రోజురోజుకు రిలయన్స్ జియో ప్రస్థానం ముందుకే పడుతున్నది. గత నెలలో సబ్ స్క్రైబర్ల వాటా 0.2 శాతం పెంచుకున్నది. దేశవ్యాప్తంగా మొబైల్ సబ్ స్ర్కైబర్లు 0.21 శాతం పెరిగి 116.92 కోట్లకు చేరుకున్నారు.
రెండేళ్ల క్రితం టెలికం రంగంలో అరంగ్రేటం చేసిన రిలయన్స్ జియో క్రమంగా తన సబ్ స్క్రైబర్ పునాదిని రోజురోజుకు పెంచుకుంటున్నది. గత సెప్టెంబర్ నెలలో జియో కస్టమర్లు 0.2 శాతం పెరిగి మొత్తం 119.1 కోట్లకు చేరారని ట్రాయ్ తెలిపింది.
ఆగస్టులో రిలయన్స్ జియో సబ్ స్క్రైబర్లు 1,189.09 మిలియన్లుగా ఉంటే, సెప్టెంబర్ నాటికి 1,191.40 మిలియన్లకు చేరారు. మొబైల్ లేదా వైర్ లైస్ సబ్ స్క్రైబర్ల పునాది దేశవ్యాప్తంగా 0.21 శాతం పెరిగి 116.69 కోట్ల నుంచి 116.92 కోట్లకు చేరుకున్నది.
undefined
ఒకవైపు రిలయన్స్ జియో తన కస్టమర్ల సంఖ్య పెంచుకుంటుండగా, మిగతా సంస్థల వినియోగదారులు తగ్గిపోతున్నారు. మొత్తం 25.2 కోట్ల మంది కస్టమర్లలో ముఖేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో 1.3 కోట్ల సబ్ స్క్రైబర్లను కలిగి ఉన్నది.
ప్రస్తుతం దేశంలోకెల్లా అతిపెద్ద టెలికం సంస్థగా ఆవిర్భవించిన వొడాఫోన్ ఐడియా సెప్టెంబర్ నెలలో 80 లక్షల మందికి పైగా సబ్ స్క్రైబర్లను కోల్పోయింది. సెప్టెంబర్ నెలలో వొడాఫోన్, ఐడియా సెల్యూలార్ గణాంకాలను వేర్వేరుగా ప్రకటించాయి.
ఇక భారతీ ఎయిర్ టెల్ 23 లక్షల మంది, టాటా టెలీ సర్వీసెస్ 10 లక్షలు, బీఎస్ఎన్ఎల్ 5.36 లక్షలు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 16,349 మంది ఎంటీఎన్ఎల్ 9,435 మంది కస్టమర్లను కోల్పోయాయి. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ విభాగంలో 71,800 మంది కస్టమర్లను కోల్పోగా, ఫిక్స్డ్‌డ్ లైన్ విభాగంలో భారతీ ఎయిర్ టెల్ 16,929, వొడాఫోన్ 7080 నూతన కనెక్షన్లు పొందాయి.
ఇక బ్రాడ్ బ్యాండ్ సబ్ స్క్రైబర్ల బేస్ 3.89 శాతం పెరిగి 48.1 కోట్ల మందికి చేరుకున్నది. సెప్టెంబర్ నెలాఖరు నాటికి ‘టాప్ 5 సర్వీస్ ప్రొవైడర్లు మార్కెట్లో 97.86 శాతం వాటా కలిగి ఉన్నారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ 252.25 మిలియన్లు, భారతీ ఎయిర్ టెల్ 99.29 మిలియన్లు, వొడాఫోన్ 51.82 మిలియన్లు, ఐడియా సెల్యూలార్ 47.90 మిలియన్లు, బీఎస్ఎన్ఎల్ 20.12 మిలియన్ల కస్టమర్లను కలిగి ఉన్నారు’ అని ట్రాయ్ తెలిపింది.
రిలయన్స్ చేతికి ‘న్యూజ్’ మీడియా
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) మీడియా రంగంలో పట్టు బిగిస్తోంది. ఇప్పటికే కొన్ని టీవీ చానళ్లను నిర్వహిస్తున్న రిలయన్స్.. కొత్తగా న్యూ ఎమర్జింగ్ వరల్డ్ ఆఫ్ జర్నలిజం (న్యూజ్) అనే మీడియా స్టార్టప్ కంపెనీలో మెజారిటీ వాటా కొనుగోలు చేసింది.
అనుబంధ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వె్‌స్టమెంట్స్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఆర్‌ఐఐహెచ్‌ఎల్) కంపెనీ ద్వారా న్యూజ్ ఈక్విటీలో 30,000 షేర్లతో పాటు 125 కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్లను రూ.1.03 కోట్లకు కొనుగోలు చేసింది.
దీంతో న్యూజ్ కంపెనీలో మెజారిటీ వాటా రిలయన్స్ చేతికి వచ్చి ఆర్‌ఐఐహెచ్‌ఎల్ అనుబంధ కంపెనీగా మారింది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అవసరమైన వీడియో కంటెంట్ తయారీకి న్యూజ్ మౌలిక సదుపాయాలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ఇటీవల డిజిటల్, సోషల్ మీడియాలో వీడియోకు పెరుగుతున్న ప్రాధ్యాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని రిలయన్స్ ఈ నిర్ణయం తీసుకుంది.