కరోనా మహమ్మారి గురించి ట్రెండ్స్ మారాయి. ఏప్రిల్ నెలలో కరోనా గురించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ‘సెర్చింజన్’ గూగుల్‌లో బాగా వెతికిన నెటిజన్లకు మే నెలలో ఆసక్తి పడిపోయింది. ఎక్కువ మంది లాక్‌డౌన్ 4.0 గురించి వెతికారు. తర్వాత ఈద్ ముబారక్ పదం ట్రెండింగ్ లో నిలిచింది.
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కలకలంతో మే నెలలో లాక్‌డౌన్ 4.0 గూగుల్ టాప్ ట్రెండింగ్ సెర్చ్‌గా నిలిచింది. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో సెర్చ్ ట్రెండ్స్‌ను టెక్ దిగ్గజం గూగుల్ బహిర్గతం చేసింది.
‘కరోనావైరస్ లాక్‌డౌన్ జోన్స్ ఢిల్లీ’ అంటూ గూగుల్ సెర్చ్‌లో వెతికిన వారి సంఖ్య మే నెలలో 1800 శాతం ఎగబాకిందని పేర్కొంది. కరోనా కట్టడికి మార్చి 24న విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ మే 17 నాటికి మూడు దశలు పూర్తయి మే 18న నాలుగో దశలోకి అడుగుపెట్టే క్రమంలో పెద్దసంఖ్యలో ప్రజలు ప్రభుత్వం వెల్లడించే తాజా మార్గదర్శకాలను తెలుసుకునేందుకు గూగుల్‌ను ఆశ్రయించారు.
ఇక మేలో ‘లాక్‌డౌన్ 4.0’ పదం సెర్చ్ 3150 శాతం పెరగ్గా, తర్వాత స్ధానంలో ‘ఈద్ ముబారక్’ నిలిచింది. ఏప్రిల్‌లో మూడో టాప్ సెర్చింగ్ పదంగా నిలిచిన కరోనావైరస్ ఆ తర్వాత 12వ స్ధానానికి పడిపోయింది. అంటే ఏప్రిల్ నెలతో పోలిస్తే కరోనా గురించి సెర్చ్ చేసేవారు మే నెలలో సగానికి పడిపోయారు.
also read డేంజర్‌లో వాట్సాప్.. యూజర్ల ప్రైవసీ పై మొదటికే మోసం..
అయితే దేశంలో విశేష ఆదరణ కలిగిన క్రికెట్‌తో పోలిస్తే కరోనావైరస్ గురించి సెర్చ్ ఇప్పటికీ అయిదు రెట్లు అధికంగా ఉందని గూగుల్ పేర్కొంది. గూగుల్‌లో కరోనా వైరస్ సంబంధిత టాప్ ట్రెండింగ్ టాపిక్‌గా వ్యాక్సిన్‌కు చోటు దక్కింది. మేలో వ్యాక్సిన్ పదం సెర్చి 190 శాతం పెరిగిందని తెలిపింది.
‘ఇటలీ కరోనావైరస్ వ్యాక్సిన్’ కోసం సెర్చి సైతం 750 శాతం పెరిగిందని వెల్లడించింది. కరోనా వైరస్ సంబంధిత వ్యాధి ఏంటి..? చైనాలో తొలి వైరస్ కేసును ఎక్కడ గుర్తించారు..? లక్షణాలు లేనివారు కరోనాను వ్యాప్తి చేయగలరా..? వంటి ప్రశ్నలు టాప్ ట్రెండింగ్ ప్రశ్నలుగా నిలిచాయని గూగుల్ తెలిపింది.
ఇక ఫిల్మ్, న్యూస్, వెదర్ వంటి టాపిక్స్ సెర్చిలో కరోనావైరస్‌ను అధిగమించాయని, క్రైమ్ థ్రిల్లర్ పాతాళ్ లోక్ మూవీ గూగుల్‌లో అత్యధికులు అన్వేషించిన ఫిల్మ్‌గా నిలిచింది. అర్థాలు, రోజువారీ దిన చర్యలో భాగమైన అంశాలపై సెర్చింగ్ సాగింది.