:23 AM IST
Highlights


నిధుల మళ్లింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మ్యాక్ సాఫ్ట్ టెక్ సంస్థకు అనుబంధంగా హైదరాబాద్‌లో సేవలందిస్తున్న ‘క్యూ సిటీ టెక్ పార్క్’ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి విదేశాలకు నిధులు మళ్లించినట్లు మ్యాక్ సాఫ్ట్ టెక్ ఆరోపణలు ఎదుర్కొంటున్నది.

హైదరాబాద్: క్యూ-సిటీ టెక్ పార్క్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోగల నానక్‌రామ్‌గూడలో గల రూ.86 కోట్లకుపైగా విలువైన ఈ పార్క్‌ను విదేశీ మారక ద్రవ్యం నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు సీజ్ చేశారు. ఈ పార్క్ మ్యాక్ సాఫ్ట్ టెక్ ప్రైవేట్ (ఎంఎస్‌టీపీ) లిమిటెడ్‌కు చెందింది.

2,500లకు పైగా చదరపు గజాల్లో 2.45 లక్షల చదరపు అడుగుల్లో ఈ టెక్ పార్క్‌ను నిర్మించారు. కాగా, విదేశాల్లో అక్రమాస్తులు కూడబెట్టిందన్న ఆరోపణలను ఎంఎస్‌టీపీ లిమిటెడ్ ఎదుర్కొంటున్నది. సాఫ్ట్‌వేర్ లైసెన్స్‌ల కొనుగోలు, లీగల్ సర్వీసుల పేరిట భారత్ నుంచి పెద్ద మొత్తంలో నిధులను పలు దేశాలకు తరలించిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై నమోదైన కేసును ఈడీ దర్యాప్తు చేస్తున్నది. 

క్యూ-సిటీ టెక్ పార్క్‌ను సీజ్ చేసినట్లు బుధవారం ఈడీ అధికార వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం లేని, నకిలీ సాఫ్ట్‌వేర్ లైసెన్సుల కొనుగోలు పేరిట హాంకాంగ్‌కు చెందిన ఓరియంట్ గైడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్‌కు 1.25 కోట్ల డాలర్లు (రూ.62.08 కోట్లు) అక్రమంగా బదిలీ చేసింది. 

అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు చెందిన సెనట్ లీగల్ కన్సల్టెన్సీ ఎఫ్‌జెడ్ ఎల్‌ఎల్‌సీ, క్రెస్కో లీగల్ కన్సల్టెన్సీ ఎఫ్‌జెడ్ ఎల్‌ఎల్‌సీలకూ 2011 నవంబర్ నుంచి 2016 డిసెంబర్ మధ్య 39.80 లక్షల డాలర్ల (రూ.24.30 కోట్లు)ను పంపిందని ఈడీ చెబుతున్నది. దీనిపై ఫెమాలోని సెక్షన్ 37 కింద కేసు నమోదు చేసిన ఈడీ.. తాజాగా క్యూ-సిటీ టెక్‌పార్క్‌ను జప్తు చేసింది.
 

click me!