వచ్చే దశాబ్దంలో ఆన్‌లైన్ షాపింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉన్నంత సులభంగా ఉంటుందా? పెద్ద బ్రాండ్లే ఆన్‌లైన్ మార్కెట్‌ను శాసిస్తాయా? నిపుణులు ఏమంటున్నారు? ప్రస్తుతం ఆఫర్లతో ఆకట్టుకుంటున్న డిజిటల్ వేదికలు తర్వాతర్వాత మనపై పెత్తనం చేస్తాయని, మార్కెట్లో బ్రాండ్లను, ధరలను శాసిస్తాయని ఆర్థిక వేత్తలు, భవిష్యత్ వ్యూహకర్తలు హెచ్చరిస్తున్నారు.
న్యూఢిల్లీ: దుకాణానికి వెళ్లే తీరికలేదు. వంట వండుకునే ఓపికలేదు. మనం వెళ్లిన చోట కోరుకున్నవి దొరికే గ్యారంటీ లేదు. ఆన్‌లైన్‌లో అన్ని రకాల వస్తువులు, కోరుకున్న ఆహార పదార్థాలు లభ్యమవుతుంటే.. వెంటనే ఆర్డర్ పెట్టేస్తున్నాం. ఇప్పుడు మనకివి సౌలభ్యంగా అనిపిస్తుండొచ్చు. ఈ సౌకర్యాల్ని అందిస్తున్న ఈ-కామర్స్ సైట్లు నమ్మకంగా వ్యాపారం చేస్తుండొచ్చు.
కానీ మున్ముందు ఈ పరిస్థితి ఉండకపోవచ్చునని, కేవలం కొన్ని పెద్దబ్రాండ్లే ఆన్‌లైన్ మార్కెట్‌ను, ధరల్ని శాసిస్తాయని భవిష్యత్ వ్యూహకర్తలు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల మన చుట్టుపక్కల ఉండే చిన్నచిన్న ఉత్పత్తిదారులు, విక్రేతలంతా వెనుకబడిపోతారన్నది వారి అంచనా.
వచ్చే దశాబ్దంలో బడా డిజిటల్ వేదికల గుత్తాధిపత్యాన్ని అడ్డుకునేదెలా? వాటిని మరింత ప్రజాస్వామ్యయుతం చేసే మార్గాలేవి? ‘ఈ-విపణిలో ఇరుక్కుపోకుండా’ ఉండాలంటే ఏం చేయాలి? అన్నది ఆలోచించాల్సిన విషయమేనని చెబుతున్నారు.ఏది అవసరమైనా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నాం..డిజిటల్ వేదికల గుత్తాధిపత్యానికి చెక్ పెట్టి.. వీటిని మరింతగా ప్రజాస్వామీకరించుకోవడం ఎలాగన్నదే ఈ దశాబ్ది ముందున్న సవాల్..దీన్నెలా సాధిస్తాం?ఇంటర్నెట్ యుగం.. డిజిటల్ విప్లవం తెచ్చిపెట్టిన అద్భుత సౌలభ్యం ఇది.
also read JIO OFFERS: జియో ప్రీపెయిడ్ రిచార్జ్ ప్లాన్ పై కొత్త ఆఫర్...
ఈ అనూహ్య పురోగతితో అంతా బాగానే ఉంది గానీ సరిగ్గా ఇక్కడే.. మనకు తెలియకుండానే.. వ్యాపార అవకాశాలనూ, మన వసతులన్నీ ‘బడా డిజిటల్ వేదికల’ చేతుల్లో పెట్టేస్తున్నాం! ఏదో క్యాబ్‌లను సమకూర్చే డిజిటల్ నిర్వాహకులు, వస్తువులను అమ్మిపెట్టే డిజిటల్ విక్రేతలే కాదు.
ఇప్పుడు మన దైనందిన జీవితాల పార్శ్వాలు ఈ ‘డిజిటల్ ప్లాట్‌ఫామ్స్’ చుట్టూ అల్లుకుంటున్నాయి. క్రమేపీ ఈ వేదికలు మరింతగా విస్తరిస్తూ.. వివిధ రంగాలపై గుత్తాధిపత్యాన్ని సాధించి... వచ్చే దశాబ్దంలో మనల్ని శాసించే స్థాయికి చేరుకోవటం తథ్యమని నిపుణులు భావిస్తున్నారు.
డిజిటల్ వేదికల ప్రభంజనంలో పడి మన చుట్టుపక్కల ఉండే చిన్నచిన్న ఉత్పత్తి దారులు, విక్రేతలంతా కొట్టుకుపోతున్నారు. డిజిటల్ వేదికల ప్రభావం ఎలా ఉండబోతోందో ఇప్పటికే మనకు అనుభవంలోకి వస్తోంది. తెలంగాణలో ఇటీవల ఆర్టీసీ సమ్మె సమయంలో క్యాబ్ సర్వీసులు.. పెరిగిన డిమాండ్ కారణంగా చూపుతూ భారీ ఛార్జీలు వసూలు చేశాయి.
హైదరాబాద్‌లో కొన్ని ఆహార పంపిణీ పోర్టళ్లు.. కొన్ని ప్రత్యేక రోజుల్లో పదార్థాల ధరలను ఏకపక్షంగా తగ్గించేసి హోటళ్ల యజమానులను ఇబ్బంది పెట్టాయి. ఆర్థిక లావాదేవీల వేదికలు సైతం విలీనాలకు దిగుతుండటంతో.. సేవలకు మున్ముందు భారీగా ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు.
తయారీదారులు.. తాము ఉత్పత్తి చేసిన వస్తువు ధరను తాము నిర్ణయించుకోలేని దుస్థితి ఎదురు కావచ్చు. తమకు లాభాలు వచ్చే వస్తువులే అధికంగా ఉత్పత్తి అయ్యేలా చూసి.. అంతిమంగా వినియోగదారుడికి ఎంపిక చేసుకునే హక్కును డిజిటల్ వేదికలు హరించొచ్చు.
మన దేశంలో మొబైల్ డేటా చౌక. అందువల్ల ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 56 కోట్లకు చేరుకుంది. 2030 నాటికి ఈ సంఖ్య 120 కోట్లకు చేరనుంది. మన ‘ఈ-మార్కెట్’ కూడా విపరీతంగా పుంజుకుంటోంది. దేశంలో ఈ-కామర్స్, డిజిటల్ వేదికలు బలోపేతమవుతుండటానికి ఇదే కారణం.
ప్రస్తుతం ఏడాదికి 5 వేల కోట్ల డాలర్లుగా ఉన్న ఆన్‌లైన్ వ్యాపారం 2026 నాటికి 20 వేల కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా. దేశంలో ఒక్కో ఆన్‌లైన్ యూజర్ సగటున ఏడాదికి రూ.13 వేలు ఈ డిజిటల్ వేదికల్లో ఖర్చు చేస్తున్నారు. 2030 నాటికి ఇది రూ.27 వేలు దాటుతుందన్నది ఫిక్కీ లెక్క.
ఈ లాభదాయక ఆన్‌లైన్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకునే.. దేశంలో పెద్దపెద్ద డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ బలపడుతున్నాయి. వీటితో చిన్నచిన్న దుకాణాలు, విక్రేతలంతా పోటీపడే పరిస్థితే కనబడటం లేదు. వచ్చే దశాబ్దంలో కేవలం ఐదారు బడా డిజిటల్ వేదికలే మిగిలే ప్రమాదం కనిపిస్తోంది.
బడా డిజిటల్ వేదికల ఒరవడిలో కొట్టుకుపోకుండా మన చుట్టుపక్కల.. స్థానిక దుకాణాలు, తయారీదారులు కూడా చిన్నచిన్న డిజిటల్ వేదికలను ఏర్పాటు చేసుకోవటం.. వాటిని కూడా మనం ప్రోత్సహించటం అవసరమని, తద్వారా కొన్ని వేదికల ఆధిపత్య పోకడలకు ముకుతాడు పడుతుందని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు. కొన్ని దేశాల్లో ఇప్పటికే ఒక ప్రాంతంలో ఉన్న కార్ల యజమానులంతా కలిసి ఒక డిజిటల్ వేదికను నిర్వహించుకుంటున్నారు. సహకార సంస్థల్లా నడిచే ఇటువంటి వేదికలనూ ప్రోత్సహించటం అవసరం.
అటు ఉత్పత్తిదారులకూ, ఇటు వినియోగదారులకూ మధ్య నుసంధానకర్తలుగా వ్యవహరిస్తూ.. కేవలం సాఫ్ట్‌వేర్, డిజిటల్ పరిజ్ఞానంతోనే డిజిటల్ వేదికలు బలపడుతున్నాయి. ఫలితంగా ఒక్క కంపెనీ కూడా లేని వ్యక్తి నేడు ప్రపంచ కుబేరుడయ్యాడు. ఎకరం పొలం లేకుండానే వేల టన్నుల కూరగాయలు విక్రయిస్తున్నారు.
also read ఒప్పో నుండి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు...ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీతో
సొంతంగా ఒక్క కారూ లేని కంపెనీ లక్షల కార్లను రోడ్ల మీద తిప్పుతోంది. హోటల్ లేని వ్యక్తి కోట్ల మందికి భోజనం అందిస్తున్నాడు. ఇలాంటి సాఫ్ట్‌వేర్‌లను చిన్నచిన్న ఉత్పత్తిదారులు, విక్రయదారులకు సైతం ప్రభుత్వాలు ఉచితంగా అందిస్తే ప్రయోజనం ఉంటుంది. స్థానిక విక్రేతలను ప్రోత్సహించడానికి ఆ సాఫ్ట్‌వేర్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలి.
ఒక కాలనీలో ఉండే పౌరులు బృందంగా తమకు కావాల్సిన కూరగాయలు, ఆహార ధాన్యాలను పండించేలా సమీప రైతులతో ఒప్పందాలు చేసుకోవచ్చు. ఈ విధానం బెంగళూరులో రెండేళ్లుగా కొనసాగుతోంది. సహకార సంఘాలు ఉత్పత్తిదారులు సహకార సంఘాలుగా ఏర్పడి ఒకే బ్రాండ్ పేరిట దిగుబడులను స్వయంగా విక్రయించుకునే ప్రయత్నం చెయ్యొచ్చు.
ఇటీవలే ఆన్‌లైన్‌లోకి వచ్చిన గుజరాత్‌కు చెందిన అమూల్, పోచంపల్లి చేనేత సహకార సంఘం, ఏపీ గిరిజన సహకార సంస్థలు ఇందుకు తాజా ఉదాహరణలు. ముంబైలో రోజుకు రూ.20 తీసుకుని ఉద్యోగులకు ఇళ్ల నుంచి మధ్యాహ్నం భోజనం అందించే ‘డబ్బా వాలా’ల సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు. తెలంగాణ జైళ్ల శాఖ తాము ఖైదీలతో తయారు చేయించిన వస్తువులను ప్రత్యేక స్టాళ్లలో అమ్ముతోంది. ముందే బుక్ చేసుకుంటే ఇంటికీ పంపిస్తున్నారు. మిగతా ఉత్పత్తిదారులు ఇదే తోవలో వెళ్లొచ్చు.