Asian Games 2026 : ఆసియా క్రీడల్లో అదరగొట్టిన అమ్మాయిలు... భారత్ ఖాతాలో మరో గోల్డ్ మెడల్

Published : Sep 26, 2026, 12:02 PM IST
Asian Games 2026

సారాంశం

2026 ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పసిడి చేరింది. మహిళల కబడ్డీ ఫైనల్లో ఇరాన్‌ను మట్టికరిపించి భారత జట్టు గోల్డ్ మెడల్ సాధించింది. దీంతో ఈ టోర్నీలో భారత్ గెలిచిన బంగారు పతకాల సంఖ్య మూడుకు చేరింది.

2026 ఆసియా క్రీడల్లో భారత్ మరో బంగారు పతకం సాధించింది. మహిళల కబడ్డీ ఫైనల్లో ఇరాన్‌ను చిత్తుచేసిన మన అమ్మాయిలు ఇండియాను ఛాంపియన్‌గా నిలిపారు. దీంతో ఈ ఆసియా క్రీడల్లో భారత్ గెలిచిన గోల్డ్ మెడల్స్ సంఖ్య మూడుకు చేరింది.

మహిళల కబడ్డి ఫైనల్ మ్యాచ్ మొదలైనప్పటి నుంచే భారత టీం సత్తా చాటింది. అటు రైడింగ్, ఇటు డిఫెన్స్.. రెండు విభాగాల్లోనూ ఇరాన్‌పై తీవ్ర ఒత్తిడి పెంచింది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పాయింట్ల అంతరాన్ని పెంచుకుంటూ పోయింది. అయితే చివర్లో ఇరాన్ కూడా పుంజుకోవడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది… చివరికి 37-34 తేడాతో భారత జట్టే విజయాన్ని అందుకుంది. దీంతో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది.

సెమీ ఫైనల్లోనూ భారత్ సత్తా

అంతకుముందు జరిగిన సెమీ ఫైనల్లో నేపాల్‌ను 48-24 తేడాతో చిత్తు చేసి భారత్ ఫైనల్‌కు దూసుకొచ్చింది. ఫస్ట్ హాఫ్‌లోనే 31-17 ఆధిక్యంలోకి వెళ్లిన మన జట్టు.. సెకండ్ హాఫ్‌లోనూ అదే జోరు కొనసాగించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

ఆసియా క్రీడల మహిళల కబడ్డీలో భారత్‌కు ఎప్పటినుంచో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. 2010 నుంచి ఈ ఈవెంట్‌లో భారత్ చాలాసార్లు పసిడి పతకాలు గెలిచింది. 2018లో సిల్వర్ మెడల్ వచ్చినా.. 2022 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో చైనీస్ తైపీని ఓడించి మళ్లీ గోల్డ్ కొట్టింది. ఇప్పుడు 2026 ఆసియా క్రీడల్లోనూ అదే సక్సెస్‌ను కంటిన్యూ చేసింది. ఈసారి ఫైనల్లో ఇరాన్‌ను ఓడించి మరో బంగారు పతకాన్ని ముద్దాడింది.

కబడ్డీలో భారత్ హవా

2010 నుంచి ఆసియా క్రీడల్లో మహిళల కబడ్డీని ప్రవేశపెట్టారు. అప్పటినుంచి జరిగిన ప్రతి టోర్నీలోనూ భారత్ గోల్డ్ మెడల్ గెలుస్తూనే ఉంది. కేవలం 2018 జకార్తా గేమ్స్‌లో మాత్రమే ఇరాన్ చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకుంది. ఆసియా క్రీడల కబడ్డీలో భారత్‌కు ఇది 12వ బంగారు పతకం. ఇందులో 1990 నుంచి పురుషుల జట్టు ఎనిమిది గోల్డ్ మెడల్స్ గెలిచింది. ఇక శనివారం జరగనున్న పురుషుల కబడ్డీ ఫైనల్లోనూ ఇరాన్‌తోనే భారత జట్టు తలపడనుంది.

ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన పతకాలివే..

ఇతర క్రీడల విషయానికొస్తే.. పురుషుల మారథాన్‌లో సావన్ బర్వాల్ 2:11:37 టైమింగ్‌తో నేషనల్ రికార్డ్ క్రియేట్ చేసి సిల్వర్ మెడల్ గెలిచాడు. దీంతో ఆసియా క్రీడల మారథాన్‌లో 44 ఏళ్ల భారత్ పతక నిరీక్షణకు తెరపడింది. అలాగే మహిళల 50 మీటర్ల రైఫిల్ 3-పొజిషన్ టీమ్ ఈవెంట్‌లో ఆషీ చౌక్సే, తిలోత్తమ సేన్, విదర్స వినోద్ త్రయం భారత్‌కు రజతం అందించారు. వ్యక్తిగత ఫైనల్లో తిలోత్తమ నాలుగో స్థానంలో, విదర్స ఐదో స్థానంలో నిలిచారు.

స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్‌లో హాంకాంగ్‌కు చెందిన టాంగ్ మింగ్ హాంగ్, లీ కా యి జోడీ చేతిలో ఓడిపోయిన జోష్నా చిన్నప్ప, వేలవన్ సెంథిల్‌కుమార్ ద్వయం బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. ఆర్చరీలోనూ మనవాళ్లు అదరగొట్టారు. పురుషుల రికర్వ్ క్వాలిఫికేషన్‌లో ధీరజ్ బొమ్మదేవర 698 పాయింట్లతో టాప్‌లో నిలవడమే కాకుండా ఆసియా, జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. మహిళల కాంపౌండ్ క్వాలిఫికేషన్‌లో చికిత తానిపర్తి 705 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

బ్యాడ్మింటన్‌లో మలేషియాకు చెందిన వాంగ్ లింగ్ చింగ్‌ను ఓడించి ఉన్నతి హుడా తర్వాతి రౌండ్‌కు చేరుకుంది. మరోవైపు పురుషుల 200 మీటర్ల హీట్స్‌లో సత్తా చాటిన అనిమేష్ కుజుర్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Asian Games 2026: ఆసియా గేమ్స్ లో కబడ్డీలో తిరుగులేని భారత్.. ఫైనల్‌కు దూసుకెళ్లిన పురుషులు, మహిళల జట్లు
Mirabai Chanu: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆసియా గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను