హయగ్రీవునకు ఆ ఆకారం ఉండటానికి వెనుక కూడా ఓ గాథ వినిపిస్తుంది. వేదాపహారియైన రాక్షసుని సంహరించి వేదాలను ఉద్ధరించినవాడని మనకు తెలుస్తుంది. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో పది అవతారాలు మాత్రం దశావతారాలుగా ప్రసిద్ధికెక్కినప్పటికీ, మహాభాగవతంలో ఇరవైకి పైగా అవతారాలు పేర్కొనబడి ఉన్నాయి.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
“జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్
ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే”
హయగ్రీవ స్వామి అంటే చదువుల దేవుడు. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. భారతీయులంతా ఈ రోజు రాఖీ పండగను సోదరులతో ఘనంగా జరుపుకొంటారు. కానీ రాఖీ రోజున మరో ప్రత్యేకత కూడా మనకు ఉంది. అదే హయగ్రీవ జయంతి. ఆ హయగ్రీవ జయంతి ప్రత్యేకత ఏమిటో, ఆ రోజున ఏం చేస్తే ఆ స్వామివారి అనుగ్రహం లభిస్తుందో తెలుసుకుందాం.
హయగ్రీవుడు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమయే ‘హయగ్రీవ జయంతి’. హయగ్రీవుడనగానే సకల విద్యాధి దేవతయైన శ్రీమన్నారాయణుడు ‘హయగ్రీవుని’గా అవతరించాడు. హయగ్రీవుడు అంటే గుర్రపు తల ఉన్నవాడు అని అర్థం. ఒకసారి మధుకైటభులు అనే రాక్షసులు వేదాలను దొంగిలించారట. అప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ధరించి, ఆ మధుకైటభులను వధించి... వేదాలను రక్షించాడు. వేదాలు జ్ఞానానికీ, వివేకానికీ చిహ్నాలు. ఆ వేదాలనే రక్షించాడు కాబట్టి హయగ్రీవుడు జ్ఞాన ప్రదాతగా భావిస్తారు.
హయగ్రీవునకు ఆ ఆకారం ఉండటానికి వెనుక కూడా ఓ గాథ వినిపిస్తుంది. వేదాపహారియైన రాక్షసుని సంహరించి వేదాలను ఉద్ధరించినవాడని మనకు తెలుస్తుంది. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో పది అవతారాలు మాత్రం దశావతారాలుగా ప్రసిద్ధికెక్కినప్పటికీ, మహాభాగవతంలో ఇరవైకి పైగా అవతారాలు పేర్కొనబడి ఉన్నాయి. ఆ అవతారాలలో ‘హయగ్రీవావతారం’ విశిష్టమైనది. ‘హయం’ అనగా గుఱ్ఱం, ‘గ్రీవం’ అనగా కంఠం. అశ్వ ముఖంతో మానవ శరీరంతో వామాంకమున శ్రీ లక్ష్మీదేవితో తెల్లని శరీర ఛాయతో, చతుర్భుజాలతో, శంఖ, చక్ర చిన్ముద్ర పుస్తకాలను దాల్చిన శ్రీమన్నారాయణుడి గురురూపమే హయగ్రీవ స్వరూపం.
రాక్షసులు దొంగిలించిన వేదాలను ఈ హయగ్రీవుడే తిరిగి తెచ్చినట్టు విష్ణు ధర్మోత్తరం చెబుతోంది. శ్రావణ పూర్ణిమ రోజున హయగ్రీవుని విశేషంగా పూజించాలి. ఈ స్వామిని పూజించడంవల్ల విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి. భూ వివాదాలు పరిష్కరించబడతాయి. న్యాయ పోరాటాలలో విజయం లభిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు హయగ్రీవుని పూజించడంవల్ల చదువు బాగా వస్తుంది. శత్రు వినాశనం కూడా జరుగుతుంది. ప్రతిరోజు హయగ్రీవుని స్తుతి చేస్తే లక్ష్మీనారాయణుల శుభాశీస్సులతోపాటు సకల దేవతలు సంపూర్ణ శుభాశీస్సులు కూడా సంప్రాప్తమవుతాయి. ఈ క్రింది స్తోత్రాన్ని హయగ్రీవ జయంతి రోజున ఎన్నిసార్లు వీలయితే అన్నిసార్లు పఠించడం వల్ల శుభాలు కలుగుతాయి.
“జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్
ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే”
jñānānanda mayaṃ devaṃ nirmala sphaṭikākṛtiṃ
ādhāraṃ sarvavidyānaṃ hayagrīvaṃ upāsmahe
ज्ञानानन्द मयं देवं निर्मल स्फटिकाकृतिं
आधारं सर्वविद्यानं हयग्रीवं उपास्महे
పురాణ ఇతిహాసం :- పూర్వం గుర్రపుతల ఉన్న ఓ రాక్షసుడు ఉండేవాడు. తనలాగే గుర్రపు తల ఉన్న వ్యక్తి చేతిలోనే తనకు మరణం ఉండాలన్న వరం ఆ రాక్షసునికి ఉంది. దాంతో అతన్ని సంహరించేందుకు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ఎత్తినట్లు తెలుస్తుంది. ఆ హయగ్రీవుని ఆరాధించడం వలన జ్ఞానము, విజయం లభిస్తాయన్నది పెద్దల మాట.
హయగ్రీవుడు విష్ణుమూర్తి అవతారమే అయినప్పటికీ ఆయనలో సకల దేవతలూ కొలువై ఉన్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. సూర్య, చంద్రులు కళ్లుగా, దేవతలు ఎముకలుగా, అష్టవసువులు పాదాలుగా, అగ్ని నాలుకగా, సత్యం వాక్కుగా, బ్రహ్మ హృదయంగా... ఇలా ఆయనలోని అణువణువూ దేవతామయమని అంటారు. మరి అలాంటి హయగ్రీవుని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుంది కదా!
హయగ్రీవుని ఆరాధన ఇంత విశిష్టమైనది కనుకే కొందరు ప్రత్యేకించి హయగ్రీవుని ఉపాసిస్తారు. అత్యంత నిష్టతో కూడుకున్న హయగ్రీవ ఉపాసన అందరికీ సాధ్యం కాదు కాబట్టి... కనీసం హయగ్రీవ జయంతి రోజున అయినా ఆయనను ఆరాధించాలి. హయగ్రీవుడు లేదా విష్ణుమూర్తి ఉన్న పటాన్ని పూజగదిలో పెట్టుకుని హయగ్రీవ స్తోత్రాన్ని కానీ, హయగ్రీవ అష్టోత్తర శతనామావళిని పఠించాలి.
హయగ్రీవ స్వామి ఆలయాలు:- హయగ్రీవ స్వామి ఆలయాలు భారతదేశమంతటా అనేక ప్రదేశాలలో ఉన్నాయి. హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్న యాదాద్రిలోని లక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంనకు అతి సమీపంలో వంగపల్లి అనే గ్రామం దగ్గర శ్రీ లక్ష్మి హయగ్రీవ ఆలయం ఉన్నది. ఈ ఆలయంలో ప్రతి నెల శ్రవణా నక్షత్రం రోజు విద్యకొరకు పిల్లలకు తేనెతో నాలికపై భీజాక్షరాలు వేస్తారు. ఆ రోజు విశేష పూజలు జరుగుతాయి. ఈ భీజాక్షరాలు ఎవరైనా వేసుకోవచ్చును కానీ మగవారైతే పంచ కట్టుకోవాలి, ఆడవారు చీర కట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది.
పూజ వస్తువులు :- హయగ్రీవునికి తెలుపురంగు పూలు, యాలుకలతో చేసిన మాల, గుగ్గిళ్ల నైవేద్యం చాలా ఇష్టమని చెబుతారు. ఇవన్నీ మనకు అందుబాటులో ఉండేవే కాబ్టటి, వాటిని ఆయనకు అర్పించి ఆయన అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి.
అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి సన్నిదిలో సత్యనారాయణ వ్రత కథ చెప్పే పండితులు ఈ క్రింది మంత్రాన్ని చదివి కథ మెదలు పెడతారు.
హయగ్రీవ స్తోత్రము:-
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం |
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః|| 1 ||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ |
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్మా ప్రవాహవత్|| 2 ||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వనిః |
వి శోభతే చ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః|| 3 ||
ఫలశ్రుతి :
శ్లోకత్రయ మిదం దివ్యం హయగ్రీవ పదాంకితం |
వాదిరాజయత్రిప్రోక్తం పఠతాం సంపదాంప్రదం|| 4 ||
హయగ్రీవుడు జ్ఞానప్రదాత. అందుకనే చాలామంది హయగ్రీవ జయంతిని శుభప్రదంగా భావించి, ఆ రోజున అక్షరాభ్యాసం కూడా చేసుకుంటారు. ఈ రోజు ఆయనను ఆరాధించినవారికి సకల విద్యలు అబ్బుతాయని, అన్ని ఆటంకాలు తొలగిపోతాయనీ చెబుతారు. ఇక హయగ్రీవుడు లక్ష్మీపతి కాబట్టి, ఆయన ఆరాధన వలన సిరిసంపదలకు కూడా లోటు లేకుండా ఉంటుంది. చదువుకునే విద్యార్ధులు ప్రత్యేకించి ఈ హయగ్రీవ జయంతి రోజున ఆయనను ఆరాధించి మీ మనోభీష్టాలన్నింటినీ నెరవేర్చుకోండి.