ఐదేళ్లలో ‘డిజిటల్‌’దే పెత్తనం.. టీవీ కూడా దిగదుడుపే

By rajesh yFirst Published Aug 21, 2019, 11:32 AM IST
Highlights

మున్ముందు డిజిటల్ మీడియా విస్త్రుత స్థాయిలో విస్తరించడంతోపాటు వాణిజ్య ప్రకటనల్లో టీవీ మీడియాను కూడా అధిగమిస్తుంది 2019-20లో మీడియా ఆదాయ వృద్ధి 12 శాతం అని నివేదించిన కేపీఎంజీ.. 2024 నాటికి డిజిటల్ మీడియా 39 శాతం పురోగతి సాధిస్తుందని వివరించింది.  

ముంబై: ప్రసార మాధ్యమాల్లో డిజిటల్‌ వాటా శరవేగంగా వృద్ధి చెందుతోంది. 2024కు ఇతర మాధ్యమాల కంటే అగ్రశ్రేణి వ్యవస్థగా డిజిటల్‌ మార్కెట్ అవతరిస్తుందని, 39.5 శాతం వాటా పొందుతుందని కేపీఎంజీ అంచనా వేస్తోంది. డిజిటల్‌ వినియోగదార్లలో వృద్ధి, ప్రాంతీయ భాషల్లో పెరుగుతున్న డిమాండ్ వల్ల మీడియా, వినోద పరిశ్రమ 2018-19లో 13 శాతం వృద్ధితో రూ.1,63,100 కోట్లకు చేరిందని కేపీఎంజీ నివేదిక తెలిపింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ రంగం పురోగతి 12 శాతం వృద్ధితో రూ.1.88 లక్షల కోట్లకు పరిమితం అవుతుందని కేపీఎంజీ అంచనా వేసింది.. ట్రాయ్‌ కొత్త టారిఫ్‌ల అనిశ్చితి, ఆర్థిక మందగమనం ప్రభావం లేకుంటే పరిశ్రమ మరో 1-2 శాతం అధికంగా వృద్ధి చెందే అవకాశం ఉన్నదని పేర్కొంది. 

‘ఏప్రిల్‌- మేలో సార్వత్రిక ఎన్నికలు, క్రికెట్‌ ప్రపంచకప్‌ కారణంగా ప్రకటన వ్యయాల రూపేణా పరిశ్రమకు బాగానే ఆదాయం వచ్చింది. ఆ ఆదాయం కూడా రాకుంటే ఈ ఏడాది పరిశ్రమ వృద్ధి 12 శాతం కంటే కూడా తక్కువగానే ఉండేద’ని కేపీఎంజీ నివేదిక వివరించింది. 

కొత్త టారిఫ్‌ ఆదేశాల అమలులో జాప్యం వల్ల గత ఆర్థిక సంవత్సరంలో 2018-19లో టీవీ విభాగ ఆదాయంపై ప్రభావం చూపిందని కేపీఎంజీ నివేదించింది. అయితే గతేడాది టీవీ విభాగ ఆదాయం 9.5 శాతం వృద్ధితో రూ.71,400 కోట్లుగా నమోదైందని పేర్కొంది. 
 
ట్రాయ్‌ కొత్త టారిఫ్‌ల నేపథ్యంలో నికరంగా టీవీ చానెళ్ల వినియోగదారుల సంఖ్య ఎంత ఉండొచ్చన్న లెక్క తేలేవరకు మార్కెటర్లు ఆగడం వల్ల, టీవీ ప్రకటనల వ్యయం స్తబ్దుగా నమోదవుతోందని కేపీఎంజీ పేర్కొంది. టీవీ కేబుల్‌ బిల్లులు పెరగడంతో వినియోగదారు ద్వారా సగటు ఆదాయం రూ.150 నుంచి రూ.200కి పెరిగితే.. ఇదే టీవీ పరిశ్రమ 2024 నాటికి రూ.1,21,500 కోట్ల స్థాయికి చేరనుంది.

ఇదిలా ఉంటే టీవీ హవాను తగ్గిస్తున్న డిజిటల్‌ విభాగం 2022 నాటికి 20 శాతం వాటాతో మీడియా, వినోద పరిశ్రమలో రెండో అతిపెద్ద విభాగంగా అవతరించనుంది. వాణిజ్య ప్రకటనల వ్యయాల ఆదాయంలోనూ వాటాను గణనీయంగా పెంచుకోనున్నది. 2023-24 కల్లా ప్రకటనల వ్యయాల వాటాలో 39.5 శాతం వాటాతో టీవీ విభాగాన్ని అధిగమించి డిజిటల్ మీడియా ముందు వరుసలో నిలుస్తుందని కేపీఎంజీ నివేదిక పేర్కొంది. 

ప్రస్తుతం రెండో అతిపెద్ద విభాగంగా ఉన్న ముద్రణా మాధ్యమంలో ఆంగ్ల పత్రికల సర్క్యులేషన్‌ తగ్గుతున్నా, ప్రాంతీయ భాషల్లో పెరుగుతోంది. 2018-19లో ఈ విభాగం 4.5 శాతం వృద్ధితో రూ.33,320 కోట్లకు చేరితే.. 2023-24 కల్లా 4.2 శాతం వార్షిక వృద్ధితో ఈ రంగం రూ.40,850 కోట్లకు చేరుతుందని కేపీఎంజీ అంచనా వేసింది. 

2023-24 నాటికి మీడియా, వినోద పరిశ్రమ 13.5 శాతం వార్షిక వృద్ధితో రూ.3.07 లక్షల కోట్లకు చేరొచ్చని కేపీఎంజీ నివేదిక పేర్కొంది. కొత్త డిజిటల్‌ వ్యాపార విధానాలను అందిపుచ్చుకునేందుకు పరిశ్రమ అధిక ప్రాధాన్యం ఇస్తుండటం, ప్రాంతీయంగా వృద్ధి అవకాశాలు పుష్కలంగా ఉండటం, నియంత్రణపరమైన సానుకూలతలు ఎదుగుదలకు దోహదపడతాయని పేర్కొంది.
 

click me!