‘జియో’కు సర్కార్ వత్తాసేంటి? బీఎస్ఎస్ఎల్ స్టాఫ్ ఫైర్

By sivanagaprasad kodatiFirst Published Nov 30, 2018, 9:04 AM IST
Highlights

టెలికం రంగంలో రిలయన్స్ జియోకు పోటీ లేకుండా చేయడమే లక్ష్యంగా నరేంద్రమోదీ సర్కార్ వ్యవహరిస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి. చివరకు ప్రభుత్వ రంగ సంస్థ ‘బీఎస్ఎన్ఎల్’కు అసలు 4జీ కేటాయింపులే చేయలేదంటే ప్రై‘వేట్’ పట్ల పాలకులకు గల ప్రేమ ఎంత ఉందో అవగతమవుతోంది. దీన్ని బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు నిరసిస్తున్నారు. మూడో తేదీ నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు.

ముఖేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో సంస్థకు అనుకూలంగా కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ చర్యలు తీసుకోవడంతోపాటు అన్ని విధాల బాసటగా నిలవడంపై ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) ఉద్యోగులు మండి పడుతున్నారు.

దీనివల్ల దేశ టెలికం సంస్థలు.. ప్రత్యేకించి తమ సంస్థకు భారీగా నష్టాలు వాటిల్లుతున్నాయని చెబుతున్నారు. జియోకు ప్రభుత్వ మద్దతు, ఇతర అపరిష్కృతంగా ఉన్న తమ డిమాండ్ల సాధన కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీసర్‌ అసోసియేషన్లు, ఉద్యోగుల సంఘాల సమాఖ్య ‘ఏయూఏబీ’ నాయకత్వంలో డిసెంబర్ 3 నుంచి తాము నిరవధిక సమ్మెను చేపట్టనున్నట్లు ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి.

దీనికి తోడు కేంద్రంలోని మోడీ సర్కారు రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీకి చెందిన టెలికాం సంస్థ 'రిలయన్స్‌ జియో' మార్కెట్లో విస్తరించేలా వ్యవహరిస్తున్న సానుకూల తీరుపై బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు మండి పడ్డారు.

ప్రభుత్వ సానుకూల వైఖరే తమ సంస్థ నష్టాలకు కారణమని వారు ఆరోపించారు. ముఖ్యంగా జియోకు ప్రధాన పోటీని నివారించే ఉద్దేశంతోనే ప్రభుత్వం త్వరగా 4జీ స్పెక్ట్రమ్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌కు కేటాయించలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి.

మరోవైపు 4జీ స్పెక్ట్రమ్‌ దక్కించుకునేందుకు ముఖేశ్‌ అంబానీ రిలయన్స్‌ జియో.. భారీ పెట్టుబడులు పెట్టి.. అతితక్కువ ధరకు సర్వీసులు అందజేస్తోందని, దీనివల్ల అనిల్‌ అంబానీ ఆర్‌కాంతో పాటు ఐడియా, ఎయిర్‌ సెల్‌ వంటి పెద్ద ప్రైవేట్‌ సంస్థలే కాక ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ తీవ్రనష్టాల్లో కూరుకుపోతున్నదని వారు ఆరోపించారు.

ప్రత్యర్థి కంపెనీలను నష్టపరిచే దురుద్దేశంతోనే జియో టారిఫ్‌ ఎత్తుగడలు వేస్తోందనీ, ఒకసారి మార్కెట్‌లో పోటీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన అనంతరం జియో కస్టమర్లను భారీగా దోపీడీ చేయనుందని బీఎస్‌ఎన్‌ఎల్‌ సిబ్బంది తెలిపారు. 

జియోకు వ్యతిరేకంగా వ్యవహరించిన బీఎస్ఎన్ఎల్ అధికారులపై వేటుపడిందని దుయ్యబట్టాయి. ముఖ్యంగా మాజీ టెలికాం సెక్రటరీ జేఎస్‌ దీపక్‌ లాంటి వారు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ప్రభుత్వ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ సహా,ఇతర ప్రధాన పోటీదారుల నష్టాలకు కారణమైన జియోకు నరేంద్ర మోదీ సర్కార్‌ బహిరంగంగా మద్దతు తీవ్ర ఆందోళనక లిగించే అంశమని ప్రకటించారు. పెన్షన్‌ కాంట్రిబ్యూషన్‌ పేరుతో కేంద్రం తమను దోచుకుంటోందని, తద్వారా మోదీ ప్రభుత్వం తమ స్వంత నియమాలను ఉల్లంఘించడం దారుణమని ఆరోపించాయి.
 

click me!