దైవాన్ని తెలుసుకోవడం మానవతరం కాదని ఋషులు, మునులు , యోగులు నిర్ధారించినప్పటికీ అమోఘమైన రచనలతో దైవాన్ని ప్రసన్నం చేసుకున్న అన్నమయ్య, పురందరదాసు, రామదాసు, తులసీదాసుల చరితలు లోకవిదితమే.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
undefined
సమస్త సృష్టిని పరిపాలించే అజ్ఞాతశక్తినే దైవంగా ఆరాధిస్తారు. అనాది నుండి ఋషులు, వేదాలు, ఉపనిషత్తులు దైవానికిచ్చిన నిర్వచనం విభిన్నంగా ఉంది. “మునులకు హృదయంలో, స్వల్ప బుద్ధులకు విగ్రహాలలో, బ్రహ్మవేత్తలకు జగమంతా అంతర్యామి గోచరిస్తాడని” సూక్తి రత్నకోశము బోధించినట్టే ‘ఇందు గలడందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండంటూ’ స్తంభంలో నారసింహుని ప్రత్యక్షం గావించిన ప్రహ్లాదుడి ఘనతను భాగవతం తెలిపింది.
“ కనలేనిది, వినలేనిది , బోధపడనిదనియు, ఆత్మ విచారణతోనే దైవదర్శనం సాధ్యమని” ఋషి వాక్యం కాగా, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ కాళీకామాత అనుగ్రహంతో అద్భుత గ్రంథాలు రచించిన మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణుడు లోకంలో చిరకీర్తి పొందారు. శ్రీరాముని ఆజ్ఞతో పోతనామాత్యుడు భాగవతాన్ని ఆంధ్రీకరించినట్టు కథలున్నాయి.
ఉపనిషత్తులలో ఋషులు పలికిన “నేతి నేతి”( న + ఇతి. ఇతి అనగా అంతం. ‘న’ అనగా లేదు.) శబ్దం దైవాన్ని అనంతుడని బోధిస్తోంది. దైవాన్ని తెలుసుకోవడం మానవతరం కాదని ఋషులు, మునులు , యోగులు నిర్ధారించినప్పటికీ అమోఘమైన రచనలతో దైవాన్ని ప్రసన్నం చేసుకున్న అన్నమయ్య, పురందరదాసు, రామదాసు, తులసీదాసుల చరితలు లోకవిదితమే.
“ విభిన్న మతాలు భగవంతుడిని చేరుకోవడానికి విభిన్న మార్గాలన్న” రామకృష్ణ పరమహంస, “భగవంతుడిని చేరుకోవడానికి మతాలనే రకరకాల దారుల్లో పయనించినప్పటికీ ఒకే చోట భగవంతుడిని కలుసుకుంటారని” వివేకానందుడు పలికినట్టు దైవాన్ని వేర్వేరుగా ప్రచారం చేశాయి మతాలు. “పరమాత్మకు జీవుడికి భేదం లేదని పరమాత్మ నిరాకారుడు సర్వవ్యాపి” యని శంకరాచార్యుని అద్వైత మతం “ పరమాత్మ , జీవాత్మ , జగత్తు మూడూ ఒక్కటేనని వైవిధ్యంగా కనిపిస్తాయని సూర్యునికి కిరణానికున్న సంబంధమే పరమాత్మకు జీవాత్మకు ఉందని” రామానుజాచార్యుల విశిష్టాద్వైతమతం “ ప్రపంచమంతా అంతర్యామి నిండి ఉన్నాడని” వల్లభాచార్యుల శుద్దాద్వైత మతం తెలిపాయి.
భాగవత రహస్యాన్ని వివరిస్తూ “సృష్టిలోని సకల వస్తు ప్రపంచంలోనూ పంచ మహాభూతాలు ఇమిడియున్నా కనిపించనట్టే సర్వభూతాలలో ఆత్మ రూపములో ఉన్నప్పటికీ కనిపించనని” భగవానుడు పలికిన భాగవత తత్వాన్ని శుకమహర్షి ద్వారా ఆలకించి ముక్తిని పొందిన పరీక్షిత్తు కథను భాగవతం వివరించింది.
“లోకోద్ధరణకై భువిపై అవతారమెత్తి చరించినప్పుడే అంతర్యామి దర్శనం సాధ్యమని ”పెద్దలన్నప్పటికీ కాళికా మాతను తిలకించి పులకించిన వారిగా రామకృష్ణ పరమహంస, వివేకానందులను లోకం గుర్తించింది.
విగ్రహరూపంలో అంతర్యామిని పూజించి తృప్తి చెందుతున్న జనులు “కళ్ళు మూస్తే ధ్యానంలోను, తెరిస్తే ప్రకృతిలోనూ దైవాన్ని చూడగలిగే” స్థాయికి చేరగలిగితే అలౌకిక అనుభూతిని, ఆనందాన్ని సొంతం చేసుకోగలరు.