
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తుదిపోరులో చేసిన శ్రమ ఫలించి, 18 ఏళ్ల కల నిజమవ్వడంతో బెంగళూరు(Bengalore)లో ఆనందోత్సవాలు మొదలయ్యాయి. ఆ జట్టు విజయాన్ని ప్రజలతో పంచుకోవడానికి కర్ణాటక (Karnataka)ప్రభుత్వంతో కలిసి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. చిన్నస్వామి స్టేడియం వద్ద భారీ స్థాయిలో వేడుకలు జరపాలని ప్రణాళికలు సిద్ధం చేశారు.
అయితే, వేడుకలు ఆరంభం కాకముందే అక్కడ దారుణ ఘటన చోటుచేసుకుంది. అభిమానులు ఒక్కసారిగా భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా గాయాలపాలయ్యారు.
ఈ విషాదకర సంఘటనపై దేశవ్యాప్తంగా పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఏపీ సీఎం చంద్రబాబు, సచిన్ టెండూల్కర్ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది.
ఆర్సీబీ మేనేజ్‌మెంట్ ఈ విషయంలో స్పందిస్తూ, వెంటనే తమ కార్యక్రమాలను రద్దు చేసినట్టు ప్రకటించింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. అభిమానులు భారీగా రావడంతో ఈ ప్రమాదం జరిగిందని స్పష్టం చేసింది. బాధితుల కుటుంబాలకు సహాయం అందించేందుకు తమవంతుగా ముందుకు వస్తామని పేర్కొంది.
ఈ ప్రమాదంపై విరాట్ కోహ్లీ (kohli) తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించాడు. జరిగిన ఘటన తీవ్ర శోకాన్ని కలిగించిందని, మాటలు కూడా రావడం లేదని ఆయన అన్నారు. అభిమానుల క్షేమమే తమకు ముఖ్యమని, అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరాడు.