
దుబాయ్:
ఆసియా కప్ లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచులో పిసికూన హాంకాంగ్ పై పాకిస్తాన్ విజయం సాధించింది. హాంకాంగ్ తమ ముందు ఉంచిన 117 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ అలవోకగా ఛేదించింది. రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఘన విజయాన్ని అందుకుంది.
ఇమామ్ ఉల్ హక్ అర్థ సెంచరీ చేశాడు. దాంతో స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత షోయబ్ మాలిక్ ఫోర్ తో మ్యాచును ముగించాడు. 23.4 ఓవర్లలోనే పాకిస్తాన్ మ్యాచును ముగించి విజయాన్ని అందుకుంది. మాలిక్ 9 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. ఫకర్ జమామ్ 24 పరుగులు చేసి అవుట్ కాగా, బాబర్ అజామ్ 33 పరుగులు చేశాడు. ఇద్దరు కూడా ఎహషాన్ ఖాన్ బౌలింగులో అవుటయ్యారు.
ఆసియా కప్ లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచులో పాకిస్తాన్ పై తొలుత బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ 116 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్తాన్ బౌలర్ల ముందు పసికూనలు దాదాపుగా చేతులెత్తేశారు. షా చేసిన 26 పరుగులే హాంకాంగ్ బ్యాట్స్ మెన్ చేసి వ్యక్తిగత స్కోర్లలో అత్యధికం కావడం విశేషం.
పాకిస్తాన్ బౌలర్లలో ఉస్మాన్ ఖాన్ మూడు వికెట్లు తీయగా, హసన్ అలీ, షాదాబ్ ఖాన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఫహీమ్ అష్రాఫ్ ఒక వికెట్ తీశాడు. హాంకాంగ్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయింది. ఉస్మాన్ ఖాన్ వేసిన 30.2వ బంతికి ఐజజ్ ఖాన్ (27పరుగులు), 30.5వ బంతికి స్కాట్ మెకెంచి (సున్నా పరుగులు), చివరి బంతికి తన్వీర్ అఫ్జల్ (సున్నా పరుగులు) ఔటయ్యారు.
31 ఓవర్లు ముగిసే సరికి హాంకాంగ్ 8 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. హాంకాంగ్ 44 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్ షాబాద్ ఖాన్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు.