Bajrang Punia: కాంస్య పోరులో బజరంగ్ దే గెలుపు.. చరిత్ర సృష్టించిన భారతీయ రెజ్లర్

Published : Sep 19, 2022, 01:24 PM ISTUpdated : Sep 19, 2022, 01:26 PM IST
Bajrang Punia: కాంస్య పోరులో బజరంగ్ దే గెలుపు.. చరిత్ర సృష్టించిన భారతీయ రెజ్లర్

సారాంశం

World Wrestling Championships: సెర్బియా వేదికగా జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్ లో  భారత వెటరన్ రెజ్లర్  బజరంగ్ పునియా  చరిత్ర సృష్టించాడు.  కాంస్యం పోరులో విజయం అతడినే వరించింది.   

గతేడాది టోక్యో ఒలింపిక్స్ లో పతకం గెలిచిన భారతీయ స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా.. తాజాగా  ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్ లోనూ పతకంతో మెరిశాడు. సెర్బియాలోని బెల్గ్రేడ్ లో  జరుగుతున్న వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్ లో పునియా... కాంస్యం గెలుచుకున్నాడు. ఆదివారం కాంస్యపోరులో ప్యూర్టోరికోకు చెందిన సెబాస్టియన్ సి రివేరాతో తలపడ్డ పునియా.. 11-9 తేడాతో విజయం సాధించాడు.  పురుషుల  65 కిలోల ఫ్రీ స్టయిల్  విభాగంలో రివేరాను ఓడించిన  పునియాకు ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్ లో ఇది నాలుగో పతకం కావడం గమనార్హం.

రివెరాతో ముగిసిన మ్యాచ్ లో తొలుత పునియా 0-6తో వెనుకబడ్డాడు.  కానీ ఆ పై పుంజుకుని మళ్లీ  పోటీలోకి వచ్చాడు. ఆట తొలి భాగం ముగిసేటప్పటికీ  6-6 తో సమానంగా నిలిచాడు. అయితే రెండో ఆరంభంలో ఇరువురూ  బౌట్ లో కొదమసింహాల్లా పోరాడారు.  ఒకరిపై ఒకరు ఆధిక్యం మార్చుకుంటూ మ్యాచ్ చివరిదాకా వెళ్లారు.  

మ్యాచ్ ఇక 90 సెకన్లలో ముగుస్తుందనేటప్పటికీ  స్కోరు 10-9తో పునియా చేతుల్లోనే ఉంది. అదే సమయంలో ఓ పట్టుకు సంబంధించి  సెబాస్టియన్ రివ్యూకు వెళ్లాడు. కానీ అతడు దానిని కోల్పోయాడు. దీంతో  పునియాకు  అదనంగా పాయింట్ దక్కింది. దీంతో  అతడు 11-9తో మ్యాచ్ గెలిచాడు.  

వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్ లో పునియాకు ఇది నాలుగో పతకం. అంతకుముందు 2013లో 60 కేజీల విభాగంలో  కాంస్యం నెగ్గిన అతడు.. 2018లో 65 కిలోల విభాగంలో  రజతం గెలిచాడు.  2019లో కాంస్యం సాధించిన పునియా.. తాజాగా కూడా కాంస్య పతకం సాధించి ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్ లో నాలుగు పతకాలు సాధించిన తొలి భారతీయ రెజ్లర్ గా గుర్తింపు సాధించాడు.

 

ఇక ఈ మెగా టోర్నీలో భారత్ ప్రదర్శన నిరాశజనకంగా ముగిసింది. సుమారు 30 మంది రెజ్లర్లు ఈ పోటీలలో పాల్గొంటే ఇద్దరు మాత్రమే పతకాలతో తిరిగొచ్చారు. మహిళల 53 కేజీల విభాగంలో వినేశ్ పోగట్, పురుషుల  65 కిలోల విభాగంలో బజరంగ్ పునియాలు పతకాలు సాధించారు.  

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !