హాకీ వరల్డ్ కప్ ఫెయిల్యూర్ ఎఫెక్ట్... భారత హాకీ టీమ్ హెడ్ కోచ్‌తో సహా మరో ఇద్దరు రాజీనామా...

By Chinthakindhi Ramu  |  First Published Jan 30, 2023, 4:42 PM IST

మెన్స్ హాకీ వరల్డ్ కప్ 2023 టోర్నీలో 9వ స్థానంలో నిలిచి తీవ్రంగా నిరాశపరిచిన భారత హాకీ జట్టు... హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్న గ్రాహం రీడ్... 


పురుషుల హాకీ వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగింది. గోల్డ్ మెడల్ కాకపోయినా కనీసం మూడో స్థానంలో అయినా టీమిండియా నిలుస్తుందని ఆశించారు అభిమానులు. ఇదే అంచనాలతో టీమిండియా ఆడే హాకీ మ్యాచులకు వేలాది మంది అభిమానులు తరలివెళ్లారు. అయితే భారత హాకీ పురుషుల జట్టు, అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయ్యింది...

గ్రూప్ స్టేజీలో ఓ మ్యాచ్ డ్రా చేసుకుని రెండు మ్యాచుల్లో గెలిచిన భారత హాకీ జట్టు, క్వార్టర్ ఫైనల్‌కి అర్హత సాధించడం కోసం జరిగిన క్రాస్ ఓవర్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతుల్లో చిత్తుగా ఓడింది. ఓవరాల్‌గా మెన్స్ హాకీ వరల్డ్ కప్ 2023 ట్రోఫీలో భారత జట్టు 9వ స్థానానికి పరిమితమైంది..

Latest Videos

undefined

ఈ ఫెయిల్యూర్‌కి బాధ్యత వహిస్తూ భారత పురుషుల హాకీ జట్టు హెడ్ కోచ్ గ్రాహం రీడ్, తన పొజిషన్‌కి రాజీనామా చేశాడు. హెడ్ కోచ్‌తో పాటు అనాలిటికల్ కోచ్ గ్రెగ్ క్లార్క్, సైంటిఫిక్ అడ్వైసర్ మిచెల్ డేవిడ్ పెంబర్టన్ కూడా తమ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు..

ఆస్ట్రేలియాకి చెందిన గ్రాహం రీడ్, 2019 నుంచి భారత పురుషుల హాకీ జట్టుకి ప్రధాన కోచ్‌గా ఉంటున్నాడు. గ్రాహం రీడ్ కోచింగ్‌లో టీమిండియా, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టుకి దక్కిన ఒలింపిక్ పతకం ఇది..

‘నా బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని అనిపిస్తోంది. భారత హాకీ జట్టుకి హెడ్ కోచ్‌గా వ్యవహరించడాన్ని నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఈ ప్రయాణంలో ప్రతీ మ్యాచ్‌ని ఎంతగానో ఎంజాయ్ చేశాడు. భారత హాకీ టీమ్ మున్ముందు ఎన్నో గొప్ప విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా...’ అంటూ తన స్టేట్‌మెంట్‌లో తెలియచేశాడు గ్రాహం రీడ్.. 

అలాగే 2022 బర్మింగ్‌హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో ఫైనల్ చేరిన భారత పురుషుల హాకీ జట్టు, స్వర్ణ పతక పోరులో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. 

మెన్స్ హాకీ వరల్డ్ కప్ 2023 టోర్నీలో స్పెయిన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 2-0 తేడాతో గెలిచిన భారత జట్టు, ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ని 0-0 తేడాతో డ్రా చేసుకుంది. వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కనీసం 8 గోల్స్ తేడాతో గెలవాల్సి ఉండగా 4-2 తేడాతో గెలిచి సరిపెట్టుకుంది భారత పురుషుల హాకీ జట్టు...

దీంతో క్వార్టర్ ఫైనల్ చేరేందుకు న్యూజిలాండ్‌తో ఆడిన క్రాష్‌ ఓవర్ మ్యాచ్‌లో 3-3 తేడాతో స్కోర్లు సమం అయ్యాయి. పెనాల్టీ షూటౌట్‌లో 4-5 తేడాతో పోరాడి ఓడిన భారత జట్టు, క్వార్టర్ ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది. జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8-0 తేడాతో గెలిచిన భారత జట్టు, సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 5-2 తేడాతో గెలిచి ఓవరాల్‌గా 9వ స్థానంలో నిలిచింది...

click me!