ఐగేట్ అనుసంధానంలో కీలకం: క్యాప్‌జెమినీ ఇండియా చైర్మన్‌ కందుల

By rajesh yFirst Published Dec 19, 2018, 11:37 AM IST
Highlights

తెలుగు వాడు ఫ్రాన్స్ ఐటీ దిగ్గజం కాప్ జెమినీ సంస్థ భారత్ విభాగం అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2007లో ఐగేట్‌లో చేరిన కందుల శ్రీనివాస్.. తర్వాత దాన్ని టేకోవర్ చేసిన కాప్ జెమినీ సంస్థతో ఐగేట్ అనుసంధానంలో కీలక పాత్ర పోషించారు. 

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌ ఐటీ దిగ్గజం క్యాప్‌జెమినీ ఇండియా విభాగం చైర్మన్‌గా తెలుగు వ్యక్తి శ్రీనివాస్‌ కందుల యమితులయ్యారు. అశ్విన్‌ యార్ది కొత్త సీఈఓగా బాధ్యతలు చేపడుతున్నట్లు క్యాప్‌జెమినీ ఇండియా ప్రకటించింది. వీరిద్దరూ క్యాప్‌జెమినీ గ్రూప్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీఓఓ) థియరీ డెలాపోర్ట్‌కు రిపోర్ట్‌ చేస్తారని ఒక ప్రకటనలో సంస్థ పేర్కొంది. శ్రీనివాస్‌ కందుల ఇప్పటివరకు క్యాప్‌జెమినీ ఇండియాకు సీఈఓగా, గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా, యార్ది సీఓఓగా ఉన్నారు.

సంస్థ బ్రాండ్‌ విలువను పెంచడంతోపాటు కీలక వాటాదారులతో సంబంధాలు మరింత మెరుగుపర్చేందుకు కొత్త చైర్మన్‌ శ్రీనివాస్ కందుల కృషి చేయనున్నట్లు క్యాప్‌జెమినీ ఇండియా తెలిపింది. సాంకేతిక నిపుణులను ఆకర్షించడం గ్రూపు ప్రాధాన్యాల్లో ఒకటని, మానవ వనరుల విభాగంలో అపార అనుభవం కలిగిన శ్రీనివా్‌సకు ఈ బాధ్యతలను సైతం అప్పగించినట్లు సంస్థ పేర్కొంది.

శ్రీనివాస్‌ కందుల చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడంతో ఆయన స్థానంలో సీఈఓగా నియమితులైన యార్దికి గ్రూపు ఎగ్జిక్యూటివ్‌ కమిటీలోనూ స్థానం లభించింది. 2001లో క్యాప్‌జెమినీలో చేరిన యార్ది 2016 జనవరి నుంచి ఇప్పటివరకు సీఓఓగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం క్యాప్‌జెమినీ గ్రూపులో లక్ష మంది ఉద్యోగులు ఉండగా.. అందులో సగం మంది భారత్‌లోనే పనిచేస్తున్నారు. దేశంలోని 12 నగరాల్లో సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది.

ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ జెంషెడ్‌పూర్‌ నుంచి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో డాక్టరేట్‌ పొందిన శ్రీనివాస్‌ కందుల 2016 జనవరి నుంచి క్యాప్‌జెమినీ ఇండియా సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

అంతక్రితం శ్రీనివాస్ కందుల ఐగేట్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, సాస్కెన్‌ కమ్యూనికేషన్స్‌ టెక్నాలజీస్‌లో పని చేశారు. 2007లో కందుల ఐగేట్‌లో చేరారు. ఆయన హయాంలోనే ఐగేట్‌ సంస్థ పట్నీ కంప్యూటర్స్‌ను కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఐగేట్‌ను క్యాప్‌జెమినీ టేకోవర్‌ చేసింది. పట్నీ వ్యాపారాన్ని ఐగేట్‌తో, క్యాప్‌జెమినీతో ఐగేట్‌ను అనుసంధానించడంలో కందుల కీలకపాత్ర పోషించారు.
 

click me!