
చిన్నప్పటి నుంచి దాదాపు 30 ఏళ్లుగా క్రికెట్ ప్రపంచంలో మారుతున్న వ్యూహాలను అత్యంత ఆసక్తితో గమనిస్తున్న ఒక జర్నలిస్టుగా నేను చెప్పగలిగేది ఒక్కటే.. 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్ సాధించిన ఈ విజయం కేవలం అదృష్టమో, లేక ఆ ఒక్క రోజు ఆడిన గొప్ప ఆటో కాదు. ఇది ఓ ప్రక్రియ. ఇది ఒక స్పష్టమైన ప్రణాళిక, కన్సిస్టెన్సీ, పాత బెంచ్ మార్కులను చెరిపివేసి కొత్త ప్రమాణాలను నెలకొల్పడం వల్ల వచ్చిన ఫలితం. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆయనపై అనేక విమర్శలు వచ్చాయి; జట్టు కూర్పు, సీనియర్ల పట్ల వైఖరి ఇలా ప్రతి విషయంలోనూ ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ అహ్మదాబాద్ లో న్యూజిలాండ్‌పై సాధించిన 96 పరుగుల భారీ విజయం ఆయన నమ్ముకున్న సిద్ధాంతానికి నిదర్శనంగా నిలిచింది.
గౌతమ్ గంభీర్ కోచింగ్ ఫిలాసఫీలో అత్యంత కీలకమైన అంశం "హై రిస్క్ - హై రివార్డ్". సాధారణంగా టీ20ల్లో ఒక జట్టు 150 లేదా 170 పరుగులు చేస్తే అది గౌరవప్రదమైన స్కోరుగా భావిస్తారు. కానీ గంభీర్ ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి. "మేము 150.. 170 పరుగుల కోసం ఆడటం లేదు; మా లక్ష్యం ప్రతి మ్యాచ్‌లోనూ 250కి పైగా పరుగులు చేయడం" అని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం 100 పరుగుల లోపు ఆలౌట్ అయినా తమకు అభ్యంతరం లేదని, వేగంగా పరుగులు చేయడం అనే దానిపైనే తమ ఫోకస్ అని టీమ్ మేనేజ్‌మెంట్ గట్టిగా నమ్ముతోంది. దీన్ని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, జట్టు కూడా బాగా ఆకళింపు చేసుకుంది.
ఈ దృక్పథం క్రికెట్ ప్రపంచంలో ఒక విప్లవం లాంటిది. ఓటమి అంటే భయపడే జట్లు సాధారణంగా వికెట్లు పడగానే సేఫ్ గేమ్ ఆడతాయి. కానీ భారత్ ఆ మార్గాన్ని ఎంచుకోవట్లేదు. ఎందుకంటే, వికెట్లు పడ్డాయని నెమ్మదిగా ఆడి ఓ 150 పరుగులు చేసినా, ఇప్పుడున్న విధ్వంసకర బ్యాటర్లు దాన్ని సులభంగా ఛేజ్ చేస్తారని గంభీర్-సూర్య జోడీకి తెలుసు. అందుకే, ఓడిపోయినా పర్వాలేదు కానీ, ధాటిగా ఆడి ప్రత్యర్థి ముందు ఒక అసాధ్యమైన లక్ష్యాన్ని ఉంచడమే టీమ్ ఇండియా కొత్త వైఖరి. ఈ 'టీ20' అప్రోచ్ వల్లనే భారత్ గత 32 అంతర్జాతీయ వైట్ బాల్ మ్యాచ్‌ల్లో 30 మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచింది.
భారత క్రికెట్‌లో వ్యక్తిగత మైలురాళ్లు, సెంచరీలు ఒకప్పుడు చర్చనీయాంశంగా ఉండేవి. కానీ ఇప్పుడు జట్టు ప్రయోజనాలే పరమావధిగా మారాయి. ప్రపంచకప్ విజయం తర్వాత సంజూ శామ్సన్ అన్న మాటలు ఈ మైండ్ సెట్ మార్పుకు అద్దం పడుతున్నాయి: "నేను నా జట్టులో ఉన్న వ్యక్తితో పోటీ పడను; నా జట్టులో స్థానం కోసం పోటీ పడితే, మరో జట్టు సభ్యుడితో పోటీ పడినట్టే". జట్టులో ఎవరున్నా లేకున్నా టీమ్ ఇండియా గెలవాలి, 140 కోట్ల మంది ఆశలను సజీవంగా ఉంచాలి అనేదే ఇప్పుడు ఆటగాళ్ల ఏకైక లక్ష్యం.
టీ20 క్రికెట్‌లో ఒక బ్యాటర్ 96 పరుగుల వద్ద ఉన్నప్పుడు, తన సెంచరీ కోసం 4-5 బంతులు తీసుకుంటే జట్టు స్కోరులో దాదాపు 15 నుండి 20 పరుగులు తగ్గిపోయే అవకాశం ఉంది. టీ20 ఫార్మాట్‌లో ఈ 15 పరుగుల మార్జిన్ ఓటమికి దారితీయవచ్చు. అందుకే ఇప్పుడు భారత జట్టులో 100 పరుగులు చేసిన వ్యక్తికంటే, జట్టు కోసం వేగంగా ఆడి 49 వద్ద అవుట్ అయిన వ్యక్తికే ఎక్కువ ప్రశంసలు దక్కుతున్నాయి. ఆడిన ప్రతి బంతికీ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల భారత్ ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. సంజూ శామ్సన్ ఈ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలవడం ఈ కొత్త ఆలోచనా విధానానికి ఒక గొప్ప ఉదాహరణ.
ఈ వరల్డ్ కప్ లో ఓపెన్ అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతున్నా తనపై నమ్మకం ఉంచి కొనసాగించింది కూడా ఇందుకే. అవకాశం వచ్చిన రోజున తాను విధ్వంసకర ఆటతీరుతో ప్రత్యర్థిని పవర్ ప్లేలోనే మట్టికరిపిస్తాడని టీం మేనేజ్ మెంట్ కి బాగా తెలుసు. ఆ నమ్మకాన్ని అభిషేక్ శర్మ వమ్ము చేయలేదు. అత్యంత ముఖ్యమైన టీ 20 ప్రపంచకప్ ఫైనల్లో తన తడాఖాతో మొదటి పవర్ ప్లేలోనే భారత విజయాన్ని లిఖించేశాడు.
భవిష్యత్తులో 10 మంది బ్యాటర్లు.. ఒక స్పెషలిస్ట్ బౌలర్. ఇది మీకు కాస్త అతిశయోక్తిగా అనిపించవచ్చు. సమీప భవిష్యత్తులో భారత్ కి లాస్ట్ వికెట్ వరకూ బ్యాటింగ్ ఆడగలిగిన సత్తా ఉన్నటు వంటి జట్టు కూర్పు కూడా సాధ్యంగానే కనిపిస్తోంది. నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, శివం దూబె, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఇంకాస్త పటిష్టమైన ఆల్ రౌండర్లుగా మారితే జట్టులో నంబర్ 10 వరకూ బ్యాటింగ్ ఆడగలిగే సత్తా ఉంటుంది. అప్పుడు జట్టు 250 కాదు.. ప్రతి మ్యాచ్ లోనూ 300 పరుగుల కోసం ఎయిమ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
విజయం అనేది అకస్మాత్తుగా వచ్చేది కాదు, అది ఒక ప్రాసెస్ అనడానికి భారత్ అనుసరిస్తున్న డేటా అనలిటిక్స్ ఒక సాక్ష్యం. ప్రత్యర్థి బ్యాటర్ల బలహీనతలు, నిర్దిష్ట పరిస్థితుల్లో బౌలర్ల ప్రదర్శనను విశ్లేషించడానికి బీసీసీఐ ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతను వాడుతోంది. గంభీర్ తన వ్యూహాల్లో మైక్రో-మ్యాచ్ అప్స్ వాడుతూ, ఏ బౌలర్ ఏ బ్యాటర్‌కు ఎప్పుడు బౌలింగ్ చేయాలో ముందే నిర్ణయిస్తున్నారు. ఉదాహరణకు, పవర్ ప్లేలో స్పిన్నర్లను వాడటం లేదా లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడం వంటి నిర్ణయాలు డేటా ఆధారంగానే తీసుకుంటున్నారు.
దీనికి తోడు, రాహుల్ ద్రవిడ్ హయాంలో నిర్మించిన బలమైన బెంచ్ స్ట్రెంత్ ఇప్పుడు ఫలితాలను ఇస్తోంది. నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) ద్వారా యువ ఆటగాళ్లను అంతర్జాతీయ స్థాయికి సిద్ధం చేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. ఫిట్‌నెస్ విషయంలో విరాట్ కోహ్లీ ప్రారంభించిన విప్లవం ఇప్పుడు జట్టులోని ప్రతి ఆటగాడికి ఒక జీవనశైలిగా మారింది. టీ20ల్లో విజయం సాధించాలంటే కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు, శరీరంలో ప్రతి కణాన్ని పరీక్షించే స్థాయిలో ఫిట్‌నెస్ ఉండాలని ఈ జట్టు నిరూపిస్తోంది.
బ్యాటర్లు భారీ స్కోర్లు చేస్తున్నా, బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా ప్రదర్శన భారత జట్టుకు ఒక భరోసా. ఫ్లాట్ ట్రాక్‌లపై కూడా 4-15 వంటి గణాంకాలు నమోదు చేయగల బుమ్రాను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక 'నేషనల్ ట్రెజర్' (జాతీయ సంపద) అని పిలవడంలో అతిశయోక్తి లేదు. బుమ్రా తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లపై విపరీతమైన ఒత్తిడిని సృష్టిస్తాడు, ఇది ఇతర బౌలర్లకు వికెట్లు తీయడానికి సులభతరం చేస్తుంది. గత పదేళ్లలో భారత బౌలింగ్ విభాగం సమూలంగా మారిపోయింది. ఒకప్పుడు స్పిన్‌పైనే ఆధారపడే భారత్, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పేస్ అటాక్‌ను కలిగి ఉంది. బుమ్రా, అర్ష్ దీప్, మహమ్మద్ షమీ, సిరాజ్ వంటి బౌలర్లు నిరంతరం 140 కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నారు.
ముప్పై ఏళ్ల నా అనుభవంలో నేను గమనించిన గొప్ప మార్పు ఏమిటంటే, భారత జట్టు ఇప్పుడు ఓటమికి భయపడటం లేదు. ఈ నిర్భయమైన ఆటతీరే భారత్‌ను టీ20 ఫార్మాట్‌లో తిరుగులేని శక్తిగా మార్చింది. 2026 ప్రపంచకప్ విజయం కేవలం ఆరంభం మాత్రమే, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే తదుపరి లక్ష్యమని కెప్టెన్ సూర్యకుమార్ చెప్పడం వారి ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. వ్యక్తిగత అహంకారాలు వీడి, జట్టు ప్రయోజనాలే పరమావధిగా ఆడుతున్న ఈ భారత జట్టు భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టించడం ఖాయం.
విజయం అనేది ఒక రోజులో వచ్చేది కాదు, అది ఒక స్పష్టమైన సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని నమ్మిన ఆటగాళ్ల కృషితో వచ్చే ఫలితం. గంభీర్ , సూర్య నేతృత్వంలోని ఈ భారత జట్టు ప్రస్తుతం అదే మార్గంలో పయనిస్తోంది. 100 పరుగులకే ఆలౌట్ అయినా పర్వాలేదు కానీ, పరుగుల వేగాన్ని మాత్రం తగ్గించకూడదన్న ఈ క్లారిటీయే భారత్‌ను వరుసగా రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టింది.