టెక్ దిగ్గజం యాపిల్ తన ఆర్థిక అంచనాలను తగ్గించి వేసింది. ఐఫోన్ విక్రయాలు అంచనాల మేరకు అమ్ముడు కాకపోవడం.. దానికి పలు కారణాలు ఉన్నాయి. అధిక ధరల్లో ఒకటి. దీంతో ఆత్మావలోకనం చేసుకున్న యాపిల్.. మళ్లీ మార్కెట్లో తన పట్టును కొనసాగించాలని అభిలషిస్తోంది. అందులో భాగంగా ఈ- కామర్స్ సంస్థ అమెజాన్ ద్వారా భారీగా ‘యాపిల్ ఫెస్ట్’ పేరిట భారీగా ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది.
న్యూఢిల్లీ: ‘యాపిల్ ఫెస్ట్’ పేరుతో అమెజాన్ ఇండియా మరోమారు ఆఫర్లతో ముందుకు వచ్చింది. ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన ఈ సేల్ ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ ఫెస్ట్‌లో భాగంగా వివిధ ఐఫోన్ మోడల్స్, మ్యాక్ బుక్ డివైజ్‌లు, ఐప్యాడ్, యాపిల్ వాచ్ సిరీస్ 3 వంటివాటిపై భారీ రాయితీలు ఆఫర్ చేసింది.
దీంతోపాటు నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని కూడా ప్రకటించింది. మ్యాక్ బుక్ డివైజ్‌లపై రూ.15 వేలు, చివరకు యాపిల్ బీట్స్ ఇయర్ ఫోన్లపై రూ.4,000 రాయితీ ఇవ్వనున్నట్లు అమెజాన్ తెలిపింది.
యాపిల్ ఐ ఫోన్ల ధరలపై రూ.16 వేల వరకు తగ్గించి వినియోగదారులకు అందుబాటులోకి తేవడానికి అమెజాన్ ప్రయత్నిస్తోంది. యాపిల్ ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ (64 జీబీ) ధరను రూ.1,09,900 నుంచి రూ.1,04,900కు తగ్గించింది. 256 జీబీ/ 512 జీబీ వేరియంట్ ధరనూ భారీగా తగ్గించింది.
ఉదాహరణకు యాపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ మోడల్ ఫోన్‌పై అమెజాన్ రూ.6000 డిస్కౌంట్ అందజేస్తోంది. 64 జీబీ వేరియంట్ ఎక్స్ఆర్ మోడల్ ఫోన్ అసలు ధర రూ.76,900 కాగా, డిస్కౌంట్‌తో వినియోగదారులకు రూ.70,900లకు లభిస్తోంది.
128 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ.81,900 నుంచి రూ.75,900లకు మార్కెట్లో అందుబాటులో ఉన్నది. ఒకవేళ మీరు టాప్ వేరియంట్ 256 జీబీ సామర్థ్యం గల ఫోన్ కొనాలనుకుంటే యాపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ ధర కూడా రూ.91,900 నుంచి రూ.85,900లకు అందుబాటులోకి తెచ్చింది.
అలాగే, ఐఫోన్ ఎక్స్‌ను రూ.74,999కే అందుబాటులో ఉంచింది. 64 జీబీ సామర్థ్యం గల ఐఫోన్ ఎక్స్ మోడల్ ఫోన్ అసలు ధర రూ.91,900. ఇక 128 జీబీ సామర్థ్యం గల ఐఫోన్ ఎక్స్ మోడల్ ధర రూ.1,06,900 నుంచి రూ.87,999లకు వినియోగదారులకు లభ్యం కానున్నది.
వీటితోపాటు ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ 6ఎస్‌పైనా తగ్గింపు ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 8 ప్లస్ మోడల్‌లో 64 జీబీ వేరియంట్ ధరను రూ.69,900 నుంచి రూ.66,900లకు, 256 జీబీ వేరియంట్ ఫోన్ రూ.84,900 నుంచి రూ.79,900లకు తగ్గించి వేసింది.
ఇక ఎంపిక చేసిన మ్యాక్‌బుక్ నోట్‌బుక్స్‌పై రూ.15 వేల వరకు రాయితీ ప్రకటించింది. మ్యాక్‌బుక్ ఎయిర్‌పై రూ.9 వేల డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. 9.7 అంగుళాల యాపిల్ ఐప్యాడ్‌ను రూ.29,999, యాపిల్ వాచ్ సిరీస్ 3ను రూ.25,999కు అందుబాటులో ఉంచింది.
కొత్తగా విడుదల చేసిన 128 జీబీ వేరియంట్ మోడల్ 13 అంగుళాల మ్యాక్ బుక్ ఎయిర్ ధరను 1,14,900 నుంచి రూ.1,05,990లకు, 256 జీబీ వేరియంట్ అసలు ధర రూ.1,24,900 కాగా, రూ.1,14,900లకు అందుబాటులో ఉంటుంది.
ఇక యాపిల్ ‘ఐపాడ్ ప్రో’ను అమెజాన్ ద్వారా కొనాలనుకుంటున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్. వై-ఫై సౌకర్యంతోపాటు 64 జీబీ సామర్థ్యం గల 10.5 అంగుళాల ఐ పాడ్ ప్రో ధరను రూ.57,900 నుంచి రూ.47,752లకు, వై-ఫై ప్లస్ సెల్యూలార్ సౌకర్యంతోపాటు 256 జీబీ వేరియంట్ ఐపాడ్ ప్రో ధరను రూ.83,900 నుంచి రూ.74,100లకు తగ్గించి వినియోగదారులకు అమెజాన్ అందిస్తోంది.