ఐటీ విద్యార్థులకు 2020 మంచి శుభవార్తలను మోసుకొస్తున్నది. కాలేజ్ క్యాంపస్‌ల ద్వారా క్యాప్ జెమినీ నియమించుకోనుంది. ఇంతకుముందు కాగ్నిజెంట్ 20 వేల మంది ఫ్రెషర్ విద్యార్థులను నియమించుకోనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ : ఐటీ విద్యార్థులకు 2020 మంచి శుభవార్తలను మోసుకొస్తున్నది. విద్యార్థుల్లో డిజిటల్, టెక్నాలజీ రంగాల్లో నైపుణ్యం పెంచుకోవడంతో వారికి ఉద్యోగ నియామక అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఫ్రాన్స్ ఐటీ దిగ్గజం క్యాప్ జెమినీ ఈ ఏడాది 12 నుంచి 15వేల మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
వీరిని కాలేజ్ క్యాంపస్‌ల ద్వారా క్యాప్ జెమినీ నియమించుకోనుంది. ఇంతకుముందు కాగ్నిజెంట్ 20 వేల మంది ఫ్రెషర్ విద్యార్థులను నియమించుకోనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
క్యాప్ జెమినీ వీరికి సగటు వార్షిక వేతనం రూ. 3.8 లక్షలు ఆఫర్ చేస్తోంది. ఐఐటీ, ఎన్‌ఐటీ స్టూడెంట్లకు ఈ ప్యాకేజీ రూ. 6.5 లక్షల వరకు ఉంటుంది. ప్రస్తుతం క్యాప్‌జెమిని భారత్ శాఖలలో 1.2 లక్షల మంది పనిచేస్తున్నారు. క్యాప్ జెమినీకి ఉన్న మొత్తం ఉద్యోగులలో సగం మంది భారతదేశంలోనే పనిచేస్తుండడం విశేషం. గత ఏడాది కూడా క్యాప్‌జెమిని ఇంతే మొత్తంలో ఫ్రెషర్లను క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా నియమించుకుంది.
తమ సంస్థ 5జీ టెక్నాలజీపై పోకస్ పెట్టిందని క్యాప్‌జెమిని ఇండియా సీఈఓ అశ్విన్ యార్డీ అన్నారు. దీని కోసం ముంబై, పారిస్‌లో రెండు ల్యాబ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. కంపెనీ 5జీ, కమ్యునికేషన్ బిజినెస్‌ను నడిపించడానికి ఎయిర్‌టెల్ వైస్ ప్రెసిడెంట్ మోనికా గుప్తాను కంపెనీ ఉపాధ్యక్షుడిగా నియమించుకుంది.
మొత్తంగా ఇండియాలో క్యాప్ జెమినీ కంపెనీకి 200 మంది వైస్ ప్రెసిడెంట్లు, 26 మంది గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కమిటీ(జీఈసీ)లు ఉన్నాయి. ఈ కంపెనీతోపాటు అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కూడా ఈ ఏడాది 20 వేల మంది విద్యార్ధులను కాలేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా నియమించుకోవాలని ప్లాన్స్ వేస్తోంది. వీరి కోసం వార్షికంగా సగటున రూ. 4,00,000 వేతన ప్యాకేజిని అందిస్తోంది.
ఐటీ గ్రాడ్యుయేట్లకు కాగ్నిజెంట్ ఆఫర్లు
ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్స్ సొల్యూషన్స్ సంస్థ దేశంలోని ఐటీ గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది కొత్తగా 20 వేల మంది ఐటీ గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్లు తెలిపింది. 2020లో ఇంజనీరింగ్, సైన్స్ గ్రాడ్యుయేట్ల నియమకాలను 30శాతం పెంచాలని నిర్ణయించినట్లు కాగ్నిజెంట్ సీఈఓ బ్రియాన్ హాంఫ్రెస్ వెల్లడించారు. భారతదేశంలోని యూనివర్సిటీ క్యాంపస్‌లలో 20 వేల మంది ఐటీ విద్యార్థులను నియమించుకున్నట్లు తెలిపారు. భారతదేశంలో వ్రుద్ధి అధికం, కాగ్నిజెంట్‌కు ఆకర్షణీయ మార్కెట్ అని హైప్రెస్ చెప్పారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల క్యాంపస్ వేతనాలను 18 శాతం పెంచి ఏడాది రూ.4 లక్షల మేరకు చెల్లించనున్నట్లు తెలిపింది.
దేశవ్యాప్తంగా మొత్తం 100 ప్రీమియర్ ఇంజినీరింగ్ క్యాంపస్‌ల్లో కాగ్నిజెంట్ ఆఫర్లకు 80 శాతం ఆమోదం ఉంది. దీంతో నియామకాలపై సంస్థకు విశ్వాసం పెరిగింది. ఇటీవలి కాలంలో ఈ నియామకాలే అత్యధికం అని బ్రియాన్ హంప్రైస్ తెలిపారు.
స్థానిక యువత నైపుణ్యం, సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నదే తమ ఆలోచన అని కాగ్నిజెంట్ తెలిపింది. యువత, వారి భవిష్యత్ పటిష్టానికి వేగంగా ‘ఆలోచించి, వేగంగా ఆచరించు’ అనే అంశాలపై కేంద్రీకరించాలని తెలిపింది.
Also read:ఫ్లిఫ్‌కార్డ్ బంపర్ ఆఫర్స్: ‘మొబైల్స్ పై బొనంజా’
’మా డిజిటల్ పరిష్కారాలతో భారత విపణిలో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాం. ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, రిటైల్, లైఫ్ సైన్సెస్, ఉత్పాదకత, విద్యారంగాలకు విస్తరించాం. అన్ని రంగాల వారీగా భారతదేశంలో మా సంస్థకు 80 క్లయింట్ సంస్థలు ఉన్నారు’ అని పేర్కొంది.
గతేడాది అత్యధికంగా ఉద్యోగ నియామకాలు చేపట్టిన ఐటీ సంస్థల్లో కాగ్నిజెంట్ రెండవ స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నిలిచింది. ఈ నెల తొలి వారంలో కాగ్నిజెంట్ విస్తరణ దిశగా మరో అడుగు ముందుకేసింది. ఎక్స్ టెన్షన్ ఆఫీసులో 1100 మంది పని చేయొచ్చు. దీంతోపాటు బెంగళూరు, మైసూర్ నగరాల్లో 29 వేల మంది పని చేస్తున్నారు. ఈ కంపెనీలో అత్యధిక ఉద్యోగులు చెన్నై కేంద్రంగా పని చేస్తున్నారు.
ఇదిలా ఉండగా 2019లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ రెండు లక్షల మందిని నియమించుకున్నది. దీంతో ఐటీ రంగంలో 4.4 లక్షల మంది ఉద్యగులను కలిగి ఉన్న అతిపెద్ద సంస్థగా టీసీఎస్ నిలిచింది.
అనూహ్యంగా కాగ్నిజెంట్ గతేడాది సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో ప్రపంచ వ్యాప్తంగా 10-12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సంస్థ తన వ్యయ భారాన్ని తగ్గించుకోవడానికి వ్యవస్థాగత నిర్మాణాల్లో మార్పులు తీసుకు రానున్నామని కాగ్నిజెంట్ పేర్కొంది.