హెచ్-1బీ వీసాల రద్దు... ఐటీ కంపెనీలకు భారీ షాక్..

By Sandra Ashok KumarFirst Published Jun 24, 2020, 1:27 PM IST
Highlights

కరోనా కష్టకాలాన్ని సాకుగా చేసుకుని హెచ్-1 బీ వీసాలను జారీ చేయడాన్ని నిషేధించినందున ఐటీ సంస్థలకు లాభాలు తగ్గుతాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఐటీ సంస్థలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.
 

న్యూఢిల్లీ: హెచ్‌-1బీ వీసాలతోపాటు ఇతర వర్క్‌ వీసాలపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం భారత ఐటీ కంపెనీలను భయపెడుతోంది. ఈ నిర్ణయంతో భారత ఐటీ నిపుణుల్ని ఈ ఏడాది చివరి వరకు వర్క్‌ వీసాలపై అమెరికా పంపే అవకాశాలు మూసుకుపోయాయి.

అదనపు ఉద్యోగులు అవసరమైతే, అధిక జీతాలు ఇచ్చి స్థానికుల్ని నియమించుకోక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. దీంతో ఖర్చులు పెరిగి ఈ కంపెనీల లాభాలకూ గండి పడుతుందని అంచనా. 

‘భారత ఐటీ కంపెనీల లాభాలపై ఈ నిర్ణయం ప్రభావం తప్పకుండా ఉంటుంది. అమెరికా ఉద్యోగులు తక్కువగా ఉన్న కంపెనీలపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది’ అని గోల్డ్‌మన్‌ శాక్స్‌ పేర్కొంది. 

వాస్తవానికి రెండు మూడేళ్ల నుంచే అమెరికాలోని భారత ఐటీ కంపెనీలు జాగ్రత్త పడడం ప్రారంభించాయి. హెచ్‌-1 బీ వీసాలపై వచ్చే వారికి బదులు, స్థానిక అమెరికన్లనే ఎక్కువగా ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. 

also read ఐఫోన్‌ ద్వారా కారు స్టార్ట్ చేయవచ్చు.. ఎలా అనుకుంటున్నారా..? ...

అమెరికాలోని టీసీఎస్‌ యూనిట్లలో ఇప్పటికే 20,000 మంది అమెరికన్లు పని చేస్తున్నారు. ఇన్ఫోసిస్‌ కూడా మరో 10,000 మంది స్థానికుల్ని ఉద్యోగాల్లోకి తీసుకోబోతోంది.

ప్రస్తుతం అమెరికాలోని భారత ఐటీ కంపెనీల ఉద్యోగుల్లో 40 నుంచి 70 శాతం మంది అమెరికన్లే. ట్రంప్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే భారత ఐటీ కంపెనీలు ఈ విషయంలో జాగ్రత్త పడడం ప్రారంభించాయని టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈఓ సీపీ గుర్నానీ చెప్పారు. ప్రస్తుతం అమెరికాలోని భారత ఐటీ కంపెనీలు ఆత్మనిర్భరంతో ఉన్నట్టు తెలిపారు.  

అమెరికా ఏటా 85,000 హెచ్‌- 1బీ వీసాలు జారీ చేస్తుంటుంది. ఇందులో దాదాపు 70 శాతం భారత ఐటీ నిపుణులకు లభిస్తుంటాయి. అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న భారత ఐటీ కంపెనీలు, జీతాల ఖర్చులు తగ్గించుకునేందుకు, తమ ఉద్యోగుల్ని ఈ వీసాలపై అమెరికా పంపుతాయి.

ట్రంప్‌ తాజా నిర్ణయంతో అమెరికాలోని భారత ఐటీ కంపెనీల లాభాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థకే చేటు చేస్తుంది. అమెరికాలో నిపుణులు లభించడం కష్టంగా ఉంది. దీంతో మరిన్ని అమెరికా కంపెనీలు తమ సేవల్ని ఆఫ్‌షోర్‌ ద్వారా పొందేందుకు ప్రయత్నిస్తాయి. 

click me!