లైంగికంగా వేధిస్తున్నారు.. చంపుతామని బెదిరిస్తున్నారు.. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిపై రెజ్లర్ల ఆరోపణలు

By Srinivas MFirst Published Jan 18, 2023, 8:24 PM IST
Highlights

Wrestling Federation Of India: ఇండియా రెజ్లర్లు నిరసన బాట పట్టారు.  భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను  లైంగికంగా వేధిస్తున్నారని  వాపోతున్నారు.  బ్రిజ్ భూషన్ బీజేపీ ఎంపీ కూడా..

భారత రెజ్లింగ్ సమాఖ్య  అధ్యక్షుడు, ప్రస్తుతం కైసర్ గంజ్ (యూపీ)  లోకసభ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ  బ్రిజ్ భూషణ్ సింగ్ పై  టీమిండియా రెజ్లర్లు పోరాటానికి దిగారు.  బ్రిజ్ భూషణ్ తో పాటు జాతీయ కోచ్‌లు తమను లైంగికంగా వేధిస్తున్నారని, మాట వినకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని  సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు చేసింది ఏదో  ఊరు పేరు తెలియని  రెజ్లర్లు అనుకుంటే పొరపాటే.  భారత స్టార్ రెజ్లర్  వినేశ్ పోగట్ ఈ కామెంట్స్ చేసింది.  బ్రిజ్ భూషణ్ తో పాటు కోచ్ ల తీరుకు నిరసనగా ఆమె  సంచలన ఆరోపణలు చేసింది. 

ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నుంచి ర్యాలీగా బయల్దేరి వెళ్లిన   సుమారు 30 మంది రెజ్లర్లు.. డబ్ల్యూఎఫ్ఐ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో   వినేశ్ పోగట్ తో పాటు  భారత స్టార్ రెజ్లర్లు భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, సంగీత పోగట్,  సుమిత్ మాలిక్ వంటి స్టార్ రెజ్లర్లు కూడా పాల్గొన్నారు.  

భూషణ్ వేధింపులకు చచ్చిపోవాలనుకున్నా : వినేశ్ 

ధర్నా సందర్భంగా వినేశ్ పోగట్ స్పందిస్తూ...‘మహిళా రెజ్లర్లను   బ్రిజ్ భూషణ్, జాతీయ కోచ్ లు లైంగికంగా వేధిస్తున్నారు.  ఒలింపిక్స్ లో నా ప్రదర్శన తర్వాత నన్ను  ఎందుకూ పనికిరావని తిట్టారు.  బ్రిజ్ భూషణ్ వేధింపుల వల్ల నేను మానసిక క్షోభకు గురయ్యా.  ఒకసారి ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నా.. మాకు గాయాలైతే పట్టించుకునే నాథుడే లేడు.  ఆయనపై ఫిర్యాదు చేసినందుకు గాను నన్ను చంపేస్తానని బెదిరింపులు కూడా వచ్చాయి’ అని ఆమె కన్నీటి పర్యంతమైంది.  

అంతేగాక.. ‘కోచ్‌లు మహిళా రెజ్లర్లతో అసభ్యంగా వ్యవహరిస్తున్నారు. ఫెడరేషన్ లో ఉన్న మహిళా కోచ్ లనూ ఇలాగే వేధిస్తున్నారు. బ్రిజ్ భూషణ్ చాలా మంది  అమ్మాయిలను లైంగికంగా వేధించాడు..’ అని తెలిపింది. 

 

Olympic medallists Bajrang Punia and Sakshi Malik, World Championships medallists Vinesh Phogat and Anshu Malik among others have gone on a strike against the Wrestling Federation of India. pic.twitter.com/Koax1yl8pr

— Deeksha Negi (@NegiDeekshaa)

దిగేదాకా తగ్గేది లేదు.. : భజరంగ్ 

మరో రెజ్లర్ భజరంగ్ పునియా  మాట్లాడుతూ.. ‘ఫెడరేషన్ లో ఉన్నవారికెవరికీ  ఈ ఆట గురించి తెలియదు.   బ్రిజ్ భూషన్  మమ్మల్ని తిట్టేవారు.  కొట్టారు..’అని అన్నాడు.   తమ పోరాటం ప్రభుత్వం మీద కాదని.. ఫెడరేషన్,   అధ్యక్షుడి మీదేనని  ఆటగాళ్లు చెప్పారు. అతడిని పదవి నుంచి దింపేవరకూ తమ ఆందోళన విరమించబోమని  చెప్పారు. 

నిజమని తేలితే ఉరేసుకుంటా : బ్రిజ్ భూషణ్ 

అయితే తనపై రెజ్లర్లు చేసిన ఆరోపణలను బ్రిజ్ భూషణ్ ఖండించారు.   ఇదంతా తనపై జరుగుతున్న కుట్ర అని తెలిపారు.   ఓ పేరు మోసిన పారిశ్రామికవేత్త  దీనికి పాత్రదారి అని ఆరోపించారు. వినేశ్ ఓడినప్పుడు  తాను ఓదార్చానని.. ఫెడరేషన్ లో మహిళలను లైంగికంగా వేధించానని నిరూపిస్తే తాను ఉరేసుకుంటానని అన్నారు.  తనపై ఈ ఆరోపణలు వస్తున్నా డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోనని  చెప్పారు.  డబ్ల్యూఎఫ్ఐకి ఆయన  2011 నుంచి  అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 


 

Wrestling Federation Of India के अध्यक्ष पर रेसलर विनेश फोगाट ने लगाए गंभीर आरोप, इसपर अध्यक्ष बृजभूषण शरण सिंह ने दिया अपना बयान pic.twitter.com/LytEuLVPKT

— Vishal_Journalist🇮🇳🚩 (@vishal_stan)
click me!