ఏషియన్ గేమ్స్ 2023: ఫైనల్‌కి భారత హాకీ పురుషుల జట్టు.. సెమీస్ చేరిన మహిళా కబడ్డీ జట్టు...

By Chinthakindhi Ramu  |  First Published Oct 4, 2023, 3:40 PM IST

దక్షిణ కొరియాతో  సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 5-3 తేడాతో విజయాన్ని అందుకున్న భారత హాకీ పురుషుల జట్టు... సెమీస్ చేరిన భారత మహిళా కబడ్డీ జట్టు.. 


ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత హాకీ పురుషుల జట్టు, ఫైనల్‌కి అర్హత సాధించింది. దక్షిణ కొరియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 5-3 తేడాతో విజయాన్ని అందుకుని ఫైనల్ చేరింది భారత హాకీ జట్టు. 

తొలి క్వార్టర్‌లో హర్వీక్ సింగ్, మన్‌దీప్ సింగ్, లలిత్ ఉపధ్యాయ్ గోల్స్ చేయడంతో భారత్‌ 3-1 తేడాతో మంచి ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో క్వార్టర్‌లో అమిత్ రోహిదాస్, నాలుగో క్వార్టర్‌లో అభిషేక్ సింగ్ గోల్స్ సాధించారు. సౌత్ కొరియా నుంచి జుంగ్ మంజో ఒక్కడే మూడు గోల్స్ చేసినా విజయాన్ని అందించలేకపోయాడు..

Breaking: India advance into FINAL of Men's Hockey

India BEAT South Korea 5-3 in Semis. | pic.twitter.com/9sD6xVKnjJ

— India_AllSports (@India_AllSports)

Latest Videos

undefined

వరుసగా ఆరు విజయాలతో ఏషియన్ గేమ్స్ 2023 ఫైనల్‌కి చేరిన భారత హాకీ జట్టు, ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే గోల్డ్ మెడల్‌తో పాటు పారిస్‌లో జరిగే 2024 ఒలింపిక్స్‌కి కూడా నేరుగా అర్హత సాధిస్తుంది. 


మహిళల కబడ్డీలో భారత్, సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లింది. థాయిలాండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో 54-22 తేడాతో విజయాన్ని అందుకుంది టీమిండియా.. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పుత్రీ వద్రానీతో మ్యాచ్‌లో 21-16, 21-16 తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్స్‌కి అర్మత సాధించింది.. 
 

భారత స్టార్ బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్, రజతం గెలిచింది. 75 కిలోల మహిళల బాక్సింగ్ విభాగంలో ఫైనల్ చేరిన లోవ్లినా బోర్గోహైన్, చైనా బాక్సర్, వరల్డ్ కప్ మెడలిస్ట్ లి కియాన్‌ చేతుల్లో 0-5 తేడాతో పరాజయం పాలైంది. ఈ విజయంతో రజత పతకంతో పాటు ఒలింపిక్స్‌కి కూడా నేరుగా అర్హత సాధించింది లోవ్లినా బోర్గోహైన్...

బ్యాడ్మింటన్‌ మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప- తనీశా క్రస్టో రెండో రౌండ్ నుంచే నిష్కమించారు. రెండో రౌండ్‌లో మాజీ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మెడలిస్టులు జాంగ్ షుషియన్- జెంగ్ యుతో జరిగిన మ్యాచ్‌లో 13-21, 21-23 తేడాతో పరాజయం పాలైంది భారత బ్యాడ్మింటన్ జోడి..

పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి- చిరాగ్ శెట్టి, ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్‌తో 24-22, 16-21, 21-12 తేడాతో విజయాన్ని అందుకుని, క్వార్టర్ ఫైనల్స్‌కి ప్రవేశించారు.. 

ఆర్చరీలో మాత్రం భారత్‌కి ఆశించిన ఫలితాలు రాలేదు. వ్యక్తిగత పురుషుల విభాగంలో అథాను దాస్, ధీరజ్ క్వార్టర్ ఫైనల్‌లో ఓడిపోయారు. మహిళల వ్యక్తిగత విభాగంలో భజన్, అకింత క్వార్టర్ ఫైనల్‌కి కూడా అర్హత సాధించలేకపోయారు. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లోనూ భారత ఆర్చరీ టీమ్, క్వార్టర్ ఫైనల్‌లోనే ఓడింది. అయితే భారత్ ఆర్చరీ టీమ్‌ ఈవెంట్‌‌లో శుక్రవారం పోటీపడనుంది.


మహిళల 57 కేజీల బాక్సింగ్ విభాగంలో భారత బాక్సర్ ప్రవీణ్ హూడా కాంస్యం గెలిచింది. స్వ్కాష్‌ మిక్స్‌డ్ డబుల్స్‌లో సెమీస్ చేరిన అనహత్ సింగ్- అభయ్ సింగ్ కాంస్య పతకం గెలిచారు. భారత మరో మిక్స్‌డ్ డబుల్స్ స్క్వాష్ జోడి దీపికా పల్లికల్, హారీందర్‌సిగ్ ఫైనల్ చేరారు. 

click me!