టెలికం వినియోగదారులపై చార్జీల మోత..చౌక డేటా, కాల్స్‌ సేవలకు రాంరాం..

By Sandra Ashok Kumar  |  First Published Jun 9, 2020, 2:46 PM IST

ఇకపై భారతీయ టెలికం వినియోగదారులపై టెల్కోలో చార్జీల మోత మోగించనున్నాయి. చౌక డేటా, కాల్స్‌ సేవలకు చరమగీతం పాడి టెలికాం చార్జీలు పెంచనున్నాయి. ఆదాయం పెంపు ప్రయత్నాల్లో టెల్కోలు నిమగ్నమయ్యాయి. వచ్చే ఆరేళ్లలో మొబైల్‌ సేవల రాబడి రెట్టింపు కానున్నది జెఫ్రీస్‌ అనే అంతర్జాతీయ సంస్థ పేర్కొంది.
 


న్యూఢిల్లీ: దేశీయ టెలికాం రంగంలో మున్ముందు చార్జీలు మరింత పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. టారిఫ్‌ వార్‌కు అప్రకటిత ముగింపు పలికిన టెల్కోలు.. కస్టమర్లపై క్రమంగా చార్జీలు వడ్డించనున్నాయా?  అంటే పరిణామాలు అవుననే చెబుతున్నాయి. 

జెఫ్రీస్‌ అనే అంతర్జాతీయ సేవల సంస్థ తాజా నివేదిక సైతం ఇదే సంకేతాలిస్తోంది. భారత టెలికాం కంపెనీల ఆదాయం/ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆర్జన (ఏఆర్‌పీయూ) 2020-25 ఆర్థిక సంవత్సరాల్లో రెట్టింపు కావచ్చని రిపోర్టు అంచనా వేసింది.

Latest Videos

2024-25 నాటికి మొబైల్‌ సేవల ఆదాయం 3,800 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చునంటోంది జెఫ్రీన్. అంటే, మన కరెన్సీలో రూ.2.85 లక్షల కోట్లు అన్నమాట. ప్రస్తుతం దేశీయ టెలికాం రంగంలో కొనసాగుతున్న ఏకీకరణ ప్రక్రియ, చార్జీల పెంపుతో అత్యధికంగా లబ్ధి పొందనున్న కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ అని జెఫ్రీస్‌ పేర్కొంది.

ప్రస్తుతం భారత మొబైల్‌ సేవల ఆదాయం-జీడీపీ నిష్పత్తి 0.7 శాతంగా ఉంది. పలు వర్ధమాన దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువని జెఫ్రీన్ నివేదిక పేర్కొంది. కంపెనీలు ఇప్పుడు చార్జీల విషయంలో ఆర్థిక క్రమశిక్షణకు పెద్దపీట వేస్తుండటంతో రాబడి ఏటా 3-5% మేర వృద్ధి చెందే అవకాశం ఉందని జెఫ్రీస్‌ అంచనా వేసింది. 

టెలికాం కంపెనీల ధరల యుద్ధంలో ఎక్కువగా లాభపడింది వినియోగదారులే. రిలయన్స్‌ జియో రంగ ప్రవేశంతో మొబైల్‌ కాలింగ్‌, డేటా సేవలు అంత్యంత చౌకగా మారాయి. జియోకు పోటీగా ఇతర టెలికాం కంపెనీలూ చార్జీలను భారీగా తగ్గించాల్సి వచ్చింది. తత్ఫలితంగా టెలికాం రంగంపై ఆర్థికంగా ఒత్తిడి పెరిగి, విలీనాలకు దారితీసింది. ఇప్పుడిక పోటీ మూడు ప్రైవేట్‌ కంపెనీల మధ్యే

అయితే, సుప్రీంకోర్టు తీర్పుతో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాపై ఏజీఆర్‌ (సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం) బకాయిల బండ పడింది. దాంతో ఈ రెండు కంపెనీలపై ఆర్థిక ఒత్తిడి మరింత పెరిగింది. వ్యాపార మనుగడ కోసం ఆదాయం పెంచుకోవడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. 

also read ట్రెండ్ మారింది.. కరోనా కంటే ‘లాక్‌డౌన్ 4.0’పైనే సెర్చింగ్..

మరోవైపేమో, రిలయన్స్‌ జియో ఇంతింతై వటుడింతై అన్నట్లు సేవలు ప్రారంభించిన మూడేళ్లలోనే నంబర్ వన్ టెలికాం కంపెనీగా ఎదిగింది. ఈ ఏడాది జనవరి నాటికి కంపెనీ మార్కెట్‌ వాటా 32 శాతానికి పైగా పెరిగింది.

కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీకిక కారు చౌక సేవల అవసరం లేకుండా పోయింది. ఈ పరిణామం టెలికాం రంగంలో ధరల యుద్ధానికి తెరదించిందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. కదన రంగం వీడిన కంపెనీలు.. వ్యాపార క్రమశిక్షణ దశలోకి ప్రవేశించాయంటున్నారు. 

దాంతో గత ఏడాది డిసెంబరులో మొబైల్‌ టారిఫ్‌లు గణనీయంగా పెరిగాయి. చార్జీలు పెరిగినప్పటికీ, ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో ఎయిర్‌టెల్‌, జియో మొబైల్‌ వినియోగదారులు మరో 2.4 కోట్ల మంది పెరిగారు. దీన్నిబట్టి చూస్తే, చార్జీల పెంపునకు మార్కెట్‌ ఆమోదం లభించినట్లేనని జెఫ్రీస్‌ రిపోర్టు పేర్కొంది.

ఇదిలా ఉంటే ముకేశ్‌ అంబానీ తన డిజిటల్‌ కంపెనీలో ‘జియో ప్లాట్‌ఫామ్స్‌’లో ఇప్పటికే  21 శాతం వాటా విక్రయించారు. మొత్తం 8 డీల్స్‌ ద్వారా రూ.97,885.65 కోట్లు సేకరించారు.

జియో కంపెనీలో 20 శాతం వరకు వాటా విక్రయిస్తామని ముందు ప్రకటించినా అంతకంటే వాటానే రిలయన్స్ అమ్మేసింది. అయితే, ఈ తంతు ఇంకా పూర్తి కాలేదని సమాచారం. చివరిగా ఓ భారీ డీల్‌తో వాటాల విక్రయ ప్రక్రియకు ముగింపు పలకనున్నట్లు తెలిసింది. 

ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలైన గూగుల్‌ లేదా మైక్రోసాఫ్ట్‌ ఈసారి వాటా కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. రెండు కంపెనీలూ ఇందుకు పోటీపడుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 6 శాతం వరకు కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

జియో వాటా చేజిక్కకపోతే వొడాఫోన్‌ ఐడియాలోనైనా వాటా దక్కించుకునేందుకు గూగుల్‌ ప్రయత్నిస్తున్నట్లు, ఈ దిశగా సంప్రదింపులు కూడా మొదలైనట్లు మార్కెట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

click me!