ఆనందమైన జీవితం.. ఇలా సాధ్యం

By telugu news teamFirst Published Aug 13, 2020, 10:29 AM IST
Highlights

జీవుడు శుద్దత్వంతో జన్మిస్తాడు. సహజ సిద్దంగానే చైతన్య స్వరూపుడు. అజ్ఞానంతో ( మాయ ప్రభావం వల్ల ) తన స్వస్వరూపాన్ని గ్రహించలేక జీవిస్తున్నాడు! కానీ  పుట్టుకతోనే చిత్తశుద్ధి ఉంటే ప్రతి జీవుడు ముక్తుడే. పరమాత్మ పరిపూర్ణ జ్ఞానం కలవాడు. జీవుడు పరిమితి జ్ఞానం కలవాడు.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

ప్రతి మానవుని యొక్క ప్రధాన లక్ష్యం ఆనందంగా జీవించడమే. అలా భావించడం కూడా  సహజమే! దాని  కోసం  జీవుడు దేహేంద్రియములతో బాహ్య ప్రపంచంలోని వస్తు విషయాలలో వెతుకు తున్నాడు. భ్రాంతితో తాత్కాలికమైన సుఖము, సంపదల పట్ల మోహితుడై, అనుభవిస్తూ వాటిలోనే ఆనందం ఉంది అని అనుకుంటాడు. అవే శాశ్వతం అని జీవుడిని ప్రభావితం చేస్తున్నాయి.

అసలు సమస్య జీవునిలోనే ఉంది. శాశ్వతమైన  ఆనందం అనేది ఎక్కడో లేదు. ఆనందం సహజంగా లభించాలంటే నిత్యము, శాశ్వతము, శుద్ధ చైతన్యవంతము, సత్యము, సహజమైన సత్ వస్తువు ప్రతి జీవునిలోనే ఉంది. దానిని తెలుసుకుని ఉండటమే ఆనందం!  ఉన్నది ఒక్కటే, అదే స్వరూప ఆనందం! అదే సచ్చిదానందం!  అదే బ్రహ్మానందం! అదే శాశ్వతమైన ఆనందం. మనస్సు అంతర్ముఖం అయినప్పుడే దాన్ని గ్రహించ గలరు.

జీవుడు శుద్దత్వంతో జన్మిస్తాడు. సహజ సిద్దంగానే చైతన్య స్వరూపుడు. అజ్ఞానంతో ( మాయ ప్రభావం వల్ల ) తన స్వస్వరూపాన్ని గ్రహించలేక జీవిస్తున్నాడు! కానీ  పుట్టుకతోనే చిత్తశుద్ధి ఉంటే ప్రతి జీవుడు ముక్తుడే. పరమాత్మ పరిపూర్ణ జ్ఞానం కలవాడు. జీవుడు పరిమితి జ్ఞానం కలవాడు. అంటే జడమైన భాగం శరీర రూపంలో ఉంది. పరమాత్మలోని చైతన్యం  జీవాత్మగా ఉంది. ఈ రెండింటి యొక్క మిశ్రమ స్వరూపమే జీవుడు! పరిమితి జ్ఞానాన్ని పరిపూర్ణ జ్ఞానంగా మార్చుకోవాలి.

బహిర్ముఖంగా ఉన్న మనస్సును శాశ్వతమైన ఆనందం కోసం అంతర్ముఖంగా అన్వేషణ చేయాలి. ఎప్పుడైతే మనస్సు అంతర్ముఖం అవుతుంతో, అప్పుడు జీవుడు తనకు  తెలీనీ ఎన్నో రహస్యాలను గ్రహించగలడు. సూక్ష్మం లోనే ఉంది మోక్షం. ఒక్కసారిగా మనస్సుని  అంతర్ముఖం చేయాలంటే చాలా కష్టం. దానికి కఠోర సాధన  చేయాలి. చైతన్యవంతమైన జ్ఞానంతో బుధ్ధి ద్వారా మనస్సుని అదుపులోకి తెచ్చుకోవచ్చును.
 
ఎన్నిరకాలుగా ప్రయత్నం చేసిన మనస్సును జయించడం జ్ఞానంతోనే సాధ్యము. చంచలమైన మనస్సుని అధీనంలోకి తెచ్చుకోవాలంటే, అది ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది. జ్ఞానంతో కూడిన వైరాగ్యంతో నిరంతర అభ్యాసం ద్వారా మనస్సును స్వాధీనం చేసుకోవచ్చు.

మనస్సును ఇంద్రియాలతో జోడించకపోతే, చిత్తవృత్తి నిరోధం కలిగి, ఆలోచనలు క్రమేపీ తగ్గి ఆలోచనా రహిత స్థితికి చేరతాడు. అదే తన స్వస్థితి, ఆత్మస్వరూపము!  అదే బ్రహ్మానందం.

నిత్యం, శాశ్వతం, సత్యం అయినది పరమాత్మ ఒక్కటే! మనమందరం ఆ పరమాత్మ అంశములే! కావున మన స్వస్థితిని/ స్వరూపమును అనుభవ పూర్వకంగా గ్రహించి, అనుభూతి పొంది, తాను ఆ పరమాత్మ ఒక్కటే అని నిర్ణయంగా గ్రహించడమే అసలైన సత్యము. అదే అద్వైతసిద్ధి!  అదే ఏకత్వం!! అదే మన అందరి లక్ష్యం.   
 
ఆత్మ సాధనలో గురువు లేకుండా తన స్వస్వరూపమును అంత సులువుగా గ్రహించలేరు!  ప్రతి యొక్క సాధకునికి గురువు తప్పనిసరి! అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవారే గురువు! శిష్యుని అజ్ఞానాన్ని నిర్మూలించే వారే గురువు! గురువు అంటే చీకటి అనే అజ్ఞానం నుండి వెలుగు అనే జ్ఞానం వైపు తన జ్ఞానజ్యోతితో/ బోధతో తరింపజేసేవారు.
   
ప్రతి అవతారమూర్తి,  ప్రతి సద్గురువు ఒక గురువుకి  శిష్యుడే! ఆత్మానుభూతిని పొందిన వారే సద్గురువు! అటువంటి గురువు యొక్క విశిష్టతను సంపూర్ణంగా తెలుసుకుంటే కానీ గురు దర్శనం లభ్యం కాదు. బాల్యంలో ఎంతో మేధస్సు, జ్ఞాన సంపన్నుడు, అవతార పురుషుడైన అద్వైత సిద్ధాంతవేత్త శ్రీ ఆది శంకరాచార్యులు కూడా గురువు యొక్క అవశ్యత ఉండబట్టే గోవింద భగవత్పాదులను గురువుగా స్వీకరించారు! గురు సేవతోనే జ్ఞానార్జన జరుగుతుందని ప్రపంచానికి వెల్లడి చేశారు.

శిష్యునిగా స్వీకరించే ముందు ఎన్నో పరీక్షలకు గురిచేస్తాడు! వాటినన్నిటిని తట్టుకొని నిలబడి విశ్వాసముతో ఉంటేనే శిష్యునిగా స్వీకరిస్తాడు.   ఒకసారి స్వీకరించాక శిష్యుడిని ఎటువంటి పరిస్థితుల్లో వదలడు. తాను ముందుండి మార్గదర్శిగా, అనుగ్రహముతో ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు!

సాధకుడు/ శిష్యుడు, సద్గువుని ఆశ్రయించి ఆత్మ జ్ఞానమును కూలంకషంగా అభ్యసించి, సద్గురువు యందు సంపూర్ణ విశ్వాసముతో ఉండి శరణాగతి కావాలి! అప్పుడు గురువు గారి అనుగ్రహంతో ఆత్మానుభూతి లభిస్తుంది! నీలో ఉన్నది గురువే! ఆ గురువే భగవంతుడు! ఆ భగవంతుడే గురు రూపంలో ఉండి శిష్యుని జీవన్ముక్తుడిని చేస్తాడు.

సద్గురువు/ జ్ఞాని  ఎవరంటే సహజ స్థితిలో వున్నవాడు. సూర్యుడు వంటి వాడు. అతనికి ఎక్కువ తక్కువలు లేవు. తగిన వారు ఎవరో ఒకరు అతని దగ్గరికి వస్తూ వుంటారు. అలా వచ్చిన వారికి తగిన జ్ఞానం అందిస్తారు. జ్ఞాని సంకల్పించి ఇతరులకు అందించ వలసిన అవసరం లేదు.

ఆ సద్గురువు/ జ్ఞానిలో మనస్సు ( అహంకారం ) లేశ మాత్రంగా 0.001% ఉంటుంది! జీవ ఉనికికి ఎంత అవసరమో అంతే ఉంటుంది! లోక కళ్యాణార్ధం జీవ భావములో ఉంటాడు. తను చేయవలసిన కార్యం పూర్తి అయ్యిందని భావిస్తే  వెంటనే విదేహ ముక్తుడవుతాడు.


 

click me!